09-01-2026 12:56:40 AM
కండువా కప్పి ఆహ్వానించిన అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
హైదరాబాద్/వనపర్తి, జవనరి 8 (విజయక్రాంతి): సిద్దిపేట, వనపర్తి జిల్లాలకు చెందిన పలువురు నాయకులు బుధవారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) లో చేరారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌చార్జి జ్యోతి పండల్, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు తుప్పతి భిక్షపతి, ఉపాధ్యక్షుడు నర్సింగ్ ఆధ్వర్యంలో నాయకులు టీఆర్పీలో చేరారు. హైదరాబాద్‌లోని తెలంగాణ రాజ్యాధికార పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే వనపర్తి జిల్లాకు చెందిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలకు చెందిన పలువురు కీలక నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్‌లో తీన్మార్ మల్లన్న సమక్షంలో టీఆర్పీలో చేరారు.
పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ.. ప్రస్తుత అధికార పార్టీలో జరుగుతున్న మోసపూరిత రాజకీయాలను, బీసీలపై జరుగుతున్న అన్యాయాన్ని భరించలేకనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సామాజిక న్యాయం జరగాలంటే అది కేవలం తెలంగాణ రాజ్యాధికార పార్టీతోనే సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్సీ తీన్మార్ మల్ల న్న మాట్లాడుతూ.. సంస్థాగత నిర్మాణంలో భాగంగా పార్టీ బలోపేతంలో ప్రతి కార్యకర్త క్రియాశీలక భాగస్వామి కావాలని, నాయకులు, కార్యకర్తలు నిబద్ధతతో పనిచేసి ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. అణగారిన వర్గాలకు రాజ్యాధికారమే లక్ష్యం గా పార్టీ ముందుకు సాగుతుందన్నారు.
రెండో రోజూ కొనసాగిన నిరసనలు
తీన్మార్ మల్లన్న పిలుపు మేరకు రాష్ట్రంలో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ శ్రేణులు రెండో రోజు గురువారం కూడా నిరసనలు చేపట్టారు. తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టరేట్‌లలో అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. బీసీల అభివృద్ధి చట్టబద్ధమైన సబ్ ప్లాన్ ద్వారానే సాధ్యమని వారు స్పష్టం చేశారు.