calender_icon.png 28 September, 2025 | 2:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఐ లవ్ మహమ్మద్’ హింసాత్మకం

28-09-2025 01:10:43 AM

-కాన్పూర్‌లో మొదలై.. దేశమంతటికీ విస్తరిస్తున్న వివాదం

-ప్లకార్డులతో మొదలై.. లాఠీచార్జీలు, కేసులు, అరెస్టుల వరకు

-మతగురువు తౌఖీర్ రజా అరెస్ట్... 

-బరేలీ జిల్లాలో 48 గంటల పాటు ఇంటర్‌నెట్ సేవలు బంద్

-నన్ను మరిచిపోయావా మౌలానా అంటూ సీఎం యోగి వార్నింగ్

లక్నో, సెప్టెంబర్ 27: ఉత్తర్‌ప్రదేశ్ ‘ఐ లవ్ మహమ్మద్’ నిరసనలతో అట్టుడుకుతోంది. చిన్నగా మొదలైన ఈ వివాదం చిలికి, చిలికి గాలి వానలా తయారయింది. కాన్పూర్‌లో ఓ చిన్న పోస్టర్‌తో మొదలై ప్రస్తుతం రాష్ట్రం తో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు కూడా వ్యాపించింది. బరేలీలో శుక్రవారం నాటి అల్లర్లకు కారణమని భావిస్తూ.. ఇత్తేహాద్ కౌన్సిల్‌కు చెందిన మతగు రువు మౌలానా తౌఖీర్ రజా ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తౌఖీర్ రజాతో పాటు మరో ఏడుగురిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. వీరికి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించిందని జిల్లా మేజిస్ట్రేట్ అవినాష్ సింగ్ తెలిపారు.

పోలీసులు అరెస్టు చేసిన వారిలో సర్ఫరాజ్, మనీఫుద్దీన్, అజీమ్ అహ్మద్, మొహమ్మద్ షరీఫ్, మొహమ్మద్ అమీర్, రెహాన్, మొహమ్మద్ సర్ఫరాజ్ ఉన్నారు. వీరి అరెస్ట్ తర్వా త తప్పుడు వార్తలు, అసత్య సమాచారం వ్యాప్తి చెందకుండా ఉండేందుకు బరేలీ జిల్లాలో 48 గంటల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. లా అండ్ ఆర్డర్‌ను కాపాడేందుకు ఇంటర్నెట్‌పై నిషేధాజ్ఞలు తప్పనిస రి అని మేజిస్ట్రేట్ అవినాష్ సింగ్ తెలిపారు. ఐ లవ్ మహమ్మద్ అల్లర్లపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ.. రజాకు పలు హెచ్చరికలు జారీ చేశారు. ఇక దీనికి వ్యతిరేకంగా హిందూ వర్గాల వారు ‘ఐ లవ్ మహా దేవ్’ నినాదం ఇచ్చారు. పోలీసుల చర్యను ప్రతిపక్ష పార్టీలు తప్పుబడుతున్నాయి. 

అసలేంటీ ఐ లవ్ మహమ్మద్ వివాదం? 

మిలాద్ సమయంలో కాన్పూర్‌లో బారావఫాత్ ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో కొంత మంది ముస్లిం యువకులు ‘ఐ లవ్ మహమ్మద్’ అని రాసిన ప్లకార్డులను ప్రదర్శించారు. హిందూ సంఘాలు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఐ లవ్ మహమ్మద్‌కు వ్యతిరేకంగా ‘ఐ లవ్ మహాదేవ్’ నినాదం ఇచ్చా యి. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి కొంత మందిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం మాత్రమే కాకుండా పలు పోస్టర్లను కూడా తొలగించారు.

అక్కడితో ఆగకుండా ముస్లిం వర్గానికి చెందిన మౌలానా తౌఖీర్ రజా వంటి వారు పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపుచ్చారు. మౌలానా పిలుపుతో ముస్లిం వర్గం ప్రజలు శుక్రవారం బరేలీలోని కొత్వాలి మసీదులో ప్రార్థనల అనంతరం పెద్ద ఎత్తున గుమిగూడి.. పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. నిరసనకారులను అదుపుచేసేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. కాన్పూర్‌లో పోలీసు చర్యను ఖండిస్తూ.. ఇత్తేహాద్ కౌన్సిల్ మతగురువు బరేలీలో నిరసనలకు పిలుపునివ్వగా.. ఈ పరిణామం చోటు చేసుకుంది. అక్కడ కూడా ప్లకార్డులు, బ్యానర్లతో పెద్ద ఎత్తున జనం గుమిగూడగా పోలీసులు లాఠీ చార్జ్ చేసి వారిని చెదరగొట్టారు.  

నేనున్నానని మరిచావా మౌలానా?

ఈ వివాదంపై ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. వికసిత్ యూపీ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. హెచ్చరికలు జారీ చేశారు. మతగురువు తౌకీర్ రజా ఖాన్‌ను హెచ్చరించారు. ‘నిన్న రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నారో ఓ మౌలానా మర్చిపోయారు. అతడు కోరుకున్నప్పుడల్లా వ్యవస్థలను ఆపగలనని అనుకుంటున్నాడు. రోడ్స్ బ్లాక్, కర్ఫ్యూ ఉండదు. భవిష్యత్ తరాలు అల్లర్లు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకునేలా చర్యలు తీసుకుంటాం. 2017 నుంచి రాష్ట్రంలో కర్ఫ్యూను అనుమతించడం లేదు’ అని పేర్కొన్నారు. ఐ లవ్ మహమ్మద్ నిరసనలకు పోటీగా పలువురు ఐ లవ్ మహదేవ్ పేరిట బ్యానర్లు ప్రదర్శిస్తున్నారు. యువత పెద్ద ఎత్తున ఐ లవ్ మహాదేవ్ అని పచ్చబొట్లు వేయించుకుంటున్నారు. 

అల్లర్లు ముందస్తు కుట్ర:డీఐజీ

మతగురువు అరెస్టును బరేలీ జిల్లా కలెక్టర్ అవినాష్ సింగ్, ఎస్పీ అనురాగ్ ఆర్య ధ్రువీకరించారు. డీఐజీ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. శుక్రవారం నాటి అల్లర్లపై ముందస్తుగా కుట్ర చేసి ప్రణాళిక రచించారని తెలిపారు. బరేలీలో బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 163 అమల్లో ఉందని తెలిపారు. ఈ సెక్షన్ ప్రకారం సామూహికంగా గుమిగూడకూదు. ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పోలీసు చర్యలను తప్పుబట్టారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో మొదలైన ఈ వివాదం ఉత్తరాఖండ్, కర్ణాటక రాష్ట్రాలకు కూడా పాకింది.