కామ్రేడ్ కళ్యాణ్ కోసం కొత్త భాష మాట్లాడా!
కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కామ్రేడ్ కళ్యాణ్’. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై వెంకటకృష్ణ కర్నాటి, సీత కర్నాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మహిమ నంబియార్ కథానాయికగా నటిస్తోంది. రాధిక శరత్ కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే కీలక పాత్రలు పోషించారు. సుదర్శన్, సత్య, బ్రహ్మాజీ, రఘుబాబు ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.
1992 నాటి ఆంధ్ర సరిహద్దు నేపథ్యంలో సాగే కథతో రూపొందిన ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌నకు ఇప్పటికే మంచి స్పందన లభించింది. చిత్రబృందం తాజాగా శనివారం ఈ సినిమాలోని మొదటి పాట ‘ఒరియా పిల్ల’ను లాంచ్ చేశారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. “ఇది ఒక పీరియడ్ సినిమా. 90ల్లో జరిగిన సంఘటనల ఆధారంగా తీసుకుని, ఫిక్షన్ జోడించి కోన వెంకట్ అద్భుత కథగా మలిచారు. ఈ సినిమాలోని నాలుగు పాటలు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి.
అందరూ సులభంగా పాడుకునేలా, గుర్తుపెట్టుకునేలా ఉన్నాయి. ఈ సినిమా కోసం ఒక కొత్త లాంగ్వేజ్ మాట్లాడా. అది మీరు స్క్రీన్ మీద చాలా ఎంజాయ్ చేస్తారు” అని తెలిపారు. రచయిత, నిర్మాత కోన వెంకట్ మాట్లాడుతూ.. “ఇదొక హిలేరియస్ ఎంటర్‌టైనర్. నూటికి నూరు శాతం విజయాన్ని సాధిస్తుందని నమ్ముతున్నా” అన్నారు. దర్శకుడు జానకిరామ్ మాట్లాడుతూ.. “ఒరియా పిల్ల’ పాటను ఒడిశాలో చిత్రీకరించాం. మా టీమ్ అంతా ఎంతో కష్టపడి ఈ సినిమాను పూర్తి చేసింది.
శ్రీవిష్ణు ప్రతి విషయంలోనూ ఎంతో సహకరించారు. ఆయన కోసం నేను ఒనొక సర్‌ప్రైజ్ ప్లాన్ చేశా. త్వరలోనే దాన్ని వెల్లడిస్తాను” అని తెలిపారు. ‘ఈ సినిమాలో మంచి ఫన్, మంచి మ్యూజిక్ రెండూ ఉంటాయ’ని నిర్మాత వెంకట కృష్ణ కర్నాటి చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటుడు షైన్ టామ్ చాకో, సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్, లిరిక్ రైటర్ భాస్కరభట్ల, ఎడిటర్ చోటా కే ప్రసాద్, బీవీఎస్ రవి మాట్లాడారు. సినిమా యూనిట్ అందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు.






