హైబ్రిడ్ బెస్ట్ X అపోహలే
రేవంత్‌రెడ్డి x కిషన్‌రెడ్డి
పెరిగే సీట్లు 50% జీఎస్‌డీపీ.. 50% జనాభా ప్రతిపాదికన తీసుకోవాలి
ఢిల్లీకి పన్నులు కట్టి.. సలామ్ కొట్టాలా?: సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి) : దేశంలోని పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాది రాష్ట్రాలు దేశానికి రాజకీయ రాజధానులైతే.. దక్షిణాది రాష్ట్రాలు ఆర్థిక రాజధానులని సీఎం అభివర్ణించారు. దేశాభివృద్దిలో కీలకపాత్ర పోషిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ వల్ల అన్యాయం జరగొద్దన్నారు. అందుకు నియోజకవర్గాల పెంపు హైబ్రిడ్ ప్రతిపాదికన సీట్లు జరగాలని సీఎం డిమాండ్ చేశారు.
కొత్తగా పెంచే 273 సీట్లలో 50 శాతం (136 సీట్లు) జీఎస్‌డీపీ ప్రతిపాధికన, మరో 50 శాతం (136 సీట్లు) జనాభా ప్రతిపాదికన పెంచితే దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల మధ్య వ్యత్యాసం ఉండదన్నారు. జనాభా ప్రతిపాదికనే డీలిమిటేషన్ చేపడితే దేశానికి అత్యధిక ఆదాయం, జీఎస్‌డీపీని అందిస్తున్న దక్షిణాది రాష్ట్రాలను శిక్షించడమే అవుతుందని, ఇది దేశ మనుగడుకే ప్రమాదకరమని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.
సోమవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, పీసీసీ వర్కింగ్ జగ్గారెడ్డి తదితరులతో కలిసి సీఎం మీడియాతో మాట్లడారు. డీలిమిటేషన్ వల్ల ఉత్తరాదికి అదనంగా 208 సీట్లు పెరిగే అవకాశం ఉందని, అదే జరిగేతే మ్యాజిక్ నెంబ ర్ కోసం దక్షిణాది రాష్ట్రాలతో పనిలేకుండా పోతుందని సీఎం ఆందోళన వ్యక్తంచేశారు.
ఇది దేశ సమగ్ర తకు, రెండు ప్రాంతాల మధ్య సమతుల్యతకు విఘాతం కలిగిస్తుందని అన్నారు. సీట్ల పెంపు తర్వా త దక్షిణాదిలో 195 లోక్‌సభ స్థానాలు, ఉత్తరాదిలో 620 సీట్లు అవుతాయన్నారు. దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల మధ్య ఇప్పుడున్న 210 సీట్ల అంతరం, డీలిమిటేషన్ తర్వాత 412కు పెరుగుతుందన్నారు. ఏన్డీఏ ప్రభుత్వంలో దక్షిణాది రాష్ట్రాలకు ఏమాత్రం ప్రాధా న్యం దక్కడం లేదని చెప్పారు. ‘కేంద్రంలోని కీలక శాఖలేవి దక్షిణాది రాష్ట్రాలకు ఇవ్వడం లేదు.
ఇప్పు డు 50 శాతం సీట్లు పెంచితే తీవ్ర అంతరం ఏర్పడుతుంది’ అని రేవంత్‌రెడ్డి వివరించారు. 50 శాతం వరకు సీట్లు పెంచాలని మోదీకి ఏ దేవుడు చెప్పాడని సీఎం ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి పన్ను లు కట్టడం, ఢిల్లీకి వెళ్లి సలాం కొట్టాలి అన్నట్లుగా ఉందని, పన్నులు కట్టాలి, సలాం కొట్టాలి అనే విధానానికి తాము వ్యతిరేకమని సీఎం స్పష్టం చేశారు.
కేంద్ర పాలిత ప్రాంతమైన గోవాలో 12 లక్షల జనాభాకు రెండు ఎంపీ సీట్లు ఉంటే.. అదే 30 లక్షలకు పైగా ఉన్న మల్కాజిగిరి ఒక పార్లమెంట్ నియోజకవర్గంగా ఉందన్నారు. గోవా జనాభా మేరకు మల్కాజ్‌గిరి 3 పార్లమెంట్ నియోజకవర్గాలుగా కావల్సి ఉందన్నారు.
మహిళా బిల్లును అమలుచేయాలి..
మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ అంశాలు రెండు వేర్వేరని, బీజేపీ మాత్రం ఈ కీలకమైన రెండు అంశాలపై కావాలనే రాజకీయం చేస్తోందని, సొంత వ్యవహారం అన్నట్లుగా వ్యవహారిస్తోందని సీఎం మండిపడ్డారు. ప్రతిపక్షాలు సహకరించడంలేదని బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. 33 శాతం మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతిస్తుందని, ఈ మహిళా బిల్లును ఇప్పడికప్పుడే అ మలు చేయాలన్నారు. డీలిమిటేషన్ ప్రక్రియ విషయంలో తొందపాటు వద్దని సీఎం సూచించారు. డీలిమిటేషన్‌కు 2028 వరకు సమయం ఉన్నందున హడావుడి చేయకుం డా అన్నివర్గాలతో చర్చించాలని, ఆ తర్వాతనే నిర్ణయం తీసుకోవాలన్నారు. మొదట మహిళా బిల్లు ఆమోదించి.. ఆ తర్వాత డీలిమిటేషన్ చర్చ చేయాలన్నారు. డిలీమిటేష న్‌పై ఒక కమిటీ వేపి ప్రజా సంఘాల అభిప్రాయాలు కూడా సేకరించాలని, ఆ తర్వాత చట్టసభల్లో సమంగ్ర చర్చించాలని డిమాం డ్ చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈ బిల్లు అమలు చేస్తే ఎక్కువ మంది మహిళలు చట్ట సభల్లో అడుగుపెట్టేవారన్నారు. ఇప్పుడు 2011 జనాభా మేరకు కాకుండా 2026 జనాభా లెక్కల ప్రతిపాదికన మహిళా రిజర్వేషన్లు అమలుచేయాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.
బీజేపీలో మహిళలను పార్టీ అధ్యక్షులు చేయలేదు?
బీజేపీ 1980లో ఏర్పాటైందని, ఇప్పటివరకు 15 మంది బీజేపీ అధ్యక్షుల నియామకం జరిగినా, ఇప్పటివరకు ఒక మహిళను కూడా పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా నియమించలేదన్నారు. మహిళల పట్ల బీజేపీకి ఉన్న గౌరవం, చిత్తశుద్ది ఏంటో అర్థమవుతున్నదని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీ, సోనియాగాంధీ నాయకత్వంలో ఎక్కువకాలం పని చేసిన కాంగ్రెస్ పార్టీ మహిళలకు అన్యాయం చేసిందా? అని ప్రశ్నించారు. బీజేపీకి మహిళలను అధ్యక్షురాలిగా నియమించుకున్న తర్వాత బండి సంజయ్ మాట్లాడాలని సీఎం హితవు పలికారు. బండి సంజయ్ వ్యాఖ్యలు దక్షిణాది రాష్ట్రాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణను సాధిచారని, ఇప్పుడు పునర్విభజనపైన కూడా పోరాటం చేస్తారని తెలిపారు.
కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు బంట్రోత్ పాత్ర కూడా ఉండదు
గతంలో చిన్న రాష్ట్రాలకు కూడా న్యాయం జరిగేలా సీట్ల కేటాయింపు జరిగిందని, ఇప్పుడు ప్రధాని నరేంద్రమోదీ అన్యాయం చేయాలని చూస్తు న్నారని సీఎం మండిపడ్డారు. కుటుం బ నియంత్రణను దక్షిణాది రాష్ట్రాలు సమర్దవంతంగా అమలుచేస్తే.. ఉత్తరాది రాష్ట్రాలు కుటుంబ ని యంత్రణ చేయకపోవడంతో జానాభా విపరీతంగా పెరిగిందన్నారు . జనాభా అంతరం వల్లనే గతంలో నియోజకవర్గాల పెంపును కేంద్రం వాయి దావేసిందన్నారు.
2026 వరకు సీట్ల పెంపు వద్దని 2001లోనే వాజ్‌పేయ్ సర్కార్ చట్టసవరణ చేసిందని ఆయన గుర్తుచేశారు. ప్రతి రాష్ట్రంలో 50 శాతం సీట్లు పెంచితే ఉత్తరప్రదేశ్, బీహర్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో సీట్లు అధికంగా పెరుగుతాయన్నారు. డీలిమిటేషన్‌తో జరిగే అన్యాయంపై దక్షిణాది రాష్ట్రాల్లోని పార్టీలతో పాటు ఢిల్లీ, పంజాబ్‌లాంటి చిన్న రాష్ట్రాలకు లేఖలు రాస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. 50 శాతం మేరకు సీట్లు పెంచితే దక్షిణాది పాత్రనే ఉండదని, అప్పుడు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు బంట్రోత్ పాత్రలు కూడా ఉండదని సీఎం ఎద్దేవా చేశారు.
అపోహలే
- పునర్విభజనలో దక్షిణాదికి అన్యాయం జరగనివ్వం
- మహిళా కోటాపైనా అపోహలు సృష్టిస్తున్నారు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): నియోజకవర్గాల పునర్విభజనపై సీఎం రేవంత్‌రెడ్డికి అవగాహనలేదని, మహి ళా రిజర్వేషన్ అంశాలపై కూడా అపోహలు సృష్టిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. డీలిమిటేషన్ ప్రక్రియతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదన్నారు. తాము కూడా దక్షిణాదిలోనే ఉన్నామని.. అన్యా యం జరగనివ్వబోమని చెప్పారు. 2011 జనాభా లెక్కల ప్రకారమే డీలిమిటేషన్ జరుగుతుందని, ఈ ప్రక్రియకు రెండేళ్ల సమ యం పడుతుందన్నారు.
డీలిమిటేషన్, మహిళల రిజర్వేషన్లను రాజకీయం చేయొద్దని కాంగ్రెస్‌ను కోరుతున్నామని, ఈ మొత్తం వ్యవహారాన్ని రేవంత్ రెడ్డికే వదిలేస్తున్నానని తెలిపారు. సోమవారం హైదరా బాద్ మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో క్రిటికల్ మినరల్ బ్లాక్స్ 7వ విడత వేలం ప్రారం భం, లైసెన్స్ ప్రారంభ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొని మీడియాతో మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లు దేశంలోని మహిళల గౌరవాన్ని పెంచే చారిత్రక నిర్ణయమని, చట్టసభల్లో 33 శాతం రిజ ర్వేషన్ కల్పించే ఈ నిర్ణయాన్ని రాజకీయంగా చూడకూడదన్నారు.
దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని పెండింగ్‌లో పెట్టింది.. కానీ ప్రధాని నరేంద్ర మోదీ ధైర్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలు దీనిపై రాజకీయాలు చేయకుండా, దేశంలోని 70 కోట్ల మహిళల గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరారు.
దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని చెప్పడం సరైంది కాదని, దేశంలోని అన్ని రాష్ట్రాలకు సమాన న్యాయం జరిగేలా మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ వేర్వేరు అంశాలు కావని, రాజ్యాంగ ప్రక్రియ ప్రకా రం డీలిమిటేషన్ అవసరం ఉంటుందని, దీనికి సమయం పడుతుంది, అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకుంటారని స్పష్టంచేశారు. అపోహలు సృష్టించకుండా, ప్రజలకు నిజమైన సమాచారం ఇవ్వాలని తెలిపారు.
కోల్ రంగంలో మార్పులు..
కోల్ రంగంలో కూడా అనేక మార్పులు తీసుకొస్తున్నామని, కోల్ గ్యాసిఫికేషన్‌ను ప్రోత్సహిస్తూ, కెమికల్స్, సింథటిక్ గ్యాస్, ఎస్‌ఎన్జీ వంటి ఉత్పత్తులను దేశంలోనే తయారుచేసే దిశగా ముందుకెళ్తున్నామని, దీనివల్ల దిగుమతులను తగ్గించే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే రూ. 8,500 కోట్ల ఇన్‌సెంటివ్‌తో ఏడు ప్రాజెక్టులను మంజూరుచేశామని, రాబోయే రోజుల్లో మరిన్ని ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయన్నారు. మైనింగ్ రంగంలో ఎక్స్‌ప్లొరేషన్ కార్యకలాపాల్లో ప్రైవేట్ రంగాన్ని కూడా భాగస్వా మ్యం చేస్తున్నామన్నారు. మొదటి విడత బ్లాక్స్ కేటాయించిన తర్వాత, రెండో విడతను కూడా వేలం ద్వారా అందిస్తున్నామని చెప్పారు. జియాలజీ చదివిన యువతకు ఇది మంచి అవకాశంగా మారుతుందన్నా రు. వరుసగా రెండేళ్లుగా 1 బిలియన్ టన్నుల కోల్ ఉత్పత్తిని సాధించామని, ఇప్పటివరకు 21--25 రోజుల స్టాక్ మాత్రమే ఉండేది.. కానీ ఇప్పుడు 90 రోజుల అవసరానికి సరిపడా 200 మిలియన్ టన్నులకుపైగా కోల్ నిల్వలు ఉన్నాయన్నారు. దేశంలో ప్రైవేట్ రంగంతో పాటు విదేశీ పెట్టుబడులను కూడా ఆకర్షిస్తూ, ఉపాధి అవకాశాలు పెంచేలా మైనింగ్ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. త్వరలో ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఇన్వెస్టర్లకు పూర్తి సమాచారం అందిస్తూ పారదర్శకంగా, పోటీ వాతావరణంలో ఈ వేలాలు నిర్వహిస్తున్నామని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
స్క్రాప్‌లోనూ క్రిటికల్ మినరల్స్..
దేశంలో మైనింగ్ రంగంలో అనేక సంస్కరణలను అమలుచేస్తున్నామని, 2014లో కోల్ బ్లాక్స్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు తర్వాత, నామినేషన్ పద్ధతికి ముగింపు పలికి, పూర్తిగా పారదర్శకమైన ఆక్షన్ విధానాన్ని తీసుకువచ్చామన్నారు. ఇప్పుడు మైనింగ్ బ్లాక్స్‌ను పారదర్శకంగా వేలం ద్వారా కేటాయిస్తున్నామని చెప్పారు. ప్రైవేట్ కంపెనీలు అయినా, ప్రభుత్వ సంస్థలు అయినా.. అందరికీ సమాన అవకాశాలు కల్పి స్తూ పోటీ వాతావరణాన్ని సృష్టించామన్నారు.
దేశానికి అవసరమైన ఖనిజ సంపదను సమర్థవంతంగా వెలికితీయడానికి కృషి చేస్తున్నామని, ప్రపంచవ్యాప్తంగా క్రిటికల్ మినరల్స్ ప్రాధాన్యత భారీగా పెరిగిందని, భారత్ కూడా అనేక దేశాలతో క్రిటికల్ మినరల్స్ విషయంలో ఒప్పందాలు కుదుర్చుకుంటోందన్నారు. మన దేశంలో క్రిటికల్ మినరల్స్ నిల్వలు పరిమితంగానే ఉన్నప్పటికీ, ఉన్న వనరులను గరిష్ఠంగా వినియోగించేందుకు పెద్దఎత్తున చర్యలు తీసుకుంటున్నామరు.
డిఫెన్స్, స్పేస్ టెక్నాలజీ, సోలార్, మొబైల్ ఫోన్లు.. ఇలా ప్రతి రంగం క్రిటికల్ మినరల్స్‌పైనే ఆధారపడి ఉందన్నారు. సాగుకు ఎరువులు కూడా ఈ మినరల్స్‌పైనే ఆధారపడి ఉంటాయన్నారు. కేంద్రం నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ పేరుతో రూ.32వేల కోట్లతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించిందని, దేశవిదేశాల్లో కూడా మైనింగ్ బ్లాక్స్ తీసుకుని, అక్కడి నుంచి మినరల్స్‌ను భారత్‌కు తీసుకురావడం వంటి చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
అర్బన్ మైనింగ్‌పై కూడా దృష్టి సారించామని, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ స్రాప్‌లో కూడా క్రిటికల్ మినరల్స్ ఉన్నాయని, ఫ్రిడ్జ్, ఎయిర్ కండిషనర్లు, మొబైల్ ఫోన్లు వంటి పరికరాల్లో ఉన్న మినరల్స్‌ను సేకరించి, రీసైకిల్ చేసి వినియోగించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. అర్బన్ మైనింగ్‌తో దేశానికి అవసరమైన క్రిటికల్ మినరల్స్‌లో 40 శాతం వరకు పొందే అవకాశం ఉందని, తక్కువ ఖర్చుతో ఈ వనరులను వినియోగించుకునే అవకాశముందన్నారు.






