calender_icon.png 17 February, 2026 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ హీరోయిన్ల బాటలోనే నడుస్తా!

17-02-2026 12:08:02 AM

సుహాస్, శివానీ నాగారం జంటగా నటిస్తున్న తాజాచిత్రం ‘హే బలవంత్’. ఇందులో సీనియర్ నటుడు నరేశ్, యాంకర్ స్రవంతి ముఖ్యపాత్రల్ని పోషించారు. గోపీ అచ్చర దర్శకత్వంలో బీ నరేంద్రరెడ్డి నిర్మిస్తున్నారు. బన్నీవాస్, వంశీ నందిపాటి ద్వయం ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా 

‘హే భగవాన్’ అనే పేరుతో ఉంది. సెన్సార్ ఆంక్షల నేపథ్యంలో మేకర్స్ టైటిల్‌ను ‘హే బలవంత్’గా మార్చారు. ఫిబ్రవరి 20న రిలీజ్ కానున్న ఈ సినిమా విశేషాలను కథానాయకి శివాని పాత్రికేయులతో పంచుకున్నారు. 

నేను సుహాస్‌తో చేస్తున్న రెండో సినిమా ఇది. ఇందులో నా పాత్ర అమాయకంగా ఉంటూ, చాలా నవ్విస్తుంది. నరేశ్, వెన్నెల కిషోర్ పాత్రలు కూడా బాగా నవ్విస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ ఓ సర్‌ప్రైజ్ ఉంటుంది. చివరలో తండ్రీకొడుకుల మధ్య భావోద్వేగాలు కూడా ఆకట్టుకుంటాయి. 

నాకు వచ్చిన కథల్లో నచ్చినవే ఎంపిక చేసుకుంటున్నా. ఈ సినిమా కూడా అంతే.. కథ, నా పాత్ర బాగా నచ్చడంతో ఓకే చేశా. కథ నచ్చితేనే కాంబినేషన్‌తో సంబంధం లేకుండా సినిమా ఒప్పుకుంటా. విన్నప్పుడు నేను కథతో కనెక్ట్ అవుతున్నానా..? నా పాత్రకు ఉన్న ప్రాధాన్యం ఏమిటి..? అనేది చూసుకుంటా. 

‘లిటిల్ హార్ట్స్’లో నేను చివరిలో ఎంపికయ్యా. వాస్తవానికి నేను నటి కావాలని అనుకోలేదు. కానీ ఇప్పుడు గుర్తింపు వచ్చింది. లక్కీగా మంచి సినిమాలు పడ్డాయి. నాకు 100 సినిమాలు చేయాలని లేదు. చేసినవి ఐదు సినిమాలే అయినా మంచి కథలతోనే చేస్తా. 

కూచిపూడి నృత్యం, సంగీతం నేర్చుకున్నా. సింగర్ టర్నింగ్ యాక్టర్ని. ‘లిటిల్ హార్ట్స్’లో చిన్న హమ్మింగ్ ఉంటుంది. ‘ఆరంభం’ సినిమాలో ఓ పాట పాడా. అవకాశాలు వస్తే పాటలు కూడా పాడతా. సినిమాల్లోకి వెళ్తా అన్నప్పుడు మా ఇంట్లో ప్రోత్సహించారు. వాళ్లు ఇచ్చిన అవకాశాన్ని మంచి సినిమాలతో నిరూపించుకుంటున్నా. వాళ్లు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. 

ఎలాంటి నేపథ్యం లేకుండా వచ్చిన నాకు ప్రేక్షకులు ఆదరించి నిలబెట్టారు. వారి నమ్మకాన్ని, అభిమానాన్ని, వారి ఇచ్చిన విలువను నిలుపుకోవటమే ముఖ్యం. స్టార్ హీరోలతో నటించే అవకాశం వచ్చినా.. నాకు కథ, నా పాత్ర నచ్చితే ఒప్పుకుంటా. 

ప్రస్తుతం నటీనటులే కాదు రైటర్స్, దర్శకులు ఎక్కువయ్యారు. తెలుగు అమ్మాయిలకు ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. చిన్న సినిమాలను కూడా ప్రేక్షకులు ఆదరించి పెద్ద సినిమా చేస్తున్నారు. ‘వెంట వెంటనే సినిమాలు చేయాకపోతే కనిపించకుండాపోతావు’ అని చాలా మంది అన్నారు. కానీ నాకు మాత్రం ‘ఈ అమ్మాయి సెలెక్టివ్‌గా ఎప్పుడూ మంచి సినిమాలే చేస్తుంది’ అనే మాట అందరినోట వినాలని ఉంది. చాలా మంది హీరోయిన్లు చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తారు. వారి బాటలోనే నేనూ పయనిస్తా. 

వ్యక్తిగతంగా నాకు రొమాంటిక్ కామెడీ సినిమాలంటే చాలా ఇష్టం. కానీ, అన్నిరకాల సినిమాలు చేయాలని ఉంటుంది. నేను నటించిన సినిమాలు ఓటీటీలో రావడం వల్ల అన్ని భాషల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు, తెలుగులో మరో రెండు చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి.