22 May, 2026 | 8:04 AM

తప్పుడు నిర్ణయాలతో సర్కారుకు చెడ్డ పేరు

19-06-2024 12:20 AM
  • మాకు చెప్పకుండా చేస్తారా? 
  • మద్యం కంపెనీల విధివిధానాలను ఎలా రూపొందిస్తారు? 
  • బేవరేజెస్ కార్పొరేషన్ నిర్ణయాలతో సర్కారుకు చెడ్డ పేరు
  • విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశం
  • ఎక్సుజ్ శాఖపై సమీక్షలో మంత్రి జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): బేవరేజెస్ కార్పొరేషన్ అధికారుల తీరుపై ఎక్సుజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్ అయ్యారు. ప్రభుత్వానికి చెప్పకుండా మద్యం కంపెనీల విధివిధానాలను ఎలా ఖరారు చేస్తారని ప్రశ్నించారు. కార్పొరేషన్ తప్పుడు నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి, ఎక్సుజ్ శాఖకు చెడ్డ పేరు వస్తుందన్నారు. కీలకమైన బాధ్యతల్లో ఉన్నవారు ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. నాంపల్లిలోని ఎక్సుజ్ కార్యాలయంలో అబ్కారీ శాఖపై నాలుగు గంటల పాటు మంత్రి జూపల్లి సమీక్ష నిర్వహించారు.

ఇటీవల ఎక్సుజ్ శాఖలో చోటు చేసుకున్న పరిణామాలపై జూపల్లి మండిడ్డారు. అధికారుల సొంత నిర్ణయాల వల్ల శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగిందని, దీని వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు. ప్రభుత్వానికి చెప్పకుండా విధివిధానాలను ఖరారు చేయడంపై విచారణ జరిపి సమగ్ర నివేదికను సమర్పించాలని ఎక్సుజ్ శాఖ కమిషనర్, ఎండీ శ్రీధర్, బ్రూవరీస్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ అబ్రహంను మంత్రి జూపల్లి ఆదేశించారు. నివేదికను బట్టి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

డ్రగ్ మాఫియాపై ఉక్కుపాదం 

ఉక్కుపాదంతో డ్రగ్ మాఫియాను అణిచివేయాలనే కృతనిశ్చయంతో రేవంత్‌రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. అందుకే మాదకద్రవ్యాలు, అక్రమ మద్యం సరఫరా, కల్తీ కల్లు, గుడుంబా, గంజాయి తదితరాల తయారీ, సరఫరా, అమ్మకాలపై నిరంతర నిఘాను పెట్టాలని అధికారులను అదేశించారు. తయరీదారులు, సరఫరాదారులు, విక్రేతలు, సప్లయర్ నెట్‌వర్క్ జాబితా రూపొందించి, డేటాబేస్ తయారుచేయాలని చెప్పారు. ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపాలన్నారు. యాంటీ నార్కొటిక్ బ్యూరో, పోలీసుశాఖ సమన్వయంతో ఎక్సుజ్ శాఖ అధికారులు పనిచేయాలని, ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు. మాదకద్రవ్యాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై సమాజంలో అవగాహన కల్పించేందుకు మీడియా, సోషల్ మీడియా, థియేటర్లలో ఆడియో, వీడియోలో రూపంలో విస్తృత ప్రచారం నిర్వహించాలని చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపకులతో సమావేశాలు నిర్వహించాలని వారిలో అవగాహన తీసుకురావాలని వెల్లడించారు. మాదకద్రవ్యాల సరఫరాను అరికట్టేందుకు మరింత నిఘా పెట్టాలన్నారు.

ఎంప్లాయి ఫ్రెండ్లీ ప్రభుత్వం

కాంగ్రెస్ ప్రభుత్వం ఎంప్లాయి ఫ్రెండ్లీ అని, ఉద్యోగులు, సిబ్బంది సమస్యలు ఏమైనా ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని సూచించారు. సమర్థంగా విధులు నిర్వర్తించే ఉద్యోగులు, సిబ్బందికి ప్రోత్సహకాలు ఇవ్వాలని చెప్పారు. అధికారుల పని తీరును బట్టి ఇంక్రిమెంట్లు, రివార్డులు, బదిలీల్లో ప్రాధన్యమివ్వాలని సూచించారు. కార్యక్రమంలో ఈ సమావేశంలో ఎక్సుజ్ శాఖ ఉమ్మడి జిల్లాల డిప్యూటీ కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు.