21 April, 2026 | 6:58 PM

నేను మోదీ సైనికురాలిని

09-05-2024 02:42 AM

మహబుబ్‌నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ

కేశంపేట్‌లో ఎదురుపడిన బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు డీకే అరుణ, వంశీచందర్‌రెడ్డి

కొద్దిసేపు ఇరు కార్యకర్తల మధ్య తోపులాట 

సర్దిచెప్పి పంపించిన పోలీసులు

రంగారెడ్డి, మే 8 (విజయక్రాంతి): నేను మోదీ సైనికురాలిని.. మమ్మల్ని భయపెట్టాలి అని చూస్తే ఊరుకోబోమని, తమకు అన్నీ తెలుసు అని, మంచిగా ఉంటే మర్యాదగా ఉంటాం అంటూ మహబుబ్‌నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ కాంగ్రెస్ నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం కేశంపేట్‌లో ఆమె రోడ్‌షో చేపట్టారు. అదే సమయంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచందర్‌రెడ్డి కూడా మండలంలో  ప్రచారం నిర్వహిస్తుండగా, ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు ఎదురుపడ్డారు. దీంతో బీజేపీ ప్రచార వాహనాలు ముందుకు కదలకుండా పోలీసులు బారికేడ్లు అడ్డుపెట్టారు. ఇది గమనించిన బీజేపీ నేతలు పోలీసులు కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యహరిస్తున్నారంటూ ఆరోపించారు. ఇరు పార్టీల నేతలు కొద్ది సేపు వాగ్వాదంతోపాటు నినాదాలు చేశారు.

పోలీసులు ఇరు పార్టీల నేతలను సముదాయించి ఎలాంటి గొడవ జరగకుండా చూశారు. అక్కడి నుంచి వంశీచందర్‌రెడ్డి కొండారెడ్డిపల్లికి వెళ్లారు. అనంతరం డీకే అరుణ ప్రచారం కొనసాగించారు. ఈ సందర్భంగా ఆమె  మాట్లాడుతూ.. అధికారం ఉంది కదా అని కాంగ్రెస్ నేతలు ఇష్టానుసారం వ్యహరిస్తున్నారని, అధికారం శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలని హితవుపలికారు. తాను బీజేపీ అభ్యర్థినని, తాము కాంగ్రెస్ అరాచకాలను అడ్డుకోలేమా? ఆ సత్తా లేదని అనుకుంటున్నారా? అని హూంకరించారు. కాంగ్రెస్ నేతలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా అంతిమ విజయం బీజేపీదేనని ఆమె ధీమా వ్యక్తంచేశారు.