17 April, 2026 | 11:03 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

తడబడితే తప్పదు మూల్యం

16-05-2025 01:25 AM

పుట్టగొడుగుల్ల ప్రైవేట్ విద్యాసంస్థలు

నిద్రమత్తులో విద్యాశాఖ?

నల్లగొండ టౌన్, మే 15 : విద్యా సంవత్సరం మరో నెల రోజుల్లో ప్రారంభం కానుంది.నల్లగొండ జిల్లాలో పుట్టగొడుగుల్లా ప్రైవేటు విద్యా సంస్థలు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల తోక పేర్లతో నూతన బ్రాంచిల పేరిట ఆయా ప్రాంతాల్లో ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు హంగులూ ఆర్భాటాలతో తల్లీ దండ్రులను ఆకర్షించేందుకు ప్రచారాలు చేస్తూ ప్రవేశాల ప్రక్రియను చేపడుతున్నారు.

తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే విద్యార్థుల చేరికలో ఆయా పాఠశాలలకు అనుమతి ఉన్నదేదో లేనిదేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో తల్లిదండ్రులకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. విద్యాశాఖ నియంత్రణ కొరవడంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే కొన్ని విద్యా సంస్థలు సీబీఎస్‌ఈ అనుమతులు ఉన్నట్లు ప్రచారం చేస్తున్నాయి.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొత్త ప్రైవేటు పాఠశాల ప్రారంభించాలంటే విద్యాశాఖ అనుమతి తీసుకోవాలి. మొదట ఓపెనింగ్ అనుమతి తీసుకున్న తర్వాతే విద్యా సంస్థలను తెరచి విద్యార్థులను చేర్చుకోవాలి. తర్వాత పూర్తి స్థాయి అనుమతి పొందాలి. ప్రాథమిక స్థాయికి జిల్లా విద్యాశాఖ అధికారి నుంచి, ఉన్నత తరగతులు ప్రారంభించాలంటే విద్యాశాఖ రీజనల్ డైరెక్టర్ (ఆర్జేడీ) ద్వారా పాఠశాల విద్యా కమిషనర్ అనుమతి తీసుకోవాలి. సీబీఎస్‌ఈ సిలబస్ బోధించేందుకు కేంద్ర విద్యామండలి సమ్మతించాలి. ఇలా అన్ని అనుమతులుంటేనే పాఠశాలలను నిర్వహించాలి.

వీటిపై ఆరా తీయండి...

ప్రతి విద్యా సంస్థ ప్రభుత్వం నుంచి కచ్చితంగా గుర్తింపు పొంది ఉండాలి. ఇది నిబంధన. అయితే చాలా విద్యాసంస్థల బోర్డులు, ప్రకటనలు నిశితంగా పరిశీలిస్తే రిజిస్టర్ అని ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఎవరైనా చేసుకోవచ్చు. కానీ విద్యాశాఖ నుంచి గుర్తింపు తీసుకోవడం తప్పనిసరి. గుర్తింపు పొందిన విద్యా సంస్థలలోనే తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించాలి. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కొన్ని పాఠశాలలు ఇతర విద్యా సంస్థల తరపున పరీక్షలు రాయిస్తుంటారు.

అలా పరీక్ష రాసిన విద్యార్థులను ప్రభుత్వం ప్రైవేటు విద్యార్థిగానే పరిగణిస్తుంది. మరికొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు బ్రాంచీల పేరుతో పాఠశాలలను, కళాశాలలను నడుపుతూ ఎక్కడో ఉన్న మెయిన్ బ్రాంచి ద్వారా పరీక్షలు రాయిస్తుంటారు. ఇలాంటి విషయాలలో తల్లిదండ్రులు కచ్చితంగా విచారించి విద్యా సంస్థ అనుమతి పత్రాలను అడిగి తెలుసుకున్న తరువాతే పిల్లలను చేర్పించాలి.

ముందస్తు అడ్మిషన్లతో తస్మాత్ జాగ్రత్త....

ఆకట్టుకునే ప్రచారాలు నమ్మి మోసపోవద్దు.పాఠశాలల గురించి తెలుసుకున్నాకే పిల్లలను చేర్పించాలి. రిజిస్ట్రేషన్, గుర్తింపుపై ఆరా తీయాలి. క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నారని పరిశీలించాకే అడ్మిషన్ తీసుకోవాలి.

జిల్లాలో ప్రభుత్వ అనుమతి లేని స్కూళ్లు ఇవే....

జయ హైస్కూల్ (రవీంద్రనగర్, నల్లగొండ), ఎలైట్ స్కూల్ (నల్లగొండ), లిటిల్ స్కాల ర్స్ హైస్కూల్ (నల్లగొండ), వేదాంత హైస్కూల్(రామగిరి, నల్లగొండ).శ్రీచైతన్య(హాలియా), శ్రీచైతన్య (దేవరకొండ) 

గుర్తింపు లేని పాఠశాలల్లో చేర్పించొద్దు

 నల్లగొండ జిల్లాలో ఆరు పాఠశాలలకు  గుర్తింపు లేవు. గుర్తింపు లేని పాఠశాలలలో  తమ పిల్లలను చేర్చవద్దు.  ప్రైవేట్ పాఠశాలల్లో పిల్లలను చేర్పించేటప్పుడు తల్లిదండ్రులు ఆ పాఠశాలకు ప్రభుత్వ గుర్తింపు ఉందా లేదా అని తెలుసుకోవాలి. గుర్తింపు లేకుండా పాఠశాలలను ఏర్పాటు చేసి అడ్మిషన్లు తీసుకుంటే నిబంధనలు మేరకు  కఠిన చర్యలు ఉంటాయి.

 డీఈవో బొల్లారం భిక్షపతి