calender_icon.png 11 January, 2026 | 2:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దమ్ముంటే రేవంత్‌రెడ్డిని నిలదీయండి

09-01-2026 12:57:19 AM

  1. రాహుల్‌గాంధీపై తాను చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందన

రేవంత్‌రెడ్డి చేసిన దూషణలను మరిచిపోయి మా మీదే మాటలు

కాంగ్రెస్‌కు చేతకాక రాహుల్ తిట్టిన రేవంత్‌నే సీఎం చేసుకుంది

రాహుల్ గాంధీని ‘ముద్దపప్పు’ అన్నదే రేవంత్‌రెడ్డి 

రేవంత్ రెడ్డి సోనియాను బలిదేవత అన్నది నిజంకాదా

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ అమ్ముడుపోయాడు

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, జనవరి 8 (విజయక్రాంతి) : గాంధీ కుటుంబాన్ని, రాహుల్ గాంధీని, సోనియా గాంధీని అడ్డగోలుగా తిట్టిన రేవంత్‌రెడ్డిని పక్కన పెట్టుకొని మాలాంటి ప్రతిపక్ష నేతలపై మాట్లాడడం ఏమిటని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు దమ్ముంటే రేవంత్‌రెడ్డిపై ప్రతాపం చూపించాలని సవాల్ విసిరారు. రేవంత్‌రెడ్డిని తప్పుపట్టడం చేతగాని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మాట్లాడుతున్న తీరుపైన కేటీఆర్ ఎద్దేవా చేశారు.

తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ లోకసభ పక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ద్రోహాన్ని ప్రస్తావిస్తూ తాను చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతున్న మాటలపై కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. రాహుల్ గాంధీని, సోనియా గాంధీని అడ్డగోలుగా తిట్టిన రేవంత్‌రెడ్డిని తీసుకువచ్చి ముఖ్యమంత్రిని చేసుకున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతలు మరిచిపోయారని ఎద్దేవా చేశారు.

రాహుల్ గాంధీపై తాను చేసిన వ్యాఖ్యలు గతంలో రేవంత్‌రెడ్డి అనేకసార్లు చేశారన్న విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఇదే రాహుల్ గాంధీని రేవంత్‌రెడ్డి ‘ముద్దపప్పు’ అన్నారని, అదే మాటను నేను రిపీట్ చేసినట్లు తెలిపారు. రేవంత్‌రెడ్డి సోనియా గాంధీని ‘వెయ్యి మందిని బలి తీసుకున్న బలిదేవత.. తెలంగాణ పిల్లల్ని చంపింది’ అని అన్నారని,

అలాంటి వ్యక్తిని పక్కన పెట్టుకొని తాను చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు అభ్యంతరం చెప్పడంపై సానుభూతి వ్యక్తం చేశారు.తెలంగాణ భవన్‌లో  గురువారం శేరిలింగంపల్లికి చెందిన గొట్ట నరేందర్ యాదవ్ భారీ ఎత్తున తన అనుచరులు, కార్యకర్తలతో కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... 6 గ్యారంటీల అమలుపై రేవంత్‌రెడ్డిని, రాహుల్ గాంధీని తప్పకుండా ప్రశ్నిస్తూనే ఉంటామని మరోసారి స్పష్టం చేశారు.

అడ్డగోలు వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డిని గట్టిగా అడిగితే ‘లాగులో తొండలు విడిచిపెడతా, పేగులు మెడలో వేసుకుంటా, గుడ్లు పీకి గోలీలు ఆడుతా’ లాంటి బూతులు మాట్లాడుతున్నారని కేటీఆర్ అన్నారు.

హైదరాబాద్‌లో ఎన్నికలను ప్రభుత్వం త్వరలో పెడుతుందన్న వార్తలు వస్తున్నాయని, ఈ ఎన్నికలను పార్టీ శ్రేణులంతా కలిసి సమిష్టిగా ఎదుర్కొని విజయం సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్ నగరాన్ని బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సుమారు రూ.9,700 కోట్లతో అభివృద్ధి చేసిన విషయాన్ని ప్రజలకు ప్రస్తావించాలన్నారు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసిన తీరు ప్రతి డివిజన్‌లోని ఓటర్లకు ప్రజలకు ప్రచారం చేయాలని కోరారు. 

అరికెపూడి అమ్ముడుపోయాడు

శేర్లింగంపల్లి నియోజకవర్గంలో మన పార్టీ తరఫున గెలిచి కేవలం భూములను కాపాడు కోవడం కోసం రేవంత్‌రెడ్డి పక్షాన చేరి ఎమ్మెల్యే గాంధీ డబ్బులకు అమ్ముడుపోయాడని కేటీఆర్ అన్నారు. ఎమ్మెల్యే పార్టీకి ద్రోహం చేసి వదిలిపోయినా శేర్లింగంపల్లిలో ఎక్కడ సమావేశం పెట్టినా భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు, నాయకులు విజయవంతం చేస్తున్నారని అన్నారు.

కేవలం పార్టీ మీద కేసీఆర్ మీద ఉన్న అభిమానంతోనే శేర్లింగంపల్లిలో జరుగుతున్న ప్రతి సమావేశం విజయవంతం అవుతుందని కేటీఆర్ తెలిపారు. “హైడ్రా” పేరుతో నియోజకవర్గంలో పేదల ఇళ్లు కూలగొడుతున్న తీరును ప్రతి ఒక్కరికీ తెలియజేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. గత రెండు సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్‌కు చేసిన ద్రోహాన్ని, రద్దు చేసిన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రజలకు వివరించాలన్నారు.