1 March, 2026 | 8:19 PM

ప్రమాదకరంగా మారిన లక్ష్మాపురం రోడ్డు

01-03-2026 06:56 PM

10 సంవత్సరాలైనా పట్టించుకోని నాయకులు, సంబంధిత అధికారులు

తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు, ప్రజలు

తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా నాగారం మండల పరిధిలోని లక్ష్మాపురం గ్రామానికి వెళ్లే రహదారి రాళ్లు తేలి, అడుగడుగునా గుంతల మయమై నడవడానికి కూడా అనుకూలంగా లేక అటు వాహనదారులు ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గడచిన పది సంవత్సరాలుగా కాశి తండా నుండి లక్ష్మాపురం ఎక్స్ రోడ్డు వరకు అక్కడి నుండి గుండెపూరి వరకు రోడ్డు శిధిలావస్థలో ఉన్నది. కాశి తండా నుండి నాగారం వెళ్లాలన్న తుంగతుర్తి వెళ్లాలన్న లక్ష్మాపురం రోడ్డు గుండా వాహనదారుల ప్రయాణిస్తుంటారు.

దీంతో ఈ రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ క్రమంలో రోడ్డు గుంతల మయమై పాడవడంతో ఆపదలో ఉన్నవారు, అనారోగ్యంతో ఉన్నవారు, బాలింతలు గర్భిణీ స్త్రీలు ఈరోడ్డు గుండా ప్రయాణం చేయాలంటే బిక్కుబిక్కుమంటూ ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోడ్డుపైన కంకర తేలి ఉండటంతో రాళ్లు తగిలి గుంటలలో వాహనాలు పడి ప్రమాదాలు జరిగిన సంఘటనలు అనేకం.గత పాలకులు 10 సంవత్సరాలుగా ఈ రోడ్డును పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజా పాలనలో భాగంగా ఎమ్మెల్యే మందుల సామెల్ గెలిచిన తర్వాత నాగారం మండలంలో మొదటి మీటింగు లక్ష్మాపురం గ్రామంలో ఏర్పాటు చేసి,

కంకర ఎత్తి నెత్తిన పెట్టుకొని తీసుకపో... వారం రోజులలో రోడ్డు నిర్మాణం పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. వారం పది రోజులలో రోడ్డు వేస్తామని హామీ ఇచ్చారు. దీంతో లక్ష్మాపురం, కాశి తండ గ్రామాల ప్రజలు రోడ్డు నిర్మాణం చేపడతారని ఈ సమస్య పరిష్కారం అవుతుందని సంతోషం వ్యక్తం చేశారు. కానీ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటివరకు ఈ రోడ్డును పట్టించుకునే నాధుడు లేడు. పస్తాల ఎక్స్ రోడ్డు నుండి పస్తాల గ్రామం వరకు తారు రోడ్డు సాంక్షన్ చేశారు కానీ లక్ష్మాపురం కాశి తండ రోడ్డును మరిచిపోయారు.

ఇప్పటికైనా ఎమ్మెల్యే మందుల సామేల్, జిల్లా కలెక్టర్ అధికారులు స్పందించి తక్షణమే రోడ్డును వేయాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా లక్ష్మాపురం అలుగు వద్ద రోడ్డు ప్రమాదకరంగా ఉందని, వర్షాకాలం చెరువు నిండి అలుగుపోసినప్పుడు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ఇటు నుండి అవతలికి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుందని,ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.