23-02-2026 08:29:48 PM
పీఎం శ్రీ జడ్పీహెచ్‌ఎస్ నుంచి 9 మంది విద్యార్థులకు జాతీయ స్కాలర్షిప్
సిద్దిపేట రూరల్: జాతీయ మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్షిప్ (ఎన్‌ఎంఎంఎస్) పరీక్ష ఫలితాల్లో పీఎం శ్రీ జడ్పీహెచ్‌ఎస్ జక్కాపూర్ పాఠశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. ఈరోజు ప్రకటించిన ఫలితాల్లో పాఠశాలకు చెందిన మొత్తం 9 మంది విద్యార్థులు స్కాలర్షిప్‌కు అర్హత సాధించడం పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది.
ఒక్క పాఠశాల నుంచి ఇంతమంది విద్యార్థులు ఎంపిక కావడం పట్ల ప్రధానోపాధ్యాయురాలు కొమ్మూరి పద్మ ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థులను నిరంతరం ప్రోత్సహిస్తూ విజయానికి దారితీసిన ఉపాధ్యాయ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. కృషి, పట్టుదలతో ప్రతిభ చాటుకున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
గత ఆరు సంవత్సరాలుగా ఎన్‌ఎంఎంఎస్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తూ జక్కాపూర్ ఉపాధ్యాయ బృందం ఆదర్శంగా నిలుస్తోందని పలువురు ప్రజాప్రతినిధులు, విద్యాభిమానులు ప్రశంసించారు. స్కాలర్షిప్‌కు ఎంపికైన విద్యార్థులకు ప్రతి సంవత్సరం రూ.12,000 చొప్పున నాలుగు సంవత్సరాల పాటు ఉపకార వేతనం అందనున్నట్లు పాఠశాల వర్గాలు వెల్లడించాయి. ఆర్థిక సహాయం వారి ఉన్నత విద్యాభ్యాసానికి తోడ్పడనుంది.