పాత్రికేయులపై దాడి హేయమైన చర్య
- బాధ్యులపై చర్యలు తీసుకోకుంటే ఆందోళన చేస్తాం
- టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు మల్లేష్ యాదవ్
మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని గుడిపేటలో నిర్మిస్తున్న మెడికల్ కళాశాల వద్ద అక్రమంగా మొరం తవ్వకలు జరుగుతున్నాయని స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అక్కడికి వెళ్లిన పాత్రికేయులపై కాంట్రాక్టర్లు దురుసుగా ప్రవర్తిస్తూ దాడికి పాల్పడడం అమానుషం అని, వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు తొట్ల మల్లేష్ యాదవ్ డిమాండ్ చేశారు.
నిత్యం ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలపై కథనాలు రాస్తూ, ప్రభుత్వ ఆస్తులను కాపాడే క్రమంలో జర్నలిస్టుల పాత్ర ఎనలేనిదనీ, అటువంటి జర్నలిస్టులపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్య వాదానికి వ్యతిరేకమని మండిపడ్డారు. అక్రమ మట్టి రవాణాపై సంబంధిత శాఖ అధికారులు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కు, రామగుండం పోలీస్ కమిషనర్ కు వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు. గతంలో కూడా ఇదే కాంట్రాక్టర్ ఓ పాత్రికేయుడిపై దాడి చేసిన ఘటనలో కేసులు కూడా నమోదు అయ్యాయని తెలిపారు. తక్షణమే దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకొని కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.




