20-11-2025 12:44:02 AM
సొంత భవనాలు లేని మండల కార్యాలయాలు
మహబూబాబాద్, నవంబర్ 19 (విజయక్రాంతి): పరిపాలన సౌలభ్యం పేరుతో గత ప్రభుత్వం జిల్లాలు, డివిజన్లు, మండలాలను ఏర్పాటు చేసింది. మహబూబాబాద్ జిల్లాలో కొత్తగా తొర్రూరు డివిజన్ తో పాటు పలు మండలాలను ఏర్పాటు చేసినప్పటికీ ఏళ్లు గడుస్తున్నా ఆయా ప్రభుత్వ శాఖలకు సొంత భవనాలను నిర్మించకపోవడంతో అద్దె భవనాల్లోనే కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు.
అనేక మండలాల్లో ప్రైవే టు వ్యక్తుల కు చెందిన ఇరుకు గదుల్లో కా ర్యాలయాలను నిర్వహిస్తుండడం వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అలాగే అధికారులకు, కార్యకలాపాలు నిర్వహించే ఉద్యోగులు సిబ్బందికి సరైన వసతి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభు త్వం రెవెన్యూ ఇటీవల జిల్లాలోని తొర్రూర్ లో డివిజన్ కేంద్రంతో పాటు పెద్ద వంగర, దంతాలపల్లి, చిన్న గూడూరు, గంగారం, ఇనుగుర్తి, సీరోల్ మండలాలను నూతనంగా ఏర్పాటు చేసింది.
అయితే ఇప్పటివరకు ఆ యా మండలాల్లో మండల పరిషత్, తహసిల్దార్, పోలీస్ స్టేషన్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయంతో ఇతర శాఖల అధికారులకు ప్రభు త్వ భవనాలు నిర్మించలేదు. దీనితో ఆయా మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లోనే నిర్వహిస్తున్నారు. పోలీస్ స్టేషన్ కూడా సరైన వసతిలేని అరకొర వసతి ఉన్న ప్రైవేటు అద్దె భవనాల్లోనే నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇలా ఉంటే ప్రతినెల అద్దే భవనాలకు ప్రభుత్వం అద్దె బిల్లులు చెల్లించకపోవడంతో ఇంటి యజమానులు తరచుగా అద్దె బకాయి వసూలు కోసం తాళాలు వేయాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. దీనితో ఇంటి యజమానులతో అధికారులకు ఇంటి అద్దె చెల్లింపు వ్యవహారం తలనొప్పిగా మారింది. పరిపాలన సౌలభ్యం పేరుతో కొత్తగా డివిజన్, మండలాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇప్పటివరకు ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణకు సొంతభవనాలను నిర్మించకుండా నిర్లక్ష్యం చేస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు.
దీనివల్ల ప్రభుత్వ కార్యాలయాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ సరైన వసతి లేక అటు అధికారులు ఇటు ప్రజలు ప్రవక్తలు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. కొన్ని మండలాల్లో అద్దె భవనాలు కూడా సరైన పరిస్థితిలో లేకపోవడం వల్ల రికార్డులను భద్రపరచడం కష్టతరంగా మరిందని చెబుతున్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి కొత్తగా ఏర్పాటు చేసిన తొర్రూరు డివిజన్ కేంద్రంతో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన మండలాల్లో అన్ని ప్రభుత్వ శాఖలకు పక్కా భవనాలను నిర్మించి మెరుగైన వసతి కల్పించి అటు అధికారులకు, సిబ్బందికి, ఉద్యోగులకు ఇటు ప్రజలకు అసౌకర్యాన్ని తొలగించాలని కోరుతున్నారు.