సిరిసిల్లలో ఉపాధి హామీ పనులు తక్కువ
– 125 రోజుల పని కల్పించాలని బండి సంజయ్ డిమాండ్
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి, ముస్తాబాద్ మండలాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఉపాధి హామీ పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం VB-G RAM G పథకాన్ని ప్రవేశపెట్టిందని ఆయన తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఏటా 125 రోజులపాటు పని కల్పించాల్సి ఉండగా, తెలంగాణలో ఆ లక్ష్యం సాధ్యం కావడం లేదని పేర్కొన్నారు. ముఖ్యంగా సిరిసిల్ల జిల్లాలో పరిస్థితి మరింత నిరాశాజనకంగా ఉందని, 92 వేల జాబ్ కార్డులు ఉన్నప్పటికీ సగటున 50 రోజులపాటు మాత్రమే పని కల్పిస్తున్నారని చెప్పారు.
2026-27 కేంద్ర బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.95,692 కోట్లను కేటాయించామని, గ్రామీణాభివృద్ధి బడ్జెట్‌లో పెద్ద భాగం దీనికే వెచ్చిస్తున్నామని తెలిపారు. తెలంగాణకు కూడా ఈ పథకం కింద భారీగా నిధులు వచ్చే అవకాశమున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం వాటిని సమర్థంగా వినియోగించడం లేదని విమర్శించారు. ఖర్చులో 60 శాతం నిధులు కేంద్రం విడుదల చేస్తున్నప్పటికీ, రాష్ట్రం తన వాటా నిధులను ఆలస్యం చేస్తోందని అన్నారు. ఈ సందర్భంగా అంకిరెడ్డిపల్లె గ్రామంలో రూ.25 లక్షలతో, ముస్తాబాద్‌లో రూ.10 లక్షలతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గతంలో కూడా తన పార్లమెంట్ పరిధిలో భారీగా నిధులు ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.
పంచాయతీలు, మున్సిపాలిటీలకు తగిన నిధులు ఇవ్వడం లేదని, ఎరువుల పంపిణీ విషయంలో కూడా రాష్ట్రం నిర్లక్ష్యం చూపుతోందని ఆరోపించారు. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ స్థాపనను స్వాగతిస్తూ, ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయ పార్టీ ఏర్పాటు చేయవచ్చని, ప్రజల కోసం పని చేసే పార్టీలకే మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వికాస్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డవేని గోపి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి, మండల అధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్ రావు, నాయకులు పాల్గొన్నారు.




