2 July, 2026 | 1:21 AM

దర్జాగా అక్రమ నిర్మాణం!

02-07-2026 12:30 AM

అనుమతి కొంత.. నిర్మాణం కొండంత

చోద్యం చూస్తున్న టౌన్ ప్లానింగ్ సిబ్బంది

నోటీసుల సమయం గడిచినా చర్యలు శూన్యం

కుత్బుల్లాపూర్, జూలై 1 (విజయక్రాంతి): దుండిగల్ సర్కిల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అనుమతులు కొంతవరకే పొంది అక్రమంగా అదనపు అంతస్థులు నిర్మిస్తూ చట్టానికి సవాల్ విసురుతున్నారు కొందరు అక్రమ నిర్మాణదారులు.

ఇష్టరీతిగా అదనపు అంతస్థులు నిర్మించడం పట్ల పక్కన నివసిస్తున్న స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే దుండిగల్ సర్కిల్ పరిధిలోని బహదూర్ పల్లి డివిజన్ బాలాజీ కాలనీలో ఓ నిర్మాణదారుడు చట్ట ప్రకారం జీ +2 అనుమతులు పొందాడు. అయితే సదరు నిర్మాణదారుడు అనుమతి ప్రకారం కాకుండా అదనపు అంతస్థులు నిర్మిస్తూ బహిరంగంగా చట్టానికి సవాల్ విసురుతున్నాడు.

ఓ పార్టీ నాయకుడి అండ..

అయితే సదరు అక్రమ నిర్మాణం వెనుక ఓ పార్టీ నాయకుడి అండ ఉందంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో సదరు నిర్మాణదారుడు అధికారులు ఏమీ చేయలేరు అనే ధీమా వ్యక్తం చేస్తూ అక్రమంగా అదనపు అంతస్తులు నిర్మిస్తున్నాడు. అందుకే టౌన్ ప్లానింగ్ సిబ్బంది కూడా చర్యలకు వెనుకాడుతున్నారని సమాచారం. ఓవైపు ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి అక్రమాల పట్ల చర్యలు తీసుకుంటూ, అక్రమ నిర్మాణదారులు, అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తుంటే.. కొందరు  నాయకులు మాత్రం అక్రమాలకు అండగా నిలుస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు.

గడువు దాటినా చర్యలు శూన్యం..

సదరు అక్రమ నిర్మాణంపై టౌన్ ప్లానింగ్ సిబ్బందిని సమాచారం అడగగా, అక్రమ నిర్మాణానికి రెండు నోటీసులు పూర్తయ్యాయని తెలిపారు. నోటీసుల సమయం గడిచినా కూడా అక్రమ నిర్మాణంపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 

దీంతో అధికారులు అక్రమార్కులకు ఎంతలా గులాం అవియ్యారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ స్పందించి అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సదరు అక్రమ నిర్మాణంపై సర్కిల్ ఏసీపీ వివరణ కోసం సంప్రదించగా అందుబాటులో లేరు.