13 April, 2026 | 8:24 AM

తప్పు చేయకపోతే ఉలుకెందుకు

28-06-2024 01:59 AM
  1. విచారణకు కేసీఆర్ రాకపోవడంతోనే తప్పు చేశాడని అర్థం అవుతోంది
  2. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆస్తులపై బహిరంగ చర్చకు సిద్ధమా
  3.  కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం

హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి) : విద్యుత్ కొనుగోళ్లలో ఎలాంటి అవినీతి, అక్రమాలు జరగకపోతే విచారణ కమిషన్ ఎదుట హాజరయ్యేందుకు మాజీ సీఎం కేసీఆర్‌కు ఎందుకు తర్జనభర్జన పడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. అవకతవకలు బయటపతాయనే భయంతోనే జ్యుడీషియల్ విచారణకు హాజరుకా వట్లేదనిన ఆరోపించారు. అసెంబ్లీ మీడియా హాల్లో వేముల వీరేశం, కుంభం అనిల్‌కుమార్ రెడి ్డ మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్‌ఎస్ హయాంలో అనేక కుంభకోణాలు జరిగాయని, ఇప్పుడు బయట పడుతున్న కుంభకోణాలు చిన్నవేనని రానున్న రోజుల్లో బీఆర్‌ఎస్ చేసిన మరిన్ని అరాచకాలు వెలుగులోకి వస్తాయన్నారు.

విద్యుత్ కొనుగోళ్లలో ఎలాంటి అవినీతి జరగలేదని, అవసరమైతే విచారణ చేయాలని కేసీఆర్ ఆదేశంతోనే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారని.. తీరా విచారణకు ఆదేశించిన తర్వాత ఇప్పుడు విచారణ వద్దని గోల చేస్తున్నారని, ఇదేం తీరని వేముల వీరేశం మండిపడ్డారు. 2014కు ముందు జగదీష్‌రెడ్డి ఆస్తి ఎంత..? ఇప్పుడు ఎంత..? అనే అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమా..? అని  సవాల్ విసిరారు. ఇసుక దందా చేసేందుకే యాదాద్రి ప్లాంట్ తెచ్చారని.. జగదీష్‌రెడ్డికి అవినీతి అక్రమాల మీద ఉన్న శ్రద్ధ అభివృద్ధి మీద లేదని దుయ్యబట్టారు.

పార్టీ ఫిరాయింపులకు తెరలేపింది కేసీరేనని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. అటువంటి కేసీఆర్ ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్‌ఎస్ పాలనను, ఆ పార్టీని ప్రజలు వద్దనుకున్నారని, ఇంత జరిగినా ఇన్ని ఘోర పరాజయాలు చవి చూసినా ఆ పార్టీ నేతల తీరు మారడం లేదన్నారు. విద్యుత్ రంగంలో రూ. 80 వేల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. తెలంగాణలో ఇక బీఆర్‌ఎస్‌కు స్థానం ఉండదని జోస్యం చెప్పారు.