బాణీ శరీరమైతే.. సాహిత్యం ఆత్మ!
కొందరు తమ గోరంత ప్రతిభను కొండంతలుగా చెప్పుకుంటారు. మరికొందరు ఎంత ప్రతిభావంతులైనా ప్రచారాలకు దూరంగా ఉంటూ తమ పని తాము చేసుకుపోతుంటారు. ఈ రెండో కేటగిరీకి చెందిన యంగ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కే రాబిన్. తన 8 ఏళ్ల సంగీత ప్రస్థానంలో 20కి పైగా చిత్రాలకు సంగీతాన్ని అందించారు. తాజాగా ‘దండోరా’ సినిమాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా తెలంగాణ రాష్ట్ర అత్యుత్తమ సినీ పురస్కారం ‘గద్దర్ సినీ అవార్డు’ను సొంతం చేసుకున్నారు మార్క్ కే రాబిన్. ఈ సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా సమావేశమైన చెప్పిన సంగతులు ఆయన మాటల్లోనే..
ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్స్ యూత్‌కు నచ్చే మంచి సౌండింగ్స్ ఇవ్వగలుగుతున్నారు. కానీ కలకాలం గుర్తుండిపోయే బాణీలు ఇవ్వలేక పోతున్నారు. బాణీ శరీరం అయితే, సాహిత్యం ఆత్మ లాంటిది. పరభాషా సంగీత దర్శకులు, గాయకులను మనం ప్రోత్సహిస్తున్నాం. దాంతో వాళ్ల ఉచ్ఛారణల్లో తప్పులు వస్తున్నాయి. నా సినిమాల్లో సాధ్యమైనంత మన వాళ్లతోనే పాడిస్తున్నా. గుర్తుండిపోయే ట్యూన్‌తో ఉండాలనే ప్రయత్నిస్తుంటా. దర్శకుడి టేస్ట్ మేరకు మేము పాటలు కంపోజ్ చేయాలి. మంచి మ్యూజిక్ టేస్ట్ ఉన్న దర్శకులతో పనిచేసినప్పుడే మంచి పాటలు చేయగలం.
‘దండోరా’ సినిమాకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా గద్దర్ అవార్డ్ దక్కడం సంతోషంగా ఉంది. ప్రేక్షకులకు మరింత మంచి మ్యూజిక్ ఇచ్చేందుకు ఒక స్ఫూర్తిగా ఈ అవార్డ్ నిలుస్తుందని నమ్ముతున్నా. ఈ అవార్డ్‌తో సంగీత దర్శకుడిగా నాపై మరింత బాధ్యత పెరిగింది. డైరెక్టర్ మురళి చాలా క్లారిటీగా ‘దండోరా’ను తెరకెక్కించారు. ఈ సినిమాలోని కథాంశమే నన్ను మంచి మ్యూజిక్ ఇచ్చేలా స్ఫూర్తి నింపింది. భావోద్వేగం నిండిన మనసుతోనే స్వరాలు సమకూర్చాను. మల్లేశం సినిమాకు మ్యూజిక్ చేసేప్పుడు స్థానిక వాయిద్యాలు, సంగీతంపై అవగాహన ఉంది. ఆ అనుభవమే ‘దండోరా’కు ఉపయోగపడింది.
తెలుగు సినిమా పరిశ్రమ గొప్పగా ఎదిగింది. ఇక్కడ గొప్ప చిత్రాలు నిర్మిస్తున్నాం. అయితే మ్యూజిక్ ఇండస్ట్రీ పరంగా ఇక్కడ ఆ స్థాయి సౌకర్యాలు లేవు. ఒక మంచి మ్యూజిక్ స్టూడియో, ఒక మంచి రికార్డింగ్ చేయాలంటే చెన్నైకి వెళ్తున్నాం. మన ఇండస్ట్రీ పెరిగినంత స్థాయిలో, మన సినిమా అవసరాలు తీర్చేంత మ్యూజిక్ స్టూడియోలు, వాయిద్యకారులు అందుబాటులో లేరు.
మీకు ఏ వాయిద్యం కావాలన్నా వాయించగల వారు చెన్నైలో అందుబాటులో ఉంటారు. వాళ్ల సమయపాలన, సంగీత ప్రతిభ ఆశ్చర్యపరుస్తాయి. కోవిడ్ కారణంగా కనీస ఉపాధి, వ్యాపారం లేకుండాపోయాయి. ఇప్పుడిప్పుడే వారికి కొంత ఉపాధి లభిస్తోంది. చెన్నై మీద ఆధారపడే పరిస్థితి పూర్తిగా మారాల్సిన అవసరం ఉంది. అలాగే స్థానిక వాయిద్యకారులను, సంగీత కళాకారులను గుర్తించి ప్రోత్సాహం అందించాలి. అలాంటి ఒక మంచి లోకల్ టీమ్‌ను తయారుచేసే ప్రయత్నాలు చేస్తున్నా.
మ్యూజిక్ రంగంలో టెక్నాలజీ ఎంత అందుబాటులోకి వచ్చినా మనం సొంతంగా క్రియేట్ చేసే పాటతో అది పోటీ రాదు. మనలోని సృజనాత్మకతతో రూపొందించే పాటను అంతే అనుభూతితో ఏఐ అందించలేదు.
ప్రస్తుతం ‘కథాకళి’ అనే ఒక సినిమా చేస్తున్నా. ప్రశాంత్‌వర్మతో రెండు సినిమాలు చేస్తున్నా. ఒక స్టార్ హీరో సినిమాకు చర్చలు జరుగుతున్నాయి. త్వరలో వెల్లడిస్తాను.




