16 July, 2026 | 12:27 AM

వాంగ్‌చుక్‌కు మద్దతు

16-07-2026 12:00 AM

దేశ విద్యావ్యవస్థలో ఉన్న లోపాలు, వేళ్లూనుకుపోయిన అవినీతి, అక్రమాలు, వరుస ప్రశ్నపత్రాల లీకులు, నియామకాల్లో పారదర్శకత లోపించడం వంటి సమస్యలను నిరసిస్తూ ఆవిష్కర్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్ష పద్దెనిమిదో రోజుకు చేరుకున్నది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోపాటు విద్యావ్యవస్థలో సంస్కరణలే లక్ష్యంగా కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో కొనసాగుతున్న ఈ పోరాటానికి దేశవ్యాప్తంగా పెద్దఎత్తున యువత మద్దతు తెలుపుతున్నారు.

ప్రతిపక్ష నేతలు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలూ సంఘీభావం ప్రకటిస్తున్నారు. అయితే, వాంగ్‌చుక్ ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం కనీసం స్పందించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యను వ్యాపారంగా మార్చే ధోరణి పట్ల గత కొంతకాలంగా యువతలో తీవ్ర అసంతృప్తి నెలకొన్నది. దానికి జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న వాంగ్‌చుక్ దీక్ష ఒక ప్రతిరూపం ఇచ్చింది. ఇది మన దేశంలో విద్యావ్యవస్థ పట్ల పెరుగుతున్న ఆందోళనలకు తార్కాణం.

అయితే, ఒక వ్యక్తి రాజీనామాతో మొత్తం వ్యవస్థ మారిపోతుందా? అని కొందరు వాదిస్తున్నారు. ఒక వ్యక్తి రాజీనామాతో వ్యవస్థ పూర్తిగా మారకపోవచ్చు కానీ, మార్పు దిశగా ఒక అడుగు మాత్రం కచ్చితంగా పడుతుంది. పాలకులకు కనీసం చీమకుట్టినట్టయినా లేకపోవడంతో ప్రతిపక్ష నేతలు, విద్యావేత్తలు, ప్రముఖులు దీక్ష విరమించాలని వాంగ్‌చుక్‌ను కోరుతున్నారు. తక్షణమే దీక్షను విరమించి ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమాన్ని కొనసాగించాలని సూచిస్తున్నారు.

విద్యా సమస్యల పరిష్కారాన్ని కోరుతూ దేశ యువతను ఒకే వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యం నెరవేరిందని, దేశానికి తనలాంటి వారి అవసరం ఉందని, ఈ కుళ్లిపోయిన వ్యవస్థ కోసం ప్రాణాలను పణంగా పెట్టాల్సిన అవసరం లేదని వారు చెబుతున్న మాటలను విస్మరించలేం.

కాగా, కేంద్ర ప్రభుత్వం తీరుపై ఈ ఘటన విస్తృత చర్చకు దారితీసింది. విద్యావ్యవస్థలోని లోపాలపై నిరసన వ్యక్తమవుతుంటే, పాలకులు మౌనం వహించడం సరైన సంకేతం కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రజా ఆందోళనలకు స్పందించడం, చర్చలకు ఆహ్వానించడం, సంస్కరణలపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించడం ఒక ప్రభుత్వ నైతిక బాధ్యత. దేశ భవిష్యత్తును నిర్మించే విద్యావ్యవస్థపై జరుగుతున్న నిరసనలపై సకాలంలో స్పందించకపోతే ప్రభుత్వాలపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుంది. ప్రజాస్వామ్య దేశమైన భారత్‌కు అది ఏమాత్రం శ్రేయస్కరం కాదు.