12 July, 2026 | 2:22 AM

గోదారి జలాలు పరాయిపాలు!

12-07-2026 12:00 AM

డా.ఎర్రోజు శ్రీనివాస్ :

* కాళేశ్వరం లాంటి ప్రతిష్టాత్మక, బహుళ అంచెల భారీ ఎత్తిపోతల పథకం చేతిలో ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయి వాస్తవాలను విస్మరించి, కేవలం ఊహాజనిత భయాలతో కాలయాపన చేయడం ముమ్మాటికీ తెలంగాణ రైతులకు జరుగుతున్న ద్రోహమే అవుతుంది.

కళ్ల ముందే గోదావరి నది ఉరకలెత్తుతోంది. తెలంగాణ వదిలివేసిన నీటితోనే ఆంధ్ర ప్రాజెక్టులు కలకలాడుతున్నాయి. ఇంకా మిగిలిన గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. కానీ, పక్కనే ఉన్న తెలంగాణ పంట పొలాలు మాత్రం చుక్క నీరు లేక ఎండిపోతున్నాయి. నేటి తెలంగాణ వ్యవసాయ క్షేత్రాల దైన్యంగా మొగులువైపు దిగులుగా చూడడం తప్ప మరో మార్గం లేకుండాపోయింది.

తరతరాలుగా తెలంగాణ రైతు అనుభవిస్తున్న ఈ నీటి వేదనకు ముగింపు పలకడానికి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును నిరుపయోగంలో పెట్టారని ఇంజినీరింగ్ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వందలాది టీఎంసీల గోదావరి వరద జలాలు కళ్లముందే సముద్రం పాలవుతుంటే, ఆకాశం వైపు దీనంగా చూస్తూ కన్నీరు మున్నీరవుతున్న రైతాంగాన్ని ఆదుకోవడంలో పాలకులు, అధికారుల ఉదాసీనత స్పష్టంగా కనిపిస్తోంది.

కాళేశ్వరం లాంటి ప్రతిష్టాత్మక, బహుళ అంచెల భారీ ఎత్తిపోతల పథకం చేతిలో ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయి వాస్తవాలను విస్మరించి, కేవలం ఊహాజనిత భయాలతో కాలయాపన చేయడం ముమ్మాటికీ తెలంగాణ రైతులకు జరుగుతున్న ద్రోహమే అవుతుంది.

ఈ నేపథ్యంలో తెలంగాణ ఇంజినీర్స్ ఫోరం, కాళేశ్వరం ప్రాజెక్టుతో గతంలో అనుబంధం ఉన్న విశ్రాంత నీటిపారుదల నిపుణులు లేవనెత్తుతున్న సాంకేతిక వాదనలు, ప్రత్యామ్నాయ మార్గాలు ప్రభుత్వ పెద్దల కళ్లు తెరిపించాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి. మేడిగడ్డ బ్యారేజీపై నెపం వేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టులోని మిగతా అన్ని అంచెలను నిరుపయోగంగా పడావు పెట్టి, ఎల్ నినో లాంటి భయంకరమైన కరువు పరిస్థితుల్లోనూ ఈ ప్రాజెక్టును వినియోగించకపోతే తెలంగాణ ప్రజలకు తీవ్రమైన అన్యాయం చేసినవారు అవుతారు.

నిరుపయోగంగా మిగతా బ్యారేజీలు 

కాళేశ్వరం ప్రాజెక్టులో కేవలం మేడిగడ్డ బ్యారేజీలోని కొన్ని పిల్లర్లు కుంగిపోయిన మాట వాస్తవమే. కానీ, దాన్ని సాకుగా చూపి ఎగువన ఉన్న అన్నారం (సరస్వతి), సుందిళ్ల (పార్వతి) బ్యారేజీలను కూడా నిరుపయోగంగా వదిలేయడం ఎంతవర కు సమంజసం? ఈ రెండు బ్యారేజీలకు అవసరమైన చిన్నపాటి మరమ్మతులు పూర్తయి, ప్రస్తుతం అవి 100 శాతం నీటిని నిల్వ చేయడానికి, తరలించడానికి సిద్ధంగా ఉన్నాయి.

ఈ రెండు బ్యారేజీలను నింపడం ద్వారా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రధాన జలాశయాలను నింపే అద్భుతమైన అవకాశం ఉంది. కానీ, ప్రాథమిక ఇన్‌టేక్ వ్యవస్థను తాకడానికి కూడా అధికారులు నిరాకరిస్తుండడంతో, వేల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ఈ ప్రత్యామ్నాయ నెట్‌వర్క్ అంతా ప్రస్తుతం వృథా పడి ఉంది.

మనకు కటకట జలసిరి

మన పాలకులు, అధికారుల అనాలోచిత వైఖరి వల్ల మన నీరు దిగువకు వృథా గా కొట్టుకుపోతుంటే, పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ మాత్రం ఆ జలాలను అత్యంత చాకచక్యంగా వాడుకుంటోంది. తెలంగాణ వదిలిన వరద నీటిని ఏపీ ప్రభుత్వం ‘పట్టిసీమ ఎత్తిపోతల పథకం’ ద్వారా విజయవంతంగా ఎత్తిపోస్తూ, కృష్ణా డెల్టాను స్థిరీకరిస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీ ద్వారా స్థానిక అవసరాలన్నీ తీరిన తర్వాతే మిగిలిన నీటిని సముద్రంలోకి వదులుతోంది. మన గడ్డపై నది ప్రవహిస్తున్నా, మన కళ్ల ముందే ప్రాజెక్టులు ఉన్నా తెలంగాణ రైతుకు మాత్రం ఎడారే మిగులుతుండటం క్షేత్రస్థాయిలో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

‘రన్- ఆఫ్- ది -రివర్’ విధానం

‘రన్- ఆఫ్- ది -రివర్’ విధానంతో కన్నెపల్లి పంపు హౌస్‌ను నడిపించవచ్చనేది నిపుణుల నిశ్చిత అభిప్రాయం. బ్యారేజీలో నీటిని నిల్వ ఉంచితేనే పంపులు నడపగలమనే పాత నమ్మకాలను విశ్రాంత ఇంజినీ ర్లు పటాపంచలు చేస్తున్నారు. బ్యారేజీ గేట్లు పూర్తిగా తెరిచి ఉంచి, నది సహజ ప్రవాహాన్ని వాడుకుంటూనే నీటిని ఎత్తిపోయడం (రన్ -ఆఫ్ -ది -రివర్) ముమ్మాటికీ సాధ్యమేనని వారు స్పష్టం చేస్తున్నారు.

అదనపు ఒత్తిడి పడదు

గోదావరి, ప్రాణహిత నదుల నుంచి మేడిగడ్డకు కనీసం 50,000 క్యూసెక్కుల వరద వస్తే చాలు... నదిలో నీటి మట్టం సహజంగానే +90 నుంచి +91 మీటర్ల ఎత్తుకు చేరుకుంటుంది. గేట్లు తెరిచి ఉన్నా కూడా ఈ సహజ ఎత్తు (హెడ్) వల్ల నీరు సులభంగా కన్నెపల్లి పంప్ హౌస్ అప్రోచ్ ఛానల్‌లోకి ప్రవహిస్తుంది. దీనివల్ల దెబ్బతిన్న బ్యారేజీ నిర్మాణంపై ఎలాంటి అదన పు ఒత్తిడి పడదు. అటు పంపింగ్ ప్రక్రియ కూడా సజావుగా సాగుతుంది. మోటార్ నడిపిస్తే వాటి కంపనాలతో బ్యారేజీ కుంగిపోతుందని అవాస్తవాన్ని, అపోహను కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా అబద్దం, హాస్యాస్పదం.

వైబ్రేషన్లతో ప్రమాదమేమీ ఉండదు  

కన్నెపల్లి పంప్ హౌస్ నడిపిస్తే వచ్చే వైబ్రేషన్ల (కంపనాల) వల్ల మేడిగడ్డ బ్యారేజీ మరింతగా కుంగిపోతుందనే, పూర్తిగా కూలిపోతుందనే అధికారుల వాదనను నిపుణులు పూర్తిగా కొట్టిపారేస్తున్నారు. భౌగోళికంగా కన్నెపల్లి పంప్ హౌస్ మేడిగడ్డ బ్యారేజీకి దాదాపు 1 నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. పైగా ఈ రెండింటి పునాదులు ఒకదానికొకటి సంబంధం లేని ‘ఐసోలేటెడ్ ఫౌండేషన్స్’. ఇంత దూరంలో ఉన్న పంపుల వల్ల బ్యారేజీ కూలిపోతుందనడం సాంకేతికంగా అత్యంత హాస్యాస్ప దం. ఇది ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి చెపుతున్న సాకులు మాత్రమే.

తక్షణ పరిష్కారం ఇదే

రాజకీయ లెక్కలు, అధికారిక సమస్యలు, పట్టింపులను పక్కనబెట్టి స్వచ్ఛమైన ఇంజినీరింగ్ ప్రతిభకు పదును పెట్టాల్సిన సమయం ఇది. ప్రస్తుతం పనిచేసే స్థితిలో ఉన్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు ఎలాంటి ముప్పు రాకుండానే, ‘రన్- ఆఫ్- ది -రివర్’ పద్ధతిలో నీటిని మళ్లించడం ప్రస్తుత సంక్షోభానికి తక్షణ, ఏకైక మార్గం. ఉరకలేస్తున్న గోదావరిని తెలంగాణ రైతాంగానికి జీవనాడిగా మార్చడానికి ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. లేదంటే, నది పారినా ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు అందించక పంటలు ఎండిబెట్టి కరువు పరిస్థితులలోకి ప్రజలను నెట్టారనే అపకీర్తి పాలకులకు తప్పదు.

 వ్యాసకర్త: తెలంగాణ అధ్యయన సమాలోచన కేంద్రం అధ్యక్షుడు