వరంగల్ కమీషనరేట్ పరిధిలో భారీగా పట్టుబడిన గంజాయి
హనుమకొండ,(విజయక్రాంతి): అడవుల్లో గుట్టుగా గంజాయిని దాచి పోలీసులు కంటపడకుండా గుట్టుగా స్మగ్గింగ్ చేస్తున్న ముఠాను అరెస్టు చేసి దాదాపు నాలుగు కోట్ల విలువైన గంజాయిని వరంగల్ పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ హనుమకొండలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం వరంగల్ జిల్లా ఖానాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని పాకాల అటవీ ప్రాంతంలో చిలుకమ్మ నగర్ గ్రామం దాటిన తర్వాత చిలుకలగుట్ట ఏరియా పైన అనుమానాస్పదంగా కొందరు బస్తా సంచులు పుట్టపై నుంచి తీసుకు వస్తున్నట్లు పోలీసులకు సోమవారం సాయంత్రం సమాచారం అందింది. దీంతో వరంగల్ డ్రగ్ కంట్రోల్ బృందం, ఖానాపురం పోలీసుల ఆధ్వర్యంలోని పోలీసుల బృందం చిలుకలగుట్ట ఏరియాకు వెంటనే వెళ్లి తనిఖీలు చేపట్టారు.
అక్కడ నలుగురు వ్యక్తులు నాలుగు బస్తా సంచుల ను ఒక పల్సర్ వాహనంపై రవాణా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వెంటనే నర్సంపేట రూరల్ సీఐ సాయి రమణ, ఖానాపురం ఎస్ఐ రఘుపతి ఆధ్వర్యంలో అక్కడ ఉన్న నలుగురు అపరిచిత వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి దగ్గర ఉన్న బస్తా సంచులను పరిశీలించగా ఆ సంచుల్లో గంజాయి ఉంది. ఆ నలుగురిని విచారణ చేయగా అడవిలోని చిలుకల గుట్ట పైన మరికొన్ని గంజాయి బస్తాలను దాచి ఉంచినట్లు ఇవన్నీ ఒరిస్సా-ఆంధ్రా బార్డర్ నుంచి తీసుకు వచ్చినట్లు తెలిపారు. ఖానాపురం పోలీసులు, డ్రగ్ కంట్రోల్ టీం ఆధ్వర్యంలో పోలీసులు చిలకలగుట్ట పైకి వెళ్లి వెతకగా అక్కడ దాచి ఉంచిన మరో 19 బస్తాల ఎండు గంజాయి స్వాధీన పరుచుకున్నారు.
నలుగురు ముఠా సభ్యుల అరెస్టు
పోలీసులకు పట్టుబడ్డ నలుగురు నిందితుల లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం గుంపిన గండి గ్రామానికి చెందిన అందాల పాండు రెడ్డి , ఒరిస్సా రాష్ట్రం మల్కనగిరి జిల్లా కలిమెల ప్రాంతానికి చెందిన గుల్లారి మునిరాజ్, ఒరిస్సా రాష్ట్రంలోని మల్కనగిరి జిల్లా చిత్రకొండ ప్రాంతానికి చెందిన కొప్పు కోటయ్యలతో, సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం పోలవరం తండాకు చెందిన భూక్య సాయికుమార్ ఉన్నారు.
ఈ ముఠాలో వీరితోపాటు మరో నలుగురు పరారీలో ఉన్నారని సిపి తెలిపారు. ఒరిస్సా రాష్ట్రంలోని కలిమెల మండలం గుర్రలూరు గ్రామానికి చెందిన రమేష్ , గిల్లమడుగు ప్రాంతానికి చెందిన మజ్జిగ కృష్ణ, నిమ్మలపాలెం ప్రాంతానికి చెందిన రమేష్ తో పాటు ఈ గంజాయిని కొనుగోలు చేస్తున్న వ్యక్తి కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ ప్రాంతానికి చెందిన ప్రకాష్ అనే వ్యక్తిని గుర్తించినట్లు వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని సిపి తెలిపారు.
ఒరిస్సా టు కర్ణాటక గంజాయి సరఫరా
పెద్ద ఎత్తున తరలిస్తున్న ఈ గంజాయిని ఒరిస్సా నుంచి కర్ణాటక రాష్ట్రానికి సరఫరా చేస్తున్నారని సిపి సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. నెలరోజుల క్రితం ఒరిస్సా బోర్డర్ నుంచి 60 గంజాయి ప్యాకెట్లు కారులో తీసుకువచ్చి సూర్యాపేటకు తరలించారని సిపి తెలిపారు. ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ బార్డర్ లోని అటవీ ప్రాంతంలో నిందితులు సేకరించి పోలీసుల కంటపడకుండా కర్ణాటక కు తరలించేందుకు ప్రయత్నించారని ఆ ప్రయత్నంలో భాగంగా పాకాల ఏరియా అటవీ ప్రాంతంలోని రహదారుల వెంబడి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు తనిఖీ చేస్తున్నారని గమనించారని, ఆటో ట్రాలీలో చిలకలగుట్ట పైన పోలీసుల కంటపడకుండా బస్తాలు ఉంచి వాటిపైన వర్షానికి పడకుండా కవర్ కప్పి దాచి పెట్టారని తెలిపారు.
ఈ క్రమంలో అక్కడ నుంచి సూర్యాపేట మీదుగా కర్ణాటక ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా తమ డ్రగ్ కంట్రోల్ టీంకు వచ్చిన పక్కా సమాచారంతో ఖానాపురం పోలీసులు ట, స్పెషల్ పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడిగా జాయింట్ ఆపరేషన్ చేసి పెద్ద ఎత్తున 23 సంచుల గంజాయిని స్వాధీన పరుచుకున్నామని ఆయన తెలిపారు. పట్టుకున్న గంజాయి 763 కిలోలు ఉందని, దీని విలువ రూ. 3,81,92,000 రూపాయల విలువ ఉంటుందని సిపి తెలిపారు.
ఇంత పెద్ద ఎత్తున విలువైన నిషేధిత గంజాయిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్, నర్సంపేట ఏసిపి రవీందర్ రెడ్డి, ఖానాపురం, ఎస్సై రఘుపతి, వరంగల్ స్పెషల్ బ్రాంచ్ ఏసిపి జితేందర్ రెడ్డి, డ్రగ్ కంట్రోల్ టీం, ఏఆర్ సీఐలను, ఆర్ ఐ, ఎస్ఐలను, ఏఆర్ కానిస్టేబుల్ లను అభినందించి నగదు రివార్డులను అందించారు. నిందితులను రిమాండ్ కు తరలిస్తున్నట్లు, మిగిలిన నలుగురు నిందితులను త్వరలోనే పట్టుకొని అరెస్టు చేస్తామని ఆయన తెలిపారు.






