calender_icon.png 18 November, 2025 | 7:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెళ్లిపోయేందుకు సిద్ధంగా లేం

18-11-2025 12:20:24 AM

  1. బలవంతం వెళ్లగొడితే.. ప్రాణాలను కూడా తెగిస్తాం...
  2. ఆదిమ గిరిజన కొలాం సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సొనేరావ్
  3. చెట్లకు కట్టేసి కొడతామని గతంలోనే హెచ్చరించా... 
  4. అటవీ శాఖ అధికారులపై ఎమ్మెల్యే వెడ్మ మండిపాటు

ఉట్నూర్, నవంబర్ 17 (విజయక్రాంతి) : దేశానికి స్వాతంత్య్రం రాకముందు నుంచే ఆదివాసీ బిడ్డలం అడవులలో నివాసముంటూ జీవనం కొనసాగిస్తున్నామని, ప్రభుత్వాలు చట్టాలను వారికి అనుకూలంగా మర్చుకోని ఇప్పుడు తమల్ని ఇళ్లు నిర్మించుకోకుండా  అటవీ ప్రాంతాల నుంచి వెళ్లగొట్టేందుకు కుట్ర లు పన్నుతున్నారని వారు వెళ్లగొడితే తాము వెళ్లిపోయ్యేందుకు సిద్ధంగా లేమని ఆదిమ గిరిజన కొలాం సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొడప సొనేరావ్ హెచ్చరించారు.

ఆదివాసీ కొలాం కులస్తుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఐటీడీఏ ఉట్నూర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ముందు ర్యాలీగా ఐటీడీఏ కార్యాలయానికి చేరుకున్నారు.

తమ అభివృద్ధిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయని అంటూ ఆయా ప్రభుత్వాలకు వ్యతిరేకం గా నినాదాలు చేశారు.  ఈ సందర్భంగా కొడప సొనేరావ్ మాట్లాడుతూ అధికారులు పీవీటీజీల అభివృద్ధికి సహకరిస్తామని అంటునే పక్కా ఇళ్లు నిర్మాణం చేసుకోకుండా అటవీ శాఖ అధికారులు అడ్డుపడుతున్నారని విమర్శించారు. ఇళ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తే ఉన్న గుడిసేను తొలగించి చలిలో చిన్న పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

తాము ఏమీ వలసవాదులం కదాని, తాతా, ముతత్తాల కాలం నుంచి అటవీ ప్రాంతాలలో నివాసముంటున్నామన్నారు. 1930, 1947, 1956 కంటే ముంద నుంచి ఎవరు అటవీ ప్రాంతాలలో నివాసముంటున్నారో ప్రభుత్వాలు తెలుసుకోవాలన్నారు. అసలు అటవీ దొంగలను అధికారులు పట్టుకోకుండా బలవంతం గా ఫొటోలు తీసి అమాయకులైన కొలాం కులస్తులపై కేసులు నమోదు చేసి జైళుకు పంపుతున్నారన్నారు. తమ సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. 

ఆదివాసీల ధర్నా విషయం తెలుసుకున్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్తో కలిసి ధర్నా ప్రాంతానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... అటవీ ప్రాంతాలలో నివాసముంటున్న ఆదివాసులకు ఇబ్బందులకు గురి చేయడం, అభివృద్ధిని అడ్డుకుంటే చెట్లకు కట్టేసి కొడతామని గతంలోనే అధికారులకు హెచ్చరికలు జారీ చేయడం జరిగిందని అన్నారు. పీవీటీజీల సమస్యలపై సీఎంతో పాటు సంబంధిత అటవీ శాఖ మంత్రితో మాట్లాడం జరిగిందన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తనతో పాటు ఐటీడీఏ పీవో దృష్టికి తీసుకు రావాలన్నారు.

పీవీటీజీల ఇండ్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 3.75 లక్షలు, కేంద్ర ప్రభుత్వం రూ. 1.75 లక్షలు ఇవ్వడం జరుగుతుందన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండి ఆదివాసుల సమస్యలపై అధికారులతో గొడవ పడుతునని పేర్కొన్నారు. ఎవరైనా అధికారులు తన దృష్టికి సమస్యను తీసుకురాకుండా బలవంతంగా ఆదివాసులను అటవీ ప్రాంతం నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తే సహించేది లేదన్నారు. ఆదివాసుల ఒపిక నశిస్తే వారిని ఆపే తరం ఎవరిది కదన్నారు. పీవీటీజీల సమస్య పూర్తి స్థాయిలో పరిష్కరం అయ్యేలా కృషి చేస్తానని, సమస్య పరిష్కరం కాకపోతే పీవీటీజీలు తన ఇంటి ఎదుట వచ్చి ధర్నా చేయవచ్చాన్నారు. 

జిల్లా స్థాయి అధికారులు ఏసీలలో ఉంటూ కింది స్థాయి అధికారులను బాధ్యులు చేయడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిమ గిరిజన కొలాం సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుమ్ర రాజు, గౌరవ అధ్యక్షుడు టేకం లక్ష్మణ్, జిల్లా అధ్యక్షుడు మడావి గోవింద్ రావ్, ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆత్రం జలపత్రావ్, టేకం గణేష్, మడావి కిషన్, మహిళ సంఘం నాయకురాలు నాగుబాయి, లక్ష్మీబాయి, రాజ్గొండ్ సేవా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంగం విషం రావ్, ఆదివాసీ సంఘాల నాయకులు టేకం వసంత్రావ్, కుర్సేంగే తానాజీ, పుర్క బాపురావ్, పెందూర్ పుష్పరాణి, రితేష్ రాథోడ్, సెడ్మకి ఆనంద్రావ్, కొడప రాము, కుమ్ర జలపత్రావ్, తదితరులు పాల్గొన్నారు.