ఎన్నారైల కోసం ఐసీఐసీఐ బ్యాంక్ యూపీఐ
ముంబై, మే 6: ప్రవాస భారతీయులు వారి అంతర్జాతీయ మొబైల్ నంబర్ల ద్వారా ఇండియాలో యూపీఐ లావాదేవీలు నిర్వహించుకునే సదుపాయాన్ని ఐసీఐసీఐ బ్యాంక్ ప్రవేశపెట్టింది. ఇప్పటివరకూ ఎన్నారైలకు వారి నాన్‌హే ఎక్స్‌టర్నల్ (ఎన్‌ఆర్‌ఈ) లేదా నాన్ ఆర్డనరీ (ఎన్‌ఆర్‌వో) బ్యాంక్ ఖాతాలకు భారత్ మొబైల్ నంబర్ రిజిష్టర్ చేసుకుంటేనే యూపీఐ చెల్లింపుల సదుపాయం లభించేది. ఇక నుంచి వారు అంతర్జాతీయ మొబైల్ నంబర్లను సైతం వారి ఎన్‌ఆర్‌ఈ/ఎన్‌ఆర్‌వో ఖాతాలతో రిజిష్టర్ చేసి యూపీఐ లావాదేవీలు జరిపే వీలుంటుంది. ఈ సదుపాయం 10 దేశాల్లో..యూఎస్‌ఏ, యూకే, యూఏఈ, కెనడా, సింగపూర్, ఆస్ట్రేలియా, హాంకాంగ్, ఒమాన్, ఖతార్, సౌదీ అరేబియాల్లో నివసిస్తున్న ఎన్నారైలకు మాత్రమే లభిస్తుందని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. తమ మొబైల్ బ్యాంకింగ్ యాప్ ఐమొబైల్ పే ద్వారా ఈ సేవలు అందుబాటులో ఉంటాయన్నది.






