అప్పుల రాజకీయం ఇంకెన్నాళ్లు?
డా. తిరునహరి శేషు :
* తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన మొదటి శాసనసభ సమావేశాలలోనే పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో దరిదాపు రూ.6,71,757 కోట్లు అప్పు చేసినట్లుగా ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. సభలో చర్చించి ప్రజల ముందుపెట్టింది.
గత ప్రభుత్వం రూ.8 లక్షల కోట్లకుపైగా చేసిన అప్పుల వల్లనే రాష్ర్టం ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటుందని ప్రభుత్వం చెబుతుంటే, అప్పుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతున్నదని విపక్ష బీఆర్‌ఎస్ విమర్శలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో రూ.2.46 లక్షల తలసరి అప్పు భారాన్ని మోస్తున్న రాష్ట్ర ప్రజలకు అప్పుల లెక్కలు, వాస్తవాల గురించి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పార్లమెంట్, ఆర్‌బీఐ, కాగ్‌లు ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి వచ్చే అప్పులకి సంబంధించిన సమాచారాన్ని మాత్రమే ఇస్తుంటాయి. కానీ, రాష్ట్ర ప్రభు త్వం మాత్రం ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోని అప్పులతో పాటు కార్పొరేషన్లు, ఎస్పీవీలు గ్యారెంటీలు, నాన్ గ్యారెంటీల ద్వారా సేకరించిన రుణాలను కూడా కలిపి చెప్పటంతో రాష్ట్ర మొత్తం అప్పుల విషయంలో ప్రజలు కొంత అయోమయానికి గురవుతున్నారు.
తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రానికి ఉన్న అన్ని రకాల అప్పులు రూ.90,209 కోట్లు. 2014-2024 వరకు ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో రూ.3,89,673 కోట్ల రుణాలను సేకరిస్తే, ప్రభుత్వ గ్యారంటీలతో ఎస్పీవీలు చేసిన రూ.1,27,208 కోట్ల రుణాలను, ప్రభుత్వ గ్యారంటీలతో ఎస్పీవీలు చెల్లించే రూ.95,462 కోట్ల రుణాలను, ప్రభుత్వ గ్యారంటీ లేని ఎస్పీవీలు చెల్లించే రూ.59,414 కోట్ల రుణాలను మొత్తం కలిపి బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.6,71,757 కోట్ల రుణాలను సేకరించింది. గత ప్రభుత్వం పదేళ్లలో సేకరించిన బడ్జెట్ రుణాలు రూ.3,89,673 కోట్లు అయితే, బడ్జెటేతర రుణాలు మొత్తం రూ.2,82,084 కోట్లు. అప్పుల విషయంలో సీఎం రేవంత్ వాదన ఇలా ఉంది.
తాము అధికారం చేపట్టే నాటికి బడ్జెట్, బడ్జెటేతర రుణాలు మొత్తం రూ.6,71,757 కోట్లతో పాటు, సంక్షేమ పథకాలకి, కాంట్రాక్టర్లకి, సింగరేణికి, ఉద్యోగులకి, డిస్కంలకి నాటి ప్రభుత్వం రూ.1,49,894 కోట్లను బకాయిలు పెట్టిందని, కాబట్టి వాటినీ అప్పుల జాబితాలో చేర్చి బీఆర్‌ఎస్ మొత్తం రూ.8,21, 651 కోట్ల అప్పుల భారం తమపై పెట్టిందని చెప్తున్నారు. ఆ అప్పులకి వడ్డీలు, అసలు చెల్లించటానికే మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయని సీఎం సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ నిర్వహణ కోసం పెద్ద ఎత్తున అప్పులు చేస్తున్నది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా తమ ప్రభుత్వం వచ్చిన ఈ 27 నెలల కాలంలో రూ.3.47 లక్షల కోట్ల అప్పులు చేసిందని ముఖ్యమంత్రి అధికారికంగా ప్రకటించారు.
కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో రూ.3,89,673 కోట్ల రుణాలను సేకరిస్తే, రేవంత్ ప్రభుత్వం 27 నెలలలో రూ. 1,62,000 కోట్ల రుణాలను సేకరించింది. 2023-24 బడ్జెట్‌లో వార్షిక రుణ పరిమితి లక్ష్యం రూ.49 వేల కోట్లుగా ఉంటే, 2026 బడ్జెట్ నాటికి దాన్ని రూ.82 వేల కోట్లకు పెంచారు. 2026-27 బడ్జెట్ పత్రంలో చెప్పినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అప్పు రూ.8,64,000 కోట్లుగా ఉంటే, ఒక్క కేసీఆర్ ప్రభుత్వమే రూ. 8,21.651 కోట్ల అప్పు చేసినట్లుగా చెప్పటం రాజకీయ ఆరోపణగానే చూడాలి.
ఈ వార్షిక సంవత్సరంలో ప్రభుత్వం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న రుణ పరిమితి రూ.82 వేల కోట్లలో అసలు, వడ్డీలకు చెల్లించే పద్దు రూ.41 వేల కోట్లు మాత్రమే. మరి మిగతా రూ.41 వేల కోట్ల రుణాలను ప్రభుత్వం ఏ అవసరాల కోసం వినియోగిస్తుంది? ప్రభుత్వం ఒక నిరంతర ప్రక్రియ. ఏ ప్రభుత్వం కూడా వివిధ కార్యక్రమాలకు పూర్తిస్థాయిలో చెల్లింపులు జరపలేదు. కాబట్టి బకాయిలు పెడుతూనే ఉంటుంది.
ఆ బకాయిలను కూడా అప్పులుగా పరిగణించాలని ముఖ్యమంత్రి రేవంత్ చెబుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.1,09,740 కోట్ల బకాయిలు ఉన్నాయి కాబట్టి, వాటిని కూడా అప్పులలో కలిపి చూపించే ప్రయత్నం రేవంత్ ప్రభుత్వం చేస్తున్నది. దీంతో అప్పుల విషయంలో ప్రభుత్వం ప్రజలకి ఆవాస్తవాలు చెబుతున్నదని బీఆర్‌ఎస్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నది. అయితే ఈ ప్రభుత్వం కూడా డిస్కంలకి, సింగరేణికి, ఉద్యోగులకి కలిపి రూ.లక్ష కోట్లకు పైగానే బకాయి పడింది.
వాటిని కూడా కలిపితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 30 నెలల కాలంలో నాలుగు నుంచి ఐదు లక్షల కోట్ల రూపాయల అప్పు చేసినట్లుగానే భావించాలి. మెట్రో కోసం ప్రభుత్వం ఐఆర్‌ఎఫ్‌సీ నుంచి తీసుకుంటున్న రూ. 13,600 కోట్లు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కార్పొరేషన్ ద్వారా సేకరించిన రూ. 94 వేల కోట్ల రుణాలను ఆస్తులు సృష్టించే రుణాలుగా చూడాలి. అలాంటి ఉత్పాదక రుణాలు రాష్ట్ర భవిష్యత్తుకి, అభివృద్ధికి తోడ్పడతాయి.
రూ.16 వేల కోట్లతో మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పులకుప్పగా చేశారనే విమర్శలు కూడా తరచూ వినపడుతున్నా యి. కానీ, ఒక విభజిత రాష్ర్టం ప్రారంభం లో తన ప్రగతిపథాన్ని నిర్దేశించుకునే సమయంలో కొత్త ప్రాజెక్టులు, ప్రభుత్వ కార్యాలయాలు, హాస్పిటల్, కాలేజీలు నిర్మించుకునే క్రమంలో అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించటానికి తెలంగాణ లాంటి ప్రోగ్రెసివ్ స్టేట్స్ అప్పులు చేయాల్సి వస్తుంది.
ఒక్క 6 గ్యారంటీలకే రాష్ట్ర ప్రభుత్వం ఒక సంవత్సరానికి రూ.50 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అప్పులు చేయాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. రాష్ర్టం ఏర్పాటైన ఈ పుష్కర కాలంలో అప్పులు మాత్రమే పెరగలేదు. రాష్ట్ర ఆదా యం, ఆస్తులు కూడా పెరిగాయి. రాష్ట్ర జీఎస్డీపీ రూ.5 లక్షల కోట్ల నుంచి రూ.18 లక్షల కోట్లకు పెరిగింది. అలాగే రాష్ట్రానికి వచ్చే నెల వారి ఆదాయం కూడా రూ.6 వేల కోట్ల నుంచి రూ.18,500 కోట్లకు పెరిగింది.
ఆర్థిక అంశాలలో గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి ఉన్న స్పష్టమైన తేడా ఏమిటంటే గత ప్రభుత్వం రాష్ట్ర ఆదాయాన్ని పెంచి ఆర్థిక నిర్వహణలో సత్ఫలితాలు సాధించింది. అదే సమయంలో అవినీతి లాంటి సంస్థాగతమైన వైఫల్యాలతో ఆర్థిక క్రమశిక్షణలో వైఫల్యం చెందింది.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గత 30 నెలలుగా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచలేక ఆర్థిక నిర్వహణలో విఫలమైంది. అలాగే రాష్ట్ర జీఎస్డీపీలో అప్పుల శాతం 32.5 శాతానికి చేరుకోవటంతో అప్పులు, అవినీతి, అనుత్పాదక వ్యయాల నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యంతో ఆర్థిక క్రమశిక్షణ కూడా లోపించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దురదృష్టం ఏమిటంటే త్యాగాలతో, ఉద్యమాల ద్వారా ఏర్పాటైన తెలంగాణ రాష్ర్టంలో ప్రభుత్వాలు, పార్టీల ప్రాధాన్య తా క్రమంలో గవర్నెన్స్ కంటే పాలిటిక్స్‌కి ఎక్కువ చోటు దక్కుతున్నది. దీంతో పాలనా సామర్థ్యం పెరగటం లేదు. అలాగే ప్రజా సమస్యలు వెలుగులోకి రావటం లేదనే ఆవేదన ప్రజల నుంచి వ్యక్తమవుతున్నది. భవిష్యత్తులో కూడా అప్పులు ఒక ప్రధానమైన రాజకీయ అంశంగా మారే సూచన లే కనిపిస్తున్నాయి.
ప్రతినెల వివిధ మార్గాల ద్వారా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం రూ.18,500 కోట్లుగా ఉంటే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకి, పాలనా నిర్వహణకి రూ.22,500 కోట్లు అవసరమవుతున్నది. ఈ నేపథ్యంలో రెవెన్యూ లోటుని భర్తీ చేసుకోవటానికి ప్రతినెలా ప్రభుత్వం రూ.4-5 వేల కోట్లను అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వం వృథా వ్యయాలను అనుత్పాదక వ్యయాలను తగ్గించుకొని పొదుపు మంత్రాన్ని పాటిస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవాలి. లేకపోతే రాష్ర్టం రుణ ఊబిలో కూరుకపోయే ప్రమాదం లేకపోలేదు.
వ్యాసకర్త: అసిస్టెంట్ ప్రొఫెసర్, కేయూ, 9885465877






