08-01-2026 12:00:00 AM
కల్వకుర్తికు దీటుగా ఆమనగల్లుపై ప్రత్యేక దృష్టి
రూ.4.10 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
అమనగల్లు, జనవరి 7( విజయక్రాంతి): గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే దశాబ్దాలుగా అమనగల్లు వెనుకబాటుకు గురైందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాను తొలిసారిగా ఎమ్మెల్సీగా ఎన్నికైనప్పటినుంచి ఆమనగల్ పై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధికి నిధులు కేటాయించి బీజం వేశానని చెప్పుకొచ్చారు. అయితే గత పాలకులు ఆమనగల్లు ను పట్టించుకోకపోవడంతో మున్సిపాలిటీలో అభివృద్ధి పడక వేసిందని ఆయన విమర్శించారు. తాను ఎమ్మెల్సీగా ఉన్న సమయంలోనే అమనగల్ గ్రామపంచాయతీని మున్సిపాలిటీ చేసినట్లు గుర్తు చేశారు.
మళ్లీ ఐదేళ్ల తరువాత 2023లో ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం ఆమనగల్ మున్సిపాలిటిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన చెప్పుకొచ్చారు. బుధవారం ఆమనగల్ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే అధికారులతో కలిసి టీయూఎస్‌ఐడీసీ నిధులు రూ.2 కోట్లతో నిర్మించ తలపెట్టిన అమనగల్లు పురపాలక సంఘం నూతన భవనం, వివిధ వార్డులలో రూ.2.10 కోటతో నిర్మించనున్న అంతర్గత మురుగు కాల్వలకు శంకుస్థాపన చేశారు.
అనంతరం 5 వార్డులో నిర్మించిన ఇందిరమ్మ పథకం కింద మంజూరైన నూతన గృహాన్ని ప్రారంభించారు. కల్వకుర్తి నియోజకవర్గంలో ఆమనగల్ ముఖ్య కూడలిగా కొనసాగుతుం దన్నారు. ప్రజల సౌకర్యార్థం కోసం అమనగల్లులో డివిజన్ కార్యాల యాలు (ఎన్టీవో, ఎస్‌ఆర్త్వో, ఆర్టీవో, ఏడిఏ) త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
అమనగల్లు మున్సిపాలిటీ అభివృద్ధి కి రూ. 63 కోట్లు కేటాయింపు..
ఆమనగల్ మున్సిపాలిటీకి ఇప్పటివరకు విడతలు వారిగా అభివృద్ధి పనుల కోసం 63 కోట్లు కేటాయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మున్సిపాలిటీ కి కేటాయినా నిధులతో ప్రతి వార్డులో సీసీ రోడ్లు, అంతర్గత మురుగుకాల్వల నిర్మాణం ఆరు నెలల్లో పూర్తి చేస్తానని ఆయన హమీ ఇచ్చారు. ఇప్పటికే ఆమనగల్లు మున్సిపాలిటీకి 360 ఇందిరమ్మ ఇండ్లు కేటాయించానని మరో మరో 300 ఇండ్లు కేటాయిస్తాన్ని చెప్పు కొచ్చారు.
రెండు నెలల్లో పెండింగ్లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణం పూర్తి చేసి జూన్లో అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చేస్తానని చెప్పారు. అమనగల్లులో నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు కోసం ప్రభుత్వం రూ.10 కోట్లు కేటాయించిందని నైపుణ్య శిక్షణ కేంద్రం, పాల్టెక్నిక్ కళాశాల ఏర్పాటు కోసం, ఏసీపీ కార్యాలయముకు అందుబాటులో ఉండే ప్రభుత్వ భూమి ని సర్వే చేసి భవనాల నిర్మాణం కోసం వీలుగా ప్రభుత్వ భూమిని కేటాయించాలని తాసిల్దార్ ను ఆదేశించారు.
కమలనగర్ లో ఇండ్ల మధ్య ఉన్న డంపింగ్ యార్డును కూడా ఎత్తివేసి నివాస గృహలకు దూరంగా తరలించాలని ఆయన మున్సిపల్ కమిషనర్కు ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల విషయంలో ఏ సమస్య ఉన్న త్వరగా పరిష్కరించాలని ఎంపీడీవో కు సూచించారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధి చేసే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు తెలిపి గెలిపించుకోవాలని కోరారు.