దోమలతో దెబ్బతింటున్న హైదరాబాద్ ఇమేజ్
- అరికట్టేందుకు ప్రభుత్వ చర్యలు శూన్యం
- బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఆగ్రహం
హైదరాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): దోమల బెడదకు భయపడి హైదరాబాద్‌కు ఎవరూ రావడం లేదని, వెంటనే నగరంలో దోమల నివారణకు చర్యలు తీసుకోకపోతే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కు తీవ్రనష్టం జరుగుతుందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి హెచ్చరించారు. సుధీర్‌రెడ్డి గురువారం దోమతెరతో కుట్టించిన గౌన్ వేసుకుని అసెంబ్లీ మీడియా హాల్‌లో మాట్లాడారు. దోమలతో హైదరాబాద్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నోరు తెరిస్తే నోట్లోకి దోమ లు పోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.
దోమలుపై ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, దీంతో డెంగ్యూ, మలేరియాతో పేద ప్రజలు ఆసుపత్రి పాలవు తున్నారని తెలిపారు. దోమలను అరికట్టలేని ప్రభుత్వం అవసరమా అని ప్రజలు భావిస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌ను మూడు ముక్కలు చేసి మరిన్ని సమస్యలకు కారణం అయ్యారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు మాత్రమే కొన్ని నిబంధనలు ఉంటాయని,
దోమల బెడదపై అసెంబ్లీ మీడియా హాల్‌లో దోమ తెరతో మీడియా సమావేశం ఏర్పాటు చేసుకుంటే మార్షల్స్ అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏం సాధించిందని సంబురాలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్ ప్రజలు దోమ తెరలు కుట్టించుకునే పరిస్థితికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే అని విమర్శించారు.




