calender_icon.png 10 November, 2025 | 4:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేకిన్ తెలంగాణ భావనను పెంపొందించాలి

12-09-2024 02:24:06 AM

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): రాష్ట్రాన్ని ఉత్పాదక రంగంలో అగ్రగామిలా నిలిపేలా ‘మేక్ ఇన్ తెలంగాణ’ భావనను పెంపొందించాల్సిన అవసరం ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పారిశ్రామిక రంగానికి పిలుపునిచ్చారు. దేశీయ మార్కెట్‌లో తెలంగాణ ఉత్పత్తులకు ఆదరణ ఉండేలా నాణ్యతకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. క్వాలిటీ సర్కిల్ ఫోరం ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ 38వ వార్షిక సదస్సును బేగంపేటలో ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడారు. పరిమాణంపైనే కాకుండా నాణ్యతకు ప్రాధాన్యమిస్తే దేశమంతా మనవైపు చూస్తుందన్నారు.

కృత్రిమ మేథ వినియోగంపై ఉద్యోగులు, కార్మికులు, పరిశ్రమ ప్రతినిధులకు అవగాహన కల్పిస్తామని వెల్లడించారు. వేగంగా విస్తరిస్తున్న కృత్రిమ మేథను అందిపుచ్చుకుని దేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టాలని కోరారు. ఉద్యోగుల సృజనను వెలికితీసి ఉత్పాదకతను పెంచేందుకు క్వాలిటీ ఫోరం చేస్తున్న కృషిని మంత్రి అభినందించారు. క్యాంపస్ టు కార్పొరేట్ అనే మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించడం ప్రశంసనీయమన్నారు.

క్వాలిటీ సర్కిల్ శిక్షణ కార్యక్రమాలకు సహకరించిన ఐసీఐఎల్, ఎన్‌ఎండీసీ, ఆర్టీసీ, థర్మోపాడ్స్, థర్మో కేబుల్స్, ఉషా ఇంటర్నేషనల్, టాటా గ్రూప్, రేణుకా ప్లాస్టిక్, తోషిబా, రామ్‌కో, కేసీపీ సిమెంట్స్, హెచ్‌ఏఎల్, మిధాని, బీఈఎల్ సంస్థలకు మంత్రి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో హైదరాబాద్ ఛాప్టర్ చైర్మన్ బాలకృష్ణరావు, హన్మంతరావు తదితరులు ప్రసంగించారు. 

మంత్రిని కలిసిన కంబర్‌లాండ్ యూనివర్సిటీ ప్రతినిధులు

హైదరాబాద్, సెప్టెంబర్ 11(విజయక్రాంతి): లెబనాన్‌కు చెందిన కంబర్‌లాండ్ యూనివర్సిటీ ప్రతినిధులు బుధవారం సచివాలయంలో ఐటీ, పరిశ్రమల శాఖామంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును కలిశారు. యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ 13వ తేదీన హైదరాబాద్‌లో జరిగే సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఐటీ విషయంలో తీసుకుంటున్న చర్యలను మంత్రి వారికి  వివరించారు. రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి మంత్రి చేస్తున్న కృషిని వర్సిటీ ప్రతినిధులు అభినందించారు.