బీజేపీ మళ్లీ వస్తే రిజర్వేషన్లకు రాం రాం
రిజర్వేషన్లను ఎత్తేసే కుట్ర చేస్తుంది
కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కి మంత్రి పొన్నం బహిరంగ లేఖ
హైదరాబాద్, మే 4 (విజయక్రాంతి): బీజేపీ పార్టీ పైకి జై శ్రీరాం అంటూ లోపల రిజర్వేషన్లకు రాంరాం చెప్పే కుట్రలకు తెరలేపిందని బీసీ సంక్షేమం, రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆరోపించారు. ఈ మేరకు శనివారం ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌లకు బహిరంగ లేఖ రాశారు. రిజర్వేషన్ల వ్యతిరేకి బీజేపీ పార్టీకి బీసీ, ఎస్సీ, ఎస్టీల ఓటు అడిగే హక్కు లేదన్నారు. రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర చేస్తోందని, తొలినాళ్ల నుంచి బీజేపీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని నిర్ణయిస్తే బీజేపీ దేశవ్యాప్తంగా కమండల యాత్ర పెట్టి మండల్ కమిషన్‌ను వ్యతిరేకించిందని, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్ రహిత భారత్ కావాలని అనేక సందర్భాల్లో ప్రకటించారని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తే బీజేపీ అడ్డుకుందన్నారు.
రిజర్వేషన్లను పెంచి న బిహార్ ప్రభుత్వాన్ని 60 రోజల్లోనే కూల్చిన ఘనత బీజేపీదేనని స్పష్టం చేశారు. సమానత్వం కోరుకున్న వారంతా నక్సలైట్లంటూ వ్యాఖ్యానించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సమానత్వం కోరుకునే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు నక్సలైట్లుగా కనిపిస్తున్నారా? అని ప్రశ్నించారు. సివిల్ సర్వెంట్ల ఎంపికలోనూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందన్నారు. 400 సీట్లు కావాలనే లక్ష్యంతో వెళ్తున్న బీజేపీ అంతిమ లక్ష్యం మాత్రం రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను ఎత్తేయడమేనని గుర్తు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ సీఎం నినాదమిచ్చిన బీజేపీ.. బీజేఎల్పీ నేతగా మాత్రం బీసీని ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. గుజరాతీలకు తొత్తులుగా, బానిసలుగా పనిచేయడం తప్ప విభజన హామీల అమలుపై కేంద్రాన్ని నిలదీసే సత్తా తెలంగాణ బీజేపీ నేతలకు ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణలో కుల గణన చేపట్టామని, అసెంబ్లీలో తీర్మానం కూడా చేశామని తెలిపారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి ఎందుకు ఓటేయాలో సమాధానం చెప్పి ఓటు అడగాలని కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు రాసిన బహిరంగ లేఖలో కోరారు.




