12-09-2024 02:20:36 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): తెలంగాణలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐలు) భారీగా పెరుగుతున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(క్యూ1)లో రాష్ట్రానికి రూ.9,023 కోట్ల పెట్టబడులు వచ్చినట్లు కేంద్రం ప్రకటించింది. గతేడాది ఇదే (క్యూ1) సమయానికి రూ.6,829 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంటే.. ఈసారి 32శాతం అధికంగా ఎఫ్‌డీఐలు వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షిస్తున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. గతేడాదితో పోలిస్తే పెరిగిన శాతంలో కూడా మహారాష్ట్రనే అగ్రస్థానంలో నిలిచింది. ఇదిలా ఉంటే.. 2019 24 జూన్ వరకు వచ్చిన మొత్తం ఎఫ్‌డీఐల జాబితాలోనూ తెలంగాణ టాప్ 10లో నిలిచింది. రూ.69,883 కోట్లతో ఏడో స్థానంలో నిలిచినట్లు కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి.
గమ్యస్థానంగా రాష్ట్రం..
గతంలో తెలంగాణ కంటే ఎక్కువగా హర్యానాకు ఎఫ్‌డీఐల ప్రవాహం ఎక్కువగా ఉండేది. కానీ కొంతకాలం నుంచి పారిశ్రామిక, సేవల రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న సంస్కరణలు ఆశాజనకంగా ఉన్నాయి. ఆ చర్యల ఫలితంగా క్రమంగా ఎఫ్‌డీఐలు పెరుగుతూ వస్తున్నాయి. గడిచిన మూడు నెలల్లో గణనీయమైన వృద్ధి నమోదైంది. ఎఫ్‌డీఐల ప్రక్రియను సులభతరం చేస్తూ.. కేంద్రం తీసుకుంటున్న చర్యలు కూడా ఎఫ్‌డీఐలు పెరగడానికి మరో కారణం.
మరోవైపు ఎంటర్‌ప్రెన్యూర్స్, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, ప్రత్యేక పాలసీలను తీసుకొచ్చే దిశగా ముందుకు సాగడం సత్ఫలితాలనిస్తున్నాయి. పారిశ్రామిక పాలసీల రూపకల్పన తర్వాత.. ఎఫ్‌డీఐల ప్రవాహం మరింత పెరగొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థలో ఐఫ్‌డీఐలు కీలకం
2036 నాటికి దేశం ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందని ఇటీవల వరల్డ్ ట్రేడ్ సెంటర్ (డబ్ల్యూసీ) అంచనా వేసింది. కానీ భారత ప్రభుత్వం మాత్రం 2034 నాటికే ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని చూస్తోంది. ఇది జరగాలంటే.. ప్రస్తుతం ఉన్న ఆర్థిక వ్యవస్థ మరింత బలపడాల్సి ఉంది. ఏటా మరో 2శాతం ఎక్కువ వృద్ధి రేటు నమోదు చేయాల్సి ఉంటుంది.
ఈ స్థాయిలో వృద్ధిరేటు నమోదు కావాలంటే, దానిలో ఐఫ్‌డీఐలు పాత్ర కీలకం. దీనిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని పాలసీలను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నది. ఈ పాలసీల రూపకల్పన పూర్తయితే.. మరిన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐలు) రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని నిపుణుల అభిప్రాయం.

