రహదారి భద్రత పాటిస్తేనే సురక్షిత ప్రయాణం
ఫంక్షన్లలో హెల్మెట్లను బహుమతిగా ఇవ్వండి
అర్రైవ్ అలైవ్ వారోత్సవాల్లో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
గద్వాల ఏప్రిల్13 ప్రతి ఒక్కరూ రహదారి భద్రతను పాటిస్తేనే సురక్షిత ప్రయాణం చేయవచ్చని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాల నేపథ్యంలో సోమవారం గద్వాలలోని అనంత ఫంక్షన్ హాల్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో అర్రైవ్ అలైవ్ పై అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి, ఎస్పీ శ్రీనివాసరావు తో కలిసి కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో రహదారి భద్రతను దృష్టిలో ఉంచుకొని గ్రామస్థాయి రోడ్ సేఫ్టీ కమిటీలు ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకొని నిబంధనలను పాటిస్తూ ప్రయాణాలు చేయాలని సూచించారు.
అనంతరం గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ గతుకుల రోడ్లపైనే కాకుండా జాతీయ రహదారులపై కూడా పెద్ద సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రహదారులు బాగుంటేనే వాహనదారులు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోగలుగుతారన్నారు. ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ శాఖల అధికారులు కూడా రహదారుల విషయంలో దృష్టి పెట్టి ప్రమాదాల నివారణకు తమ వంతుగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గద్వాల మున్సిపల్ చైర్ పర్సన్ జయలక్ష్మి, గద్వాల మార్కెట్ యార్డ్ చైర్మన్ హనుమంతు, డిఎస్పి మొగిలయ్య, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.






