3 May, 2026 | 2:25 AM

విద్య, వైద్యం ఫ్రీగా ఇవ్వకుంటే రాళ్లతో కొట్టండి

03-05-2026 12:59 AM
  1. మా నాన్న కేసీఆర్‌ను తిట్టలేదు.. బీఆర్‌ఎస్ అధ్యక్షుడిని విమర్శించా
  2. సర్వోదయ తెలంగాణ సాధించటమే తన లక్ష్యం
  3. వెయ్యి రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించుతాం
  4. మీట్ ది ప్రెస్‌లో టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

హైదరాబాద్, మే 2 (విజయక్రాంతి): విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వకుంటే తనను రాళ్లతో కొట్టాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చెప్పారు. తాము ఇచ్చిన పాంచజన్యంలో పేర్కొన్న ఐదు అంశాలను అమలు చేయకుంటే గన్ పార్క్‌లోని అమరుల స్థూపం స్తంభానికి కట్టేసి కొట్టాలని సూచించారు. శనివారం బషీర్ బాగ్ ప్రెస్‌క్లబ్‌లో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యం లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కవిత పాల్గొని మాట్లాడారు. 

తెలంగాణ రక్షణ సేన ప్రకటించిన పాంచజన్యంలోని అన్ని విషయాల్లో సాధ్యాసాధ్యా లను పరిశీలించిన తర్వాతే హామీలు ఇచ్చానని చెప్పారు. తెలంగాణలో విద్య, వైద్యం కోసమే ప్రజలు 60 శాతం డబ్బు ఖర్చు చేయాల్సిన దుస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పాంచజన్యంలోని ఐదు అంశాలను అమలు చేయ టంపై ఆర్థిక నిపుణులతో చర్చలు జరిపానని కవిత చెప్పారు.  ప్రభుత్వానికి వచ్చే ఆదాయం లో లక్ష కోట్ల రూపాయలను తమ ప్రాధాన్యత అంశాలకు ఖర్చు చేయవచ్చన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక తల్లి మాదిరిగా ఆలోచిస్తే మాత్రమే ప్రజలకు మేలు చేయాలన్న సంక ల్పం వస్తుందన్నా రు.వెయ్యి రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సేన అని ముందు ప్రకటించిన తర్వాత తెలంగాణ రక్షణ సేనగా పేరు మార్చుకోవటంపై స్పంది స్తూ... తమ పార్టీ పేరు విషయంలో చాలా కుట్రలు జరిగాయని కవిత చెప్పారు.

వాటిని గమనించిన తర్వాతే పార్టీ పేరు విషయంలో వ్యుహత్మకంగా వ్యవహరించామని అన్నారు. ఈ నెల 10న రాష్ట్రాని కి వస్తున్న ప్రధాని మోదీని బీజేపీ ఎంపీలు అడిగి పాలమూరు ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా తేవాలని, తెలంగాణకు ప్రత్యేకంగా నిధులు తేవాలని చెప్పారు. తెలంగాణ ప్రజల సమస్యలపై పోరాటమే తమ లక్ష్యమని చెప్పారు. తన టార్గెట్ సర్వోదయ తెలంగాణ అని కవిత స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ తనకు టార్గెట్ కాదన్నారు.

తన వెనుక ఎవరు లేరని మరోసారి తేల్చిచెప్పారు. నిప్పుల నుంచి నడిచి వచ్చిన తనకు ప్రపంచాన్ని ఎదుర్కొనే శక్తి ఉందని తేల్చిచెప్పారు. తమ పార్టీని పురుషులు నడిపే పార్టీ కన్నా గొప్పగా నడుపుతామని కవిత చెప్పారు. తమ పార్టీలో 33 శాతం సీట్లు మహిళలకు కేటాయిస్తామన్నారు. అభివృద్ధి, సామాజిక న్యాయం జోడెద్దులుగా తాము ముందుకు వెళ్తామన్నారు.  తెలంగాణ ప్రజలకు తమకు పూర్తి స్థాయిలో మెజార్టీ ఇస్తారని భావిస్తున్నానని కవిత చెప్పారు.

డీలిమిటేషన్ విషయంలో తమకు స్పష్టమైన వైఖరి ఉందని చెప్పారు. అమెరికాలో సెనేట్‌కు ఉన్న పవర్స్ మాదిరిగా రాష్ట్రాలకు పవర్ ఇవ్వాలన్నారు. అన్ని రాష్ట్రాలకు ఈక్వల్ ఓటింగ్ రైట్స్ ఉండాలన్నారు. ఈ విషయంలో డీటెయిల్‌గా  ప్రధాని మోడీకి లేఖను కూడా పంపుతున్నట్లు చెప్పారు. 

మాజీ మావోయిస్టులు పార్టీల్లో చేరాలి

సొంత ప్రజలను డైడ్ లైన్ పెట్టి చంపుతున్నది కేంద్ర ప్రభుత్వమని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం చేపట్టిన దుర్మార్గాన్ని ముందుగా ఖండించింది తనేనని చెప్పారు. లొంగిపోయిన మావోయిస్టులు ఏదో ఒక పార్టీలో చేరాలని కోరారు. జర్నలిస్టులు, మైనార్టీలు, బీసీ అన్ని వర్గాల కోసం పోరాటం చేస్తామని కవిత చెప్పారు. కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డి మోడరేటర్‌గా వ్యవహరించగా టీయూడబ్ల్యూజే అధ్యక్ష కార్యదర్శులు విరహత్ అలీ, రాం నారాయణ పాల్గొన్నారు.

రాజకీయ నేత కేసీఆర్‌పైనే నా విమర్శలు 

తన విమర్శలు కేవలం బీఆర్‌ఎస్ అధినేత, రాజకీయ నేత అయిన కేసీఆర్ పైనేనని కవిత చెప్పారు. సిద్ధాంతపరమైన విబేధాలతోనే విమర్శలు చేశానని, రాజకీయ తప్పులపై భవిష్యత్తులోనూ విమర్శలు చేస్తానని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎంతో చేయాల్సి ఉన్నప్పటికీ కేసీఆర్ అది చేయలేకపోయార న్నారు. కృష్ణా, గోదావరి నీళ్లను సరిగా వాడుకొని ఉంటే రైతుల చేతిలో రెండున్నర లక్షల కోట్లు ఉండేవని చెప్పారు.

లక్షా 21 వేల కోట్లు కాళేశ్వరం, పాలమూ రు కోసం ఖర్చు చేసి కేవలం లక్ష ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారని చెప్పారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే క్రమం లో పెట్టిన పరీక్షల్లో పదిసార్లు పేపర్ లీక్ అవటాన్ని ప్రస్తావించారు. కేటీఆర్ లాంటి తెలివైన ఐటీ మినిస్టర్ ఉండగా ఎందుకు పేపర్ లీకైందంటూ ప్రశ్నించారు. కేసీఆర్ చర్యల కారణంగా రెండు జనరేషన్లు నష్టపోయారన్నారు.