calender_icon.png 5 February, 2026 | 4:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒడ్డునపడేదెలా?

05-02-2026 01:12:37 AM

దొడ్డు బియ్యం వదిలించుకునేందుకు సివిల్ సప్లయీస్ మల్లగుల్లాలు!

  1. కిలో మరో రూ. 2 తగ్గించి.. టెండర్ పిలిచే ఆలోచనలో పౌరసరఫరాల శాఖ
  2. అయినా రూ. 200 కోట్ల నష్టం.. గోదాములు, రేషన్ దుకాణాల్లో మగ్గుతున్న 1.5 లక్షల టన్నులు
  3. గత రెండు సీజన్లలో సేకరించిన దొడ్డు బియ్యం 24 లక్షల టన్నులు
  4. ఈ ఏప్రిల్‌లో రానున్న మరో 12 లక్షల టన్నులు
  5. ఈ మొత్తం అమ్మితే.. సుమారు రూ. 7000 కోట్ల నష్టం
  6. తీవ్ర గందరగోళంలో సివిల్ సప్లు శాఖ
  7. ముప్పు నుంచి బయటపడేందుకు మంత్రి ఉత్తమ్ ప్రయత్నాలు 

హైదరాబాద్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి) : దొడ్డుబియ్యం వదిలించుకునేందుకు పౌరసరఫరాల శాఖ మల్లగుల్లాలు పడుతోంది. ఇప్ప టికే మూడేండ్లుగా మూలుగుతున్న 1.5 లక్షల టన్నుల దొడ్డు బియ్యాన్ని ఎలాగైనా వదిలించుకుందామని చూసేంతలో.. మరో 24 లక్షల టన్నుల దొడ్డు బియ్యం క్యూలో ఉన్నాయి. ఇదీ కాకుండా.. వచ్చే ఏప్రిల్‌లో మరో 12 లక్ష ల టన్నుల దొడ్డు బియ్యం రానున్నాయి.. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే.. నష్టం మా ట అటుంచితే.. అసలుకే మోసం వచ్చే పరిస్థితి కనపడుతోంది.

దీంతో పౌర సరఫరాల విభా గం ఎలాగైనా ఈ దొడ్డురకం బియ్యం ఇబ్బందులను అధిగమించాలనే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది.  తక్కువ నష్టంతో అయినా ఫరవాలేదు.. పూర్తిగా నష్టపోకుండా చూసుకుంటే అదే పదివేలు అనే పరిస్థితి నెలకొంది. దీనిపైనే మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్ర ఆలోచన చేస్తున్నారు. అటు ప్రజాధనాన్ని నష్టపోకుండా.. ఇటు సర్కారుకు భారం కాకుం డా.. వీలైనంత తక్కువ నష్టంతో బయటపడే మార్గాలను మంత్రి ఉన్నతాధికారులతో సమాలోచనలు చేస్తున్నారు.

1.5 లక్షల టన్నుల బియ్యం.. త్వరలో టెండర్..

గడిచిన మూడేండ్లుగా 1.5 లక్షల టన్నుల దొడ్డు రకం బియ్యం గోదాముల్లో మూలుగుతున్నాయి. ప్రజలకు పూర్తిగా సన్నరకం బియ్యం అందిస్తున్న నేపథ్యంలో.. రాష్ట్రంలోని రైతుల నుంచి సేకరించిన దొడ్డురకం ధాన్యా న్ని మిల్లింగు చేసిన తరువాత.. సెంట్రల్ కోటా కింద ఎఫ్‌సీఐకి బియ్యం ఇచ్చిన తరువాత కూడా 1.5 లక్షల టన్నుల దొడ్డు బియ్యం మిగిలాయి. వాస్తవానికి మొత్తం ఖర్చు చూసుకుం టే.. కిలో రూ. 36.50 పైసలు పడింది.

అయితే, మూడేండ్ల నుంచి కిరాయి చెల్లించి.. వీటిని గోదాముల్లో రక్షిస్తున్నారు. కొంత మొ త్తం రేషన్ డీలర్ల వద్ద, ఎంఎల్‌ఎస్ పాయింట్ల వద్ద ఉన్నాయి. మూడేండ్లుగా అలాగే ఉండటంతో ఇందులో సుమారు 15 నుంచి 20 వేల టన్నుల బియ్యం ఇప్పటికే ఎలుకలు, పందికొక్కులు బారినపడి, అలాగే ముక్కిపోయినట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మిగతావికూడా ఎందుకూ పనికిరానివిగా మారకముందే.. ఏదో ఒక ధర కు విక్రయిస్తే.. తక్కువ నష్టంతో బయటపడవచ్చనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం కిలో రూ. 24 చొప్పున టెండర్ పిలిచింది.

అయితే దీనికి కూడా ప్రైవేటు వ్యాపారస్తులు స్పందించలేదు. అంత ధర తాము పెట్టలేమని ముందుకు రాలేదు. దీనితో ఇప్పుడు మరో రూ. 2 తగ్గిం చి.. కిలోకు రూ. 22తో టెండర్లు పిలవడానికి ప్రయత్నాలు మొదలెట్టింది. మొత్తంగా చూసుకుంటే.. 1.5 లక్షల టన్నుల బియ్యంను రూ. 22 తో అమ్మివేస్తే (రూ. 36.50 పైసలకు కిలో చొప్పున కొనుగోలు చేశారు) ఎంత లేదన్నా సుమారు రూ. 180 నుంచి రూ. 200 కోట్ల వరకు ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుంది.

అయితే, ఈ నష్టం గురించి ఆలోచిస్తూ.. మరిం త జాప్యం చేస్తే.. మొత్తం బియ్యమే పనికిరాకుండాపోయే ప్రమాదం ఉంది. అలా జరిగితే మొత్తం బియ్యాన్ని సముద్రంలో పారబోయాల్సిందే గానీ.. ఎవరు రూపాయికి కూడా కొన రు.  దానికంటే.. రూ. 200 కోట్ల నష్టంతోనైనా ఈ బియ్యాన్ని అమ్మివేయడమే లాభదాయకమని ప్రభుత్వం భావిస్తోంది.  

ఇప్పటికే 24 లక్షల టన్నులు.. త్వరలో మరో 12 లక్షల టన్నులు..

మూడేండ్ల కిందటి దొడ్డు బియ్యం పరిస్థితి ఇలా ఉంటే.. మరో ప్రమాదం సివిల్ సప్లు శాఖను వేధిస్తోంది. గడిచిన రెండు సీజన్లలోనూ రైతుల పండించిన దొడ్డురకం ధాన్యా న్ని కొనుగోలు చేసిన సివిల్ సప్లు విభాగం.. కేంద్రం కోటా కింద ఎఫ్‌సీఐకి పంపించాల్సిన బియ్యాన్ని పంపించింది. అయినా.. ఒక్కో సీజన్‌లో సుమారు 12 లక్షల  టన్నుల దొడ్డు బియ్యం అలాగే ఉన్నాయి. అంటే మొత్తం 24 లక్షల టన్నుల దొడ్డు బియ్యం గోదాముల్లో రెడీగా ఉన్నాయి. వాటి పరిస్థితి ఏంటనే ప్రశ్నకూడా ఉదయిస్తోంది.

దీనిగురించి ఆలోచి స్తుండగానే.. ఈ ఏప్రిల్‌లో.. (ఈ రబీ పంట) మరో 12 లక్షల టన్నుల దొడ్డు బియ్యం రానున్నాయి. అంటే.. ఏప్రిల్-మే నాటికి మొత్తం 36 లక్షల టన్నుల దొడ్డు బియ్యం అందుబాటులో ఉండనున్నాయి. మూడేండ్ల కిందటి 1.5 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యాన్ని వదిలించుకోవ డానికే నానా తంటాలు పడుతున్న పౌరసరఫరాల శాఖ.. రాబోయే నాలుగై దు నెలల్లో 36 లక్షల టన్నుల దొడ్డు బియ్యా న్ని ఏం చేయాలనేది ఇప్పటి నుంచే తొలుస్తున్న ప్రశ్న.

రూ. 7000 కోట్ల నష్టమా... మొత్తం మునిగిపోవడమా?

ఇప్పటి వరకు పరిస్థితిని పరిశీలిస్తే.. 1.5 లక్షల టన్నుల దొడ్డు బియ్యాన్ని రూ. 22లకే అమ్మితే.. సుమారు రూ. 200 కోట్ల నష్టం వస్తుంది. అదే విధంగా 36 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యాన్ని కూడా అమ్మితే మొత్తం సుమారు రూ. 7000 కోట్ల నష్టం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రైతుల నుంచి దొడ్డు రకం ధాన్యం కొనుగోలు చేసి, మిల్లింగ్ చేసి, గోదాములకు తరలించే వరకు ఒక్కో కిలోకు రూ. 36.50 పైసలు ఖర్చు అవుతుంది. అవే దొడ్డు బియ్యా న్ని కిలోకు రూ. 22 లకే అమ్మివేస్తే.. ఎంత లేదన్నా సుమారు రూ. 5000 కోట్లు నష్టపోయినట్టే. దీనితోపాటు వడ్డీ నష్టం కూడా సుమారు రూ. 1000 కోట్ల వరకు ఉంటుంది. వీటన్నింటినీ అమ్మకం పూర్తయి కొనుగోలు చేసినవారు తీసుకెళ్లే వరకు గోదాములకు కిరాయి రూపంలో మరో రూ. 350 కోట్ల వరకు ఖర్చవుతుంది. 

అంటే ఏతావాతా చూసుకుంటే.. మొత్తం సుమారు రూ. 7000 కోట్ల నష్టం వాటిల్లక తప్పని పరిస్థితే కనపడుతోంది. అందుకు ప్రభుత్వం  సిద్ధంగా ఉండకతప్పదు. ఎందుకంటే.. ఏమాత్రం ఆలస్యం చేసినా.. ఇవన్నీ ముక్కిపోయి.. పనికిరాకుండా పోతే.. మొత్తానికి మొత్తమే మునిగిపోయే పరిస్థితి తలెత్తు తుంది. రూ.7వేల కోట్ల నష్టాన్ని భరిస్తే.. ఇం కో రూ. 7 వేల నుంచి రూ. 8 వేల కోట్లన్నా వస్తాయి. లేదంటే.. మొత్తం సుమారు రూ. 14 వేల నుంచి రూ. 15 వేల కోట్లు మొత్తం మునిగిపోక తప్పదు.

రైతుల్లో అవగాహన అవసరం

ప్రస్తుతం మన రాష్ట్రంతో పాటు.. పక్క రాష్ట్రాల్లో.. సమీప దేశాల్లోనూ దొడ్డు బియ్యానికి డిమాండ్ లేదు. మన రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం సన్నబియ్యమే రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేస్తోంది. ఇక సంక్షేమ హాస్టళ్లలోనూ సరేసరి సన్నబియ్యంతోనే భోజనాలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర రైతాంగం సన్న రకం ధాన్యం పండించే దిశగా కొంతమేర మళ్లినప్పటికీ.. పూర్తిగా ఇంకా మరలలేదు. దీనితో ప్రతి సీజన్‌లోనూ వస్తున్న దొడ్డు రకం ధాన్యాన్ని ప్రభుత్వం కొనకతప్పని పరిస్థితి నెలకొంది. 

సన్నరకం ధాన్యానికి క్వింటాలుకు రూ. 500 బోనస్‌ను ప్రభుత్వం ఇస్తోంది. దీనితో సుమారు 8 జిల్లాల్లో ఎక్కువ మంది రైతులు సన్నరకం ధాన్యం వైపు మళ్లారు. మిగిలిన జిల్లాల్లోనూ రైతాంగాన్ని దొడ్డు రకం నుంచి సన్నరకం ధాన్యం వైపు మళ్లించాల్సిన అవసరం ఉంది.  ఇలా ప్రతియేటా నష్టపోయేకన్నా.. అసలు రైతాంగానికి అవగా హన కల్పించి.. వారిని దొడ్డు ధాన్యం నుంచి సన్న ధాన్యం దిశగా మళ్లిస్తే అందరికీ మంచిదనే ఆలోచనలో పౌరసరఫ రాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉన్నట్టు సమాచారం.