తొలి హైబ్రీడ్ పిచ్
హిమాచల్ క్రికెట్ వినూత్న ప్రయోగం
ధర్మశాల: దేశంలోనే తొలి హైబ్రీడ్ పిచ్‌ను హిమాచల్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌పీసీఏ) సోమవారం ఘనంగా ఆవిష్కరించింది. నూతనంగా నిర్మించిన ధర్మశాల స్టేడియంలో సిస్‌గ్రాస్ సాయంతో హైబ్రీడ్ పిచ్‌ను రూపొందించారు. భారత్‌లో ఇదే తొలి హైబ్రీడ్ పిచ్ కావడం విశేషం. ఈ కార్యక్రమానికి ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్, మాజీ ఇంగ్లండ్ క్రికెటర్ పాల్ టేలర్, హైబ్రీడ్ పిచ్ రూపకల్పన చేసిన సిస్ డైరెక్టర్ హాజరయ్యారు. అరుణ్ ధుమాల్ మాట్లాడుతూ.. ‘హైబ్రీడ్ పిచ్ ఆవిష్కరణతో భారత క్రికెట్‌లో కొత్త విప్లవం మొదలైనట్లే. ధర్మశాలలో హైబ్రీడ్ పిచ్‌ను రూపొందించడం ద్వారా ఐకానిక్ స్టేడియాలు ఓవల్, లార్డ్స్ సరసన చేరిపోయింది.’ అని పేర్కొన్నాడు.
హైబ్రీడ్ పిచ్ అంటే?
బంతికి, బ్యాటుకి మధ్య సమతూకం కోసం సిస్‌గ్రాస్ సంస్థ హైబ్రీడ్ పిచ్‌లను రూపొందిస్తోంది. ఈ ట్రాక్‌లలో సహజసిద్ధమైన గడ్డితో పాటు 5శాతం మేర పాలిమర్ కలిసి ఉంటుంది.దీనివల్ల బౌలర్లు స్థిరమైన బౌన్స్ రాబట్టొచ్చు. పిచ్ కూడా చాలాసేపు తేమగా ఉంటుంది. ఇది బౌలర్లకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఇక యూనివర్సల్ అనే యంత్రం సాయంతో సిస్ సంస్థ ధర్మశాలలో హైబ్రీడ్ పిచ్‌ను రూపొందించింది. ఇంగ్లండ్‌లో చాలా మైదానాల్లో ఇప్పటికై హైబ్రీడ్ పిచ్‌లను వాడుతున్నారు. టీ20లతో పాటు కౌంటీ మ్యాచ్‌ల్లోనూ ఈ పిచ్‌ను ఉపయోగిస్తున్నారు.






