15 July, 2026 | 12:41 AM

17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్

27-04-2024 12:10 AM

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: దేశంలో రెండో పెద్ద ప్రైవేటు బ్యాంక్ అయిన ఐసీఐసీఐ బ్యాంక్ కొత్తగా జారీచేసిన దాదాపు 17,000 క్రెడిట్ కార్డుల్ని బ్లాక్ చేసింది. డేటా పొరపాటు కారణంగా ఈ క్రెడిట్ కార్డులు ఇతర యూజర్లకు లింక్‌కావడంతో ఈ చర్య తీసుకుంది.  తమ ఐమొబైల్ పే యాప్‌లో ఇతర కస్టమర్ల ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు వివరాలు కన్పించాయని పలువురు యూజర్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. పూర్తి కార్డు నంబరు, ఎక్స్‌పైరీ తేదీ, సీవీవీలు ఐమొబైల్‌లో చూసినట్టు తెలిపారు. దీంతో బ్యాంక్ 17,000 కొత్త కార్డుల్ని బ్లాక్ చేసింది. డేటా ఎర్రర్‌ను సరిదిద్దామని, వాటిని దుర్వినియోగపర్చిన ఫిర్యాదులేవీ రాలేదని బ్యాంక్ వివరణ ఇచ్చింది. ఈ పొరపాటు కారణంగా ఖాతాదారులకు ఎటువంటి ఆర్థిక నష్టం వాటి ల్లినా అందుకు పరిహారం ఇస్తామని ఐసీఐసీఐ బ్యాంక్ వాగ్దానం చేసింది.

ఏమి జరిగింది?

సాంకేతిక సమస్య కారణంగా కొత్త క్రెడిట్ కార్డులు పొరపాటున ప్రస్తుత కస్టమర్ల ఖాతాలకు అనుసంధానమయ్యాయని బ్యాంక్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రస్తుత ఖాతాదారులు ఆన్‌లైన్‌లో వారి ఖాతాలను చూసేటపుడు, కొత్తగా జారీఅయిన కార్డు వివరాల్ని చూడగలిగారు. ఉదాహరణకు మీరు ఆన్‌లైన్ బ్యాంకింగ్ పోర్టల్‌లోకి లాగిన్ అయినపుడు మీరు దరఖాస్తు చేయని ఒక కొత్త క్రెడిట్ కార్డు వివరాలు మీకు కన్పించాయన్న మాట. ఇది కొంతమంది ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు అనుభవం అయ్యింది. కానీ కొత్త కస్టమర్లు మాత్రం ప్రస్తుత కస్టమర్ల కార్డుల వివరాల్ని చూసే పొరపాటు జరగలేదని బ్యాంక్ ప్రతినిధి తెలిపారు.