సత్ప్రవర్తనతో మెలగకపోతే పీడీయాక్ట్ తప్పదు
ఎస్పీ నరసింహ
నూతనకల్, మే 19:మండల పరిధిలోని పాత నేరస్తులు, రౌడీషీటర్ల ప్రవర్తనలో మార్పు రాకపోతే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపుతామని జిల్లా ఎస్పీ నరసింహ తీవ్రంగా హెచ్చరించారు. మంగళవారం నూతనకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన రౌడీషీటర్లు, పాత నేరస్తులకు ఆయన ప్రత్యేకంగా కౌన్సిలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ... సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. పాత నేరస్తులు, రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్ల కదలికలపై నిరంతరం ప్రత్యేక నిఘా ఉంచామని స్పష్టం చేశారు.
ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, భౌతిక దాడులు లేదా గొడవలకు దిగినా అస్సలు ఉపేక్షించేది లేదని, అలాంటి వారిని బైండోవర్ చేస్తామని తేల్చి చెప్పారు. ప్రతి ఒక్కరూ నేర ప్రవృత్తిని వీడి, సత్ప్రవర్తనతో సమాజంలో జీవించాలని ఆయన హితవు పలికారు.‘శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించం. రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంది.‘ఈ కౌన్సిలింగ్ కార్యక్రమంలో ఎస్పీతో పాటు డివిజన్ డిఎస్పి నాగేశ్వరరావు, నాగారం సర్కిల్ ఇన్స్పెక్టర్ మగ్దుం అలి,ఇన్స్పెక్టర్ నాగరాజు,అశోక్,అంజన్ రెడ్డి, శేఖర్ రెడ్డి, సుమన్, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






