వరుస ర్యాలీకి బ్రేక్

27-04-2024 12:15:00 AM

600 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్

ముంబై, ఏప్రిల్ 26: వరుసగా ఐదు రోజులపాటు జరిగిన మార్కెట్ ర్యాలీకి శుక్రవారం బ్రేక్‌పడింది. అంతర్జాతీయంగా మిశ్ర మ సంకేతాలు నెలకొనడంతో బ్యాంకింగ్, ఫైనాన్షియల్, కన్జూమర్ డ్యూరబుల్స్ రంగాల షేర్లను ఇన్వెస్టర్లు విక్రయించడంతో ర్యాలీ నిలిచిపోయిందని మార్కెట్ నిపుణులు చెప్పారు. క్రూడ్ ధరల పెరుగుదలతో పాటు విదేశీ ఇన్వెస్టర్లు అదేపనిగా విక్రయాలు జరపడం మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసిందని ట్రేడర్లు వివరించారు. బీఎస్‌ఈ సెన్సెక్స్ గురువారం 609 పాయింట్లు తగ్గి 73,730 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ సూచి 723 పాయింట్లు క్షీణించి 73,616 పాయింట్ల కనిష్ఠస్థాయిని తాకింది. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1,850 పాయింట్లు ర్యాలీ జరిపిన సంగతి తెలిసిందే. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇండెక్స్ తాజాగా 150 పాయింట్లు తగ్గి 22,419 పాయింట్ల వద్ద నిలిచింది. ఈ సూచి ఇంట్రాడేలో 22,620  పాయింట్ల గరిష్ఠ, కనిష్ఠస్థాయిల మధ్య హెచ్చుతగ్గులకు లోనయ్యింది. 

బజాజ్ ఫైనాన్స్ భారీ పతనం

బజాజ్ ఫైనాన్స్ షేరు సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా 8 శాతం పతనమయ్యింది. మార్చి త్రైమాసిక ఫలితాలు నిరుత్సాహపర్చడంతో ఇన్వెస్టర్లు ఈ షేర్లను విక్రయించారు. బజాజ్ ఫిన్‌సర్వ్ 3 శాతం క్షీణించింది. ఇండస్‌ఇండ్ బ్యాంక్, నెస్లే, కోటక్ మహీంద్రా బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రాలు 1 శాతం మధ్య తగ్గాయి. మరోవైపు టెక్ మహీంద్రా 7 శాతంపైగా ర్యాలీ జరిపింది. 

ఆదాయ వృద్ధికి, మార్జిన్లు పెంచుకోవడానికి కంపెనీ సీఈవో ప్రకటించిన రోడ్‌మ్యాప్ ఇన్వెస్టర్లను ఆకర్షితుల్ని చేయడంతో ఈ షేరు పెరిగింది. విప్రో, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్, యాక్సిస్ బ్యాంక్‌లు సైతం 2 శాతం వరకూ లాభపడ్డాయి.  వివిధ రంగాల సూచీల్లో బ్యాంకెక్స్ 0.70 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ 0.68 శాతం, టెక్నాలజీ ఇండెక్స్ 0.26 శాతం, ఆటో ఇండెక్స్ 0.25 శాతం, టెలికమ్యూనికేషన్స్ సూచి 0.15 శాతం చొప్పున తగ్గాయి.  మరోవైపు ఎనర్జీ, హెల్త్‌కేర్, సర్వీసెస్, పవర్ సూచీలు లాభపడ్డాయి.

లాభాల స్వీకరణ

తాజా మార్కెట్ పతనం అంచనాలకు అనుగుణంగానే ఉన్నదని, స్టాక్ సూచీలు వరుసగా ఐదు ట్రేడింగ్ సెషన్లు ర్యాలీ కారణంగా లాభాల స్వీకరణ జరుగుతున్నదని మెహతా ఈక్విటీ స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సి చెప్పారు. జపాన్ యెన్ విలువ 34 ఏండ్ల కనిష్ఠస్థాయికి తగ్గడం, యూఎస్ జీడీపీ డేటా నిరుత్సాహపర్చడం, వడ్డీ రేట్ల కోత పట్ల ఆశలు సన్నగిల్లడం వంటి అంతర్జాతీయ అంశాలు కూడా కరెక్షన్‌కు పురికొల్పాయని వివరించారు.  ప్రపంచ మార్కె ట్లో బ్రెంట్ క్రూడ్ ధర తిరిగి 90 డాలర్ల స్థాయిని సమీపించింది.