15 July, 2026 | 12:41 AM

వరల్డ్ హెల్త్ హబ్‌గా హైదరాబాద్!

15-07-2026 12:00 AM

ఐదేళ్ల కాలంలో లైఫ్ సైన్సెస్ రంగంలోకి రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులను.. --అంటే, సుమారు 25 బిలియన్ డాలర్లను -ఆకర్షించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ పెట్టుబడులు రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న ఔషధ తయారీ రంగాన్ని మరింతగా బలోపేతం చేయవచ్చు. అయితే 

అంతకంటే గొప్ప అవకాశం రాష్ట్రం ముందు ఉంది. ఇప్పటి వరకు ప్రపంచంలో లేని ఒక కొత్త ‘ఆరోగ్య వ్యవస్థ నిర్మాణం’ (ఆర్కిటెక్చర్ ఆఫ్ హెల్త్)కు హైదరాబాద్ పునాది వేస్తుంది. చికిత్స కంటే వ్యాధి నివారణకు ప్రాధాన్యం ఇచ్చే, ప్రతి వ్యక్తి ఆరోగ్యాన్ని కేంద్రంగా ఉంచుకునే వ్యవస్థను నిర్మించే  అవకాశం ఇప్పుడు తెలంగాణ చేతుల్లో ఉంది. ఈ కీలక నిర్ణయం తీసుకునే సమయం ఇదే.. అని అంటున్నారు ప్రముఖ శాస్త్రవేత్త ఎం.వామన్‌రావు.

ఈ ఏడాది జనవరిలో దావోస్ వేదికపై తెలంగాణ తన ‘నెక్స్ట్-జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026- ఆవిష్కరించింది. రాబోయే ఐదేళ్లలో రూ.2 లక్షల కోట్లు.. దాదాపు 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాలని, తద్వారా 5 లక్షల ఉన్నత ప్రమాణాలు కలిగిన ఉద్యోగాలను సృష్టించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దశాబ్దం ముగిసే సమయానికి ప్రపంచంలోని అగ్రశ్రేణి లైఫ్ సైన్సెస్ క్లస్టర్‌లలో ఒకటిగా నిలవాలనేది స్పష్టమైన లక్ష్యంగా ప్రకటించింది. అంతకుముందు రెండేళ్లలోనే తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగంలో దాదాపు రూ.73,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. ఈ పెట్టుబడులు నిజమైనవి. ఈ అభివృద్ధి వేగం నిజం. ఇప్పుడు ప్రపంచం చూపు హైదరాబాద్‌పై కేంద్రీకృతమయ్యింది. ఇప్పుడు తలెత్తుతున్న అసలైన ప్రశ్న పెట్టుబడులు వస్తాయా, లేదా? అన్నది కాదు.. ఆ నిధులతో హైదరాబాద్ ఎలాంటి భవిష్యత్తును నిర్మిస్తుందనేదే అసలైన ప్రశ్న.

ప్రపంచ ఔషధ కేంద్రం:  గత మూడు దశాబ్దాలుగా ప్రపంచంలోనే అతికొద్ది నగరాలకే దక్కే ఒక అరుదైన కీర్తిని హైదరాబాద్ సొంతం చేసుకుంది. అదే పార్మసీ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచవ్యాప్తగా కోట్లాది మందికి వ్యాక్సిన్లను సరఫరా చేయడం నుంచి సామాన్యులకు అందుబాటు ధరల్లో లభించే జనరిక్ ఔషధాల తయారీ  వరకు హైదరాబాద్ కీలక పాత్ర పోషించింది. నేడు భారతదేశపు మొత్తం ఔషధ ఉత్పత్తిలో సుమారు మూడో వంతు, ఎగుమతులలో దాదాపు ఐదో వంతు తెలంగాణ నుంచే సాగుతోంది. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో యూఎస్‌ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన ఔషధ తయారీ కేంద్రాలు ఉన్న ప్రాంతాలలో తెలంగాణ ఒక టి. అంతేకాకుండా, గ్లోబల్ వ్యాక్సిన్ డిమాండ్‌లో దాదాపు మూడో వంతు ఇక్కడి నుంచే సరఫరా అవుతోంది. 2,000 కంటే ఎక్కువ లైఫ్ సైన్సెస్ కంపెనీలకు నిలయమైన ఈ నగరం, అంతర్జాతీయ ఫార్మాస్యూటికల్ ఆర్థిక వ్యవస్థలో భాగస్వామిగానే కాదు.. ఆ వ్యవస్థ నిలబడటానికి ప్రధాన ఆధారంగా నిలిచింది.

ఈ గొప్ప వారసత్వం ఇటీవల సరికొత్త తరహా పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. ఉత్పత్తి రంగానికే పరిమితం కాకుండా, ప్రపంచంలోనే అతిపెద్ద లైఫ్ సైన్సెస్ సంస్థలైన నోవార్టిస్, ఎలీ లిల్లీ, రోచ్, సనోఫీ, బేయర్, బ్రిస్టల్ మైయర్స్ స్క్విబ్, ఆమ్జెన్‌తోపాటు ఇతర కంపెనీలు ఇప్పుడు హైదరాబాద్‌లో తమ అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాలను (జీసీసీ) నడుపుతున్నాయి. శాస్త్రీయ పరిశోధన, డిజిటల్ ఇంజినీరింగ్ కలగలిసే అత్యంత విలువైన కేంద్రాలు ఇవి.హైదరాబాద్‌ను ఇప్పుడు ‘లైఫ్ సైన్సెస్ సిలికాన్ వ్యాలీ’ అని పిలవడం ప్రారంభించారు. ఇకపై నగరం తీసుకోనున్న నిర్ణయం ఈ బలమైన పునాదిపైనే ఆధారపడి ఉంది.

అణువుల నుంచి మేధస్సు దిశగా: అయితే, హైదరాబాద్ ఏ పరిశ్రమలోనైతే పట్టు సాధించిందో, ఆ ఆరోగ్య రంగం ఇప్పుడు వేగంగా మారుతోంది. ఒకప్పుడు వైద్యరంగం అంటే.. ఔషధ అణువులు, మిల్లీగ్రాముల మోతాదు లు, భారీ స్థాయి తయారీ సామర్థ్యమే ప్రధానమైనవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. నేటి ఆరోగ్య రంగానికి కృత్రిమ మేధస్సు, పర్సనలైజ్డ్ కేర్, ముందస్తు అంచనాలు, నిరంతరమైన ఆరోగ్య పర్యవేక్షణ వంటి అంశాలే కొత్త దిశను నిర్దేశిస్తున్నాయి. వ్యాధి వచ్చిన తరువాత మందులు ఇవ్వడం కంటే.. వ్యాధి రాకముందే ప్రమాదాన్ని గుర్తించడం, వ్యక్తి ఆరోగ్యాన్ని సంవత్సరాలపాటు నిరంతరం పర్యవేక్షించడం, ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం రాకుండా నివారించడం.. ఇవే భవిష్యత్ ఆరోగ్య వ్యవస్థకు అసలైన విలువను తీసుకొస్తున్నాయి.

తెలంగాణ ప్రకటించిన నెక్స్ -జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ కూడా ఇదే మార్పును స్పష్టం గా ప్రతిబింబిస్తోంది. ఈ విధానం ఔషధ తయారీపైనే కాకుండా ప్రెసిషన్ మెడిసిన్, డిజిటల్ హెల్త్, డయాగ్నొస్టిక్స్ వంటి ఆధునిక రంగాలకు పెద్దపీట వేస్తోంది. ఉత్పత్తుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా కాకుండా.. ఆవిష్కరణలకు, పరిశోధనలకు, విలువ ఆధారిత అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోంది. అంతేకాదు, జీవశాస్త్ర రంగాన్ని కృత్రిమ మేధస్సుతో అనుసంధానం చేయడం ద్వారానే భవిష్యత్ వృద్ధి సాధ్యమని ప్రభుత్వం గుర్తించింది. ఇందుకోసం రూ.1,000 కోట్ల లైఫ్ సైన్సెస్ ఇన్నోవేషన్ ఫండ్‌ను ఏర్పాటు చేసింది. పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) కేంద్రాలకు స్వతంత్ర పరిశ్రమ హోదా కల్పించింది. ఇవి చిన్నచిన్న మార్పులు కావు.. రేపటి ఆరోగ్య వ్యవస్థకు బలమైన పునాదులు వేసే వ్యూహాత్మక నిర్ణయ కేంద్రాలు.

ప్రపంచానికి కావాల్సిన మందులు తయారు చేయడంలో హైదరాబాద్ ఇప్పటి కే తన సత్తా చాటింది. అయితే ఇప్పుడు దాని ముందున్న మరింత పెద్ద సవాలు.. ప్రపంచ ఆరోగ్య వ్యవస్థకు రూపకల్పన చేయడం. ఆ లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన సామర్థ్యం, మౌలిక వసతులు, ప్రతిభ ఇతర నగరాల కంటే హైదరాబాద్ నగరానికే ఎక్కువగా ఉన్నాయి.

విభిన్న ప్రతిభల సమన్వయం: ఈ లక్ష్యం ఒక కల మాత్రమే కాదని చెప్పడానికి హైదరాబాద్‌లో ఉన్న ప్రత్యేక పరిస్థితులే నిదర్శ నం. ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో సాఫ్ట్‌వేర్‌ను రూపొందించే వారు ఒక నగరంలో ఉంటే, మందులను అభివృద్ధి చేసే వారు మరో నగరంలో ఉంటారు. కానీ, హైదరాబాద్‌లో మాత్రం ఆ పరిస్థితికి భిన్నం. దేశంలోని అత్యాధునిక సమాచార సాంకేతిక సామర్థ్యంతో పాటు అత్యున్నత లైఫ్ సైన్సెస్ మౌలిక వసతులు ఇక్కడే ఉన్నాయి. ఇంజినీర్లు, జీవశాస్త్రవేత్తలు, ఏఐ పరిశోధకులు, ఔషధ శాస్త్ర నిపుణులు, డేటా సైంటిస్టులు, వైద్యులు ఒకే వేదికపై కలిసి పనిచేస్తున్నారు. ఈ సమన్వయమే హైదరాబాద్‌కు ఉన్న అసలైన బలం. దీని ద్వారా కేవలం మెరుగైన మందులే కాదు.. మరింత తెలివైన, సమర్థమైన ఆరోగ్య వ్యవస్థను కూడా నిర్మించే అవకాశం ఉంది.

అయితే, హైదరాబాద్ భవిష్యత్తు నిర్మాణంలో మరో విషయాన్ని కూడా మరవకూడదు. అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల్లో అమలవుతున్న ప్రతి ఆరోగ్య నియంత్రణ విధానాన్ని యథాతథంగా అనుసరించాల్సిన అవసరం లేదు. అత్యవసర వైద్య సేవలు, ప్రజారోగ్య వ్యవస్థలు మరింత బలోపేతం కావాల్సిందే. కానీ వ్యాధి నివారణకు సంబంధించిన సేవలు, వినియోగదారులను నేరుగా చేరుకునే ఆరోగ్య సేవలను పాశ్చాత్య దేశాల్లో అమలవుతున్న సంక్లిష్టమైన బీమా క్లెయిమ్ విధానాలకు ముందుగానే కట్టిపడేయడం సరైన మార్గం కాదు.

అలాంటి వ్యవస్థల వల్లే అక్కడ ఆరోగ్య సేవలు అత్యంత ఖరీదైనవి గా, కాలానుగుణంగా వస్తున్న మార్పులకన్నా తక్కువ వేగంతో స్పందించేలా మారాయి. దానికి బదులుగా సబ్‌స్క్రిప్షన్ విధానం, పారదర్శకత, వ్యక్తిగత అంగీకారం ఆధారంగా మరింత సమర్థవంతమైన ఆరోగ్య నమూనాలను భారత్ రూపొందించగలదు. గత ఆరు దశాబ్దాలుగా పాశ్చాత్య దేశాలు నిర్మించుకున్న సంక్లిష్టమైన బిల్లింగ్ వ్యవస్థ భారత్‌లో ఎప్పుడూ లేదు. కాబట్టి అదే దారిలో వెళ్లాల్సిన అవసరం కూడా లేదు.

హైదరాబాద్ ముందున్న అవకాశం: ప్రపం చవ్యాప్తంగా జనాభా వేగంగా వృద్ధాప్యంలోకి అడుగుపెడుతోంది. దీర్ఘకాలిక వ్యాధులు అన్ని దేశాల్లో పెరుగుతున్నాయి. చికిత్స ఆధారిత ఆరోగ్య వ్యవస్థల నుంచి.. వ్యాధులను ముందుగానే అంచనా వేసి నివారించే వ్యవస్థల వైపు మారడంలో ప్రపంచ దేశాలన్నీ సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.

ఈ సమయంలో హైదరాబాద్ సరైన ఆరోగ్య మౌలిక వ్యవస్థను నిర్మించగలిగితే ఇకపై ప్రపంచానికి మందులు, వ్యాక్సిన్లే కాదు.. ఆరోగ్య మేధస్సు, ఆధునిక వైద్య విధానాలు, వాస్తవ ప్రపంచ ఆరోగ్య పరిశోధనల ఆధారాలను కూడా ఎగుమతి చేయగలదు. ప్రపంచంలోనే అత్యంత వైవిధ్యభరితమైన రోగుల సమాచారాన్ని ఉపయోగించి కొత్త తరహా ఆరోగ్య నమూనాలకు హైదరాబాద్ కేంద్రంగా మారే అవకాశం ఉంది.

ఈ ప్రయాణంలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు, 5 లక్షల ఉద్యోగాల కల్పన విజయాన్ని కొలిచే ప్రమాణాలు మాత్రమే. కానీ అసలైన లక్ష్యం అంతకంటే గొప్పది. ప్రతి వ్యక్తి ఆరోగ్యాన్ని కేంద్రంగా మలుచుకుని చికిత్స కంటే వ్యాధి నివారణకు ప్రాధాన్యం ఇచ్చే ఏఐని, వైద్యులను భర్తీ చేయడానికి కాదు.. మరింత మందికి నాణ్యమైన వైద్యం అందించేందుకు ఉపయోగించే ప్రపంచంలోనే వినూత్నమైన ఆరోగ్య వ్యవస్థను నిర్మించడం.

‘ప్రపంచానికి మందులు అందించే నగరం’గా హైదరాబాద్ యాదృచ్చికంగా మారలేదు. ప్రభుత్వ విధానాలు, పారిశ్రామికవేత్తల సాహసం, ఇతరులు వెనుకంజ వేసిన రంగాల్లో ముందుకువెళ్లాలనే సంకల్పం ఈ నగరాన్ని ఆ స్థాయికి తీసుకెళ్లాయి. ఇప్పుడు అదే పట్టుదల, అవే ప్రాధాన్యతాంశాలు, లక్షణాలు అవసరం. ఈసారి లక్ష్యం మరింత పెద్దది. పెట్టుబడులు సిద్ధంగా ఉన్నాయి. ప్రపంచ దిగ్గజ కంపెనీలు ఇప్పటికే ఇక్కడ ఉన్నాయి. ప్రతిభ ఉంది.

డిజిటల్ మౌలిక వసతులు సిద్ధంగా ఉన్నాయి. ఇక మిగిలింది ఒక్కటే.. ఈ శక్తులన్నింటినీ ఒకే దిశగా అనుసంధానించే దూరదృష్టి, క్రమశిక్షణ, ప్రపంచ ఆరోగ్య భవిష్యత్తును నిర్మించాలనే మహత్తర సంకల్పం. పాత ఆరోగ్య వ్యవస్థల బంధనాలు భారత్‌కు లేవు. అందుకే కొత్త తరహా ఆరోగ్య వ్యవస్థను నిర్మించడానికి హైదరాబాద్‌కు లభించిన స్వేచ్ఛ, అవకాశం ప్రపంచంలో చాలా కొద్ది నగరాలకే దక్కింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే.. హైదరాబాద్ ప్రపంచానికి మందులు అందించే నగరంగానే కాకుండా, ప్రపంచ ఆరోగ్యానికి దిశానిర్దేశం చేసే నగరంగా చరిత్రలో నిలిచిపోతుంది.

వ్యాసకర్త: ప్రముఖ శాస్త్రవేత్త, 

పారిశ్రామికవేత్త, ఆవిష్కర్త.

డాక్టర్ ఎం.వామన్‌రావు