4 September, 2026 | 7:06 AM

బీఆర్‌ఎస్ దొర ఫాంహౌస్‌కే పరిమితం

04-09-2026 | 04:15am

తెలంగాణలో మళ్లీ గెలిచేది కాంగ్రెస్సే

బీఆర్‌ఎస్ పిల్ల కాకుల కారు కూతలు పనిచేయవు

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

కూసుమంచిలో వెయ్యి బైకులతో భారీ ర్యాలీ

ఖమ్మం/కూసుమంచి, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): రాష్ట్రంలో మళ్లీ గెలిచేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) జోస్యం చెప్పారు. గురువారం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా.. కాంగ్రెస్ ఆధ్వర్యంలో వెయ్యి బైకులతో నాయకన్ గూడెం నుంచి కూసుమంచి వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు బీఆర్‌ఎస్ దొరను ఫామ్ హౌస్‌కే పరిమితం చేశారనే అక్కసుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజాపాలనపై బీఆర్‌ఎస్ నేతలు విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 3,475 రోజుల వారి పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక.. పేదలకు ఇందిరమ్మ ఇళ్లిచ్చామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్లకు ఉచిత విద్యుత్, నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇలా ఎన్నో చేసామని వివరించారు.

అసలు పెద్ద దొరనే ఫామ్ హౌస్‌కు పరిమితం అయ్యాడని, పిల్ల కాకులు కారు కూతలు మానుకోవాలని హితవు పలికారు. ప్రజల దీవెనలతో తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చి.. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం పేదల ఇంటి గడపలకు చేర్చి వెయ్యి రోజుల పాలనను పూర్తి చేసుకున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. పాలేరు నియోజకవర్గానికి రూ. కోట్లాది నిధులతో ఎంతో చేశామని, భవిష్యత్‌లో ఇంకెంతో చేస్తానని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.

గత బీఆర్‌ఎస్ పాలనలో పాలేరు రిజర్వాయర్ ను తీవ్ర నిర్లక్ష్యం చేశారని, ఇక్కడి రైతులను విస్మరించి మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలకు నీటిని తరలించారని.. ఇప్పుడు గుడ్డు వచ్చి పిల్లని వెక్కిరించినట్లుగా మాట్లాడడానికి సిగ్గుండాలని తీవ్రంగా హెచ్చరించారు.

పాలేరు అంటేనే కాంగ్రెస్ అని, పాలేరు నియోజకవర్గం అంటే తనకు సొంతిల్లు అని, ఎవరెన్ని పొర్లుదండాలు పెట్టినా మళ్ళీ ఇక్కడ గెలిచేది, నిలిచేది ముమ్మాటికీ కాంగ్రెస్సే అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బజ్జురి వెంకటరెడ్డి, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి హఫీజ్ ఉద్దీన్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్, జూకూరి గోపాలరావు, కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి, పాలేరు సర్పంచ్ బానోత్ నాగేశ్వరరావు పాల్గొన్నారు.