22 May, 2026 | 7:05 AM

న్యూయార్క్‌లా హైదరాబాద్

19-06-2024 12:22 AM
  • ‘కుష్ మన్ అండ్ వేక్ ఫీల్’ బృందంతో సీఎం రేవంత్ రెడ్డి

సచివాలయంలో అమెరికన్

కంపెనీ ప్రతినిధులతో భేటీ 

హైదరాబాద్, జూన్ 18 ( విజయక్రాంతి): దేశంలోని ఇతర నగరాలతో తాము పోటీ పడటం లేదని, హైదరాబాద్‌ను ప్రపంచంలో పేరొందిన నగరాల సరసన నిలబెట్టాలనేది  తమ సంకల్పమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ నుంచి అమెరికాలో ఉంటున్న వారి సంఖ్య, అక్కడికి వెళ్లి వచ్చే వారి సంఖ్య పెరిగిపోయిందని, అందుకే  న్యూయార్క్‌తో  పోల్చుకునేలా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని సీఎం వెల్లడించారు. ప్రముఖ అమెరికన్ రియల్ ఎస్టేట్ సేవల కంపెనీ కుష్ మన్ అండ్ వేక్ ఫీల్ కు చెందిన ఆసియా పసిఫిక్  సీఈవో  మ్యాథ్యూ భౌ ప్రతినిధి బృందం మంగళవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో భేటీ అయ్యారు.

హైదరాబాద్ గ్లోబల్ సిటీ వృద్ధి చెందుతున్న తీరు, వివిధ రంగాలు విస్తరిస్తున్న తీరుపై ఈ భేటీలో చర్చించారు. గ్రేటర్ హైదరాబాద్ సిటీ దేశంలోనే శరవేగంగా వృద్ధి చెందుతోందని కుష్మన్ అండ్ వేక్ ఫీల్ కంపెనీ ప్రతినిధులు ఈ సందర్భంగా తమ అధ్యయన వివరాలను సీఎం రేవంత్ రెడ్డితో పంచుకున్నారు. గడిచిన ఆరు నెలల్లో రియల్టీతో పాటు లీజింగ్, ఆఫీస్ స్పేస్,  నిర్మాణ రంగం, రెసిడెన్షియల్ స్పేస్‌లోనూ హైదరాబాద్ నగరం గణనీయమైన వృద్ధి నమోదు చేసిందని వారు అభిప్రాయపడ్డారు.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలకు సంబంధించి ప్రతి ఆరు నెలలకోసారి వెల్లడించే తమ నివేదిక జులై నెలాఖరులో వెలువడుతుందని ‘కుష్ మన్ అండ్ వేక్ ఫీల్ ’ ప్రతినిధులు సీఎంకు వివరించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం చేపట్టిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు, రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు రూట్ విస్తరణతో హైదరాబాద్ మరింత అద్భుతంగా తయారవుతుందని వెల్లడించారు. ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

సీఎంను కలిసిన ‘లాక్ హీడ్ మార్టిన్’ కంపెనీ ఇండియా డైరెక్టర్

అమెరికాకు చెందిన ప్రముఖ ఏరోస్పేస్, డిఫెన్స్ తయారీదారు లాక్ హీడ్ మార్టిన్ కంపెనీ ఇండియా డైరెక్టర్ (ఏరోనాటిక్స్) మైఖేల్ ఫెర్నాండెజ్ మంగళవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిశారు. సమావేశంలో లాక్ హీడ్ మార్టిన్ కంపెనీ ప్రతినిధులు, ఐటీ, పరిశ్రమల శాఖ అధికారులు పాల్గొన్నారు.