ఏడాది పాలనలో అన్ని రంగాల్లో విఫలం
- గోబెల్స్‌ను మించిన రేవంత్ ప్రచారం
- మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, డిసెంబర్ 1 (విజయక్రాంతి): ఏడాది పాలనలో కాంగ్రెస్ అన్ని రంగాల్లో విఫలమైందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఈ సర్కారును ఎవరు మెచ్చుకునే పరిస్థితి లేదని, సీఎం రేవంత్ తన భుజం తానే తడుముకుంటూ మాది సుపరిపాలన అని డబ్బా కొట్టుకుంటున్నాడని ఎద్దేవా చేశారు.
ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ కాంగ్రెస్‌ది సుపరిపాలన అని ప్రజలు చెప్పాలని.. ఆయన కాదన్నారు. రేవంత్ అపరిపక్వత, అసమర్థత, ప్రతికూల వైఖరితో రాష్ర్టం అన్నిరంగాల్లో ప్రతికూల వాతావరణం ఎదుర్కొంటుందన్నారు. తాము మంచి ఆర్థిక వృద్ధితో రాష్ట్రాన్ని అప్పగిస్తే, కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆశించిన మేరకు ఆర్థిక వృద్ధి రేటు పెరగలేదన్నారు.
వృద్ధి రేటు పెంచే సత్తా లేదు, సంపద పెంచలేక, ప్రజలకు పంచలేక నోటికి వచ్చినట్లు విమర్శలు చేస్తూ నెపం ప్రతిపక్షం మీద వేసే ప్రయత్నాలు చేస్తున్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలన ముందు దగా, వెనుక దగా, కుడి ఎడమల దగా దగా అన్న శ్రీశ్రీ కవిత మాదిరిగా కనిపిస్తుందన్నారు.
ఏడు లక్షల కోట్ల అప్పు అని ఏడాది కాలం నుంచి చెప్పిన అబద్ధం మళ్లీ మళ్లీ చెప్పడం మానుకోవాలని సూచించారు. అబద్ధాలు ప్రచారం చేస్తే గోబెల్స్ ప్రచారం అంటాడని, గోబెల్స్ ను మించిన ప్రచారం రేవంత్‌ది అని ఎద్దేవా చేశారు. గతంలో సీఎల్పీ లీడర్‌గా ఉన్న భట్టి విక్రమార్కకు రాష్ర్ట అప్పులు ఎంతో, ఆదాయం ఎంతో తెలియదా అని ప్రశ్నించారు.
తెలంగాణకు అప్పు రూ. 4,26,499 కోట్లు ఉందని అసెంబ్లీ వేదికగా లెక్కలతో సహా నిరూపించినట్లు తెలిపారు. ఏ ఛానల్ వేదికగానైనా, ఆర్థిక నిపుణులతో చర్చిద్దామని సవాల్ విసిరారు. మోసం చేసే అలవాటు, మోస పోవుడు ప్రజలకు అలవాటు అనే నమ్మకం ముఖ్యమంత్రిలో ఉందన్నారు.
కేసీఆర్ పేరు ఉచ్చరించే నైతికత లేదని, రైతుల మీద ప్రేమ ఉంటే, నిజమైన ప్రజాపాలనే అయితే సంపూర్ణ రుణమాఫీతో పాటు, వరంగల్ డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. వాటిని పూర్తి చేసిన తరువాతే రైతు పండుగ, పరిపాలన విజయోత్సవాలు నిర్వహించాలని సూచించారు.




