ఇవే నా చివరి ఎన్నికలు
ఎన్నికల్లో ఆశీర్వదిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి
నిజామాబాద్, మే 8 (విజయక్రాంతి): ఇవే తనకు చివరి ఎన్నికలు అని.. ఈ ఎన్నికల్లో ఆశీర్వదించాలని నిజామాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్‌లో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ రెడ్డితో రోడ్డు షోలు, కార్నర్ మీటింగ్‌లు నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తెలిపారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు పదేళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. నిజామాబాద్ జిల్లాకు సాగునీరు అందించేందుకు ముఖ్య ఆధారమైన ప్రాణహిత చేవెళ్ల 21 ప్యాకేజీ పనులను బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, మాజీ సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు అని చెప్పుకుంటున్న మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఈ పనులపై ఎందుకు నిర్లక్ష్యం చేశారని ప్రశ్నించారు. తనను ఎంపీగా గెలిపిస్తే ఏడాదిలోగా ప్యాకేజీ 21 పనులు పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు.
గతంలో ఎంపీగా ఉన్న కవిత నిజామాబాద్ అభివృద్ధిపై నిర్లక్ష్యం చూపారని, ప్రస్తుతం ధర్మపురి అరవింద్ కూడా ఐదేళ్లలో చేసిన అభివృద్ధి ఏం లేదని విమర్శించారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని, చక్కెర ఫ్యాక్టరీలు తెరిపిస్తానని చెప్పి హామీలు నెరవేర్చలేదని అన్నారు. తనకు ఇవే చివరి ఎన్నికలు అని, తనను గెలిపిస్తే నిజామాబాద్ పార్లమెంటు అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. తన వయసు, సీనియారిటీ, అంకితభావం గుర్తించి ఈ ఎన్నికల్లో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.






