నాలాలపై నిర్మించిన వాణిజ్య భవనాలు తొలగిస్తాం: హైడ్రా కమిషనర్
- నాలాలపై అక్రమంగా నిర్మించిన వాణిజ్య భవనాలు తొలగిస్తాం
- వచ్చే 4 నెలలపాటు నాలాలపైనే దృష్టి: హైడ్రా కమిషనర్ రంగనాథ్
- ప్యాట్నీ, రసూల్పుర, చికోటి గార్డెన్స్ ప్రాంతాల్లో పర్యటన
- నాలాల ఆక్రమణలపై హైడ్రా స్పెసల్ డ్రైవ్
నాలాల కబ్జాలపై హైడ్రా దృష్టి పెట్టింది. సోమవారం ప్రజావాణిలో నాలాల కబ్జాలపై ఫిర్యాదులను అందుకున్న హైడ్రా గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. జీహెచ్ ఎంసీ, ఇరిగేషన్, ఎస్ఎన్డీపీ ప్రాజెక్ట్ అధికారులతో పాటు కంటోన్మెంట్ సీఈవో మధుకర్ నాయక్ తో కలసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్ర స్థాయిలో పర్యటించారు. ముందుగా హస్మత్‌పేట, పికెట్ నాలాలను పరిశీలించారు. ప్యాట్నీ వద్ద 17 మీటర్ల వెడల్పుతో ఉన్న నాలా పై భాగంలో 150 మీటర్ల మేర కేవలం ఆరేడు మీటర్లకే పరిమితం అయినట్టు గుర్తించారు. దీంతో మహేంద్ర హిల్స్, పికెట్, జేబీఎస్, బాలంరాయ్, విమాన్‌నగర్ తదితర ప్రాంతాలు నీట మునుగుతున్నాయని చెబుతూ... పాత చిత్రాలను స్థానికులు చూపించారు. ప్యాట్నీ వద్ద ఇటీవల కాలంలో కాలువను 17 మీటర్ల మేర విస్తరించినా హస్మత్‌పేట, పికెట్ నాలాలు కలిసిన చోట కుంచించుకుపోవడాన్ని స్థానికులు చూపించారు. నాలా కబ్జాలకు గురి కావడంతో వేలాది యిల్లు ప్రతిసారి నీట మునుగుతున్నాయని వాపోయారు. ఈ మేరకు కంటోన్మెంట్ అధికారులకు గతంలో ఫిర్యాదు చేశామని, హైడ్రాకు గత సోమవారం ఫిర్యాదు అందజేశామన్నారు.






