పల్లె పోరుకు సర్వం సిద్ధం చేసిన అధికారులు
ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
గరిడేపల్లి (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ మూడో విడత ఎన్నికలను అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు. హుజూర్నగర్ నియోజకవర్గంలోని గరిడేపల్లి, నేరేడుచర్ల, పాలక వీడు, హుజూర్నగర్, మఠంపల్లి మండలాల్లో మంగళవారం ఎన్నికల సందర్భంగా ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బుధవారం జరుగుతున్న మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలను ఎన్నికల సిబ్బంది పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, బాధ్యతతో విధులు నిర్వహించాలని ఆయన కోరారు.
ప్రజాస్వామ్యంలో ఎన్నికలపై ప్రజలకు ఎంతో విశ్వాసం ఉందని అలాంటి నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ఎన్నికల సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. హుజూర్నగర్ డివిజన్ పరిధిలోని హుజూర్నగర్ మఠంపల్లి పాలక వీడు చింతలపాలెం మేళ్లచెరువు గరిడేపల్లి నేరేడుచర్ల మండలాల పరిధిలో 146 గ్రామ పంచాయతీ సర్పంచులకు, 1318 వార్డు సభ్యులకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా 22 మంది సర్పంచులు, 257 వార్డు సభ్యులు ఏకగ్రీవం అయినట్లు తెలిపారు. దీంతో డిసెంబర్ 17 బుధవారం 124 గ్రామ పంచాయతీలకు, 1061 వార్డు సభ్యులకు 1176 పోలింగ్ స్టేషన్లో ఎన్నికలు నిర్వహించేందుకు అంతా సిద్ధం చేసినట్లు తెలిపారు.
పోలింగ్ నిర్వహణ సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు వెళ్లేటప్పుడు సామాగ్రి అంతా ఉన్నదో లేదో పరిశీలించుకోవాలని తెలిపారు. కొన్నిచోట్ల సర్పంచులు ఏకగ్రీవమయ్యారని అక్కడ వార్డులకు ఎన్నిక జరుగుతుందని, వార్డు సభ్యులు ఏకగ్రీవం అయిన చోట సర్పంచులకు ఎన్నిక ఉంటుందని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని బ్యాలెట్ పేపర్లు తీసుకునే విషయంలో ఆర్వోతో పాటు ఎన్నికల సిబ్బంది చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు. పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న అనంతరం అక్కడ ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే పంచాయతీ కార్యదర్శితో పాటు ఎంపీడీవోకి సమాచారం అందిస్తే వాటిని పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. పోటీ చేసే అభ్యర్థుల పేర్లకు ఎదురుగా గుర్తులను జాగ్రత్తగా పెట్టాలని వాటిని పోలింగ్ కేంద్రం ముందు ప్రదర్శించాలని సూచించారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఎక్కడైనా ఒంటిగంట లోపే 100% పోలింగ్ నమోదు అయినప్పటికీ మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ బ్యాలెట్ బాక్స్ సీల్ చేయరాదని ఫారాలు నింపరాదని తెలిపారు. ఎవరైనా 100% ఓటింగ్ నమోదయిందని బ్యాలెట్ బాక్సులు సీల్ చేసిన ఫారాలు నింపిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. మధ్యాహ్నం ఒంటిగంట అనంతరం పోలింగ్ కేంద్రం ప్రాంగణంలో ఎవరైనా ఓటర్లు ఉంటే వారికి చివరి నుంచి వరుస క్రమంలో టోకెన్లు జారీ చేసి అందరూ ఓటేసిన అనంతరం పోలింగ్ ముగింపు చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రం, కౌంటింగ్ కేంద్రం వేరువేరుగా ఏర్పాటు చేస్తే అక్కడికి బ్యాలెట్ బాక్సులను పోలీసు భద్రతతో ప్రత్యేకమైన వాహనం ద్వారా తరలించాలని ఆదేశించారు. మధ్యాహ్నం రెండు గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభించాలని, దీనికోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఎన్నికల ఫలితాల విషయంలో లెక్కింపు ప్రక్రియ ప్రారంభం నుంచి చివరి వరకు వీడియోగ్రఫీ చేయాలని అన్నారు. సందేహం ఉన్న ఓట్లపై నిర్ణయం తీసుకున్న తర్వాతే లెక్కింపు ప్రక్రియ ప్రారంభించాలని కోరారు. సర్పంచి ఓట్లు లెక్కింపు పూర్తయిన వెంటనే ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహించేలా మొదటి నోటీసు ఇవ్వాలని, అది సాధ్యం కాకపోతే రెండవ నోటీస్ జారీ చేసి డిసెంబర్ 18న కోరం ఏర్పడితే ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించాలన్నారు. రెండవసారి కూడా ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహించటం సాధ్యపడకపోతే డిసెంబర్ 18న మధ్యాహ్నం మూడవ నోటీస్ జారీ చేసి కోరం లేకుండానే ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహించుకోవచ్చు అని తెలిపారు. ఎక్కువ ఓట్లు ఉన్నచోట ఆరువోళ్లకి సహాయం కోసం ఏఆర్వోలను నియమించినట్టు తెలిపారు.
ఎన్నికల కమిషన్ సూచన మేరకు రెండు, మూడు టేబుల్స్ ఏర్పాటు చేసి ఓట్ల లెక్కింపు జరుగుతుందని, ఓట్ల లెక్కింపు పూర్తయిన అనంతరం రీకౌంటింగ్ చేసేటప్పుడు జిల్లా ఎన్నికల విభాగం అనుమతితో ఎన్నికల ఫలితాలు ప్రకటించాలన్నారు. రీకౌటింగ్ చేసేటప్పుడు రీవెరిఫికేషన్ చేయరాదని కేవలం ఓట్లు మాత్రమే లెక్కించాలని సూచించారు. ఎన్నికలు నిర్వహించే గ్రామాలలో శాంతి భద్రతల విషయంలో, పోలింగ్ విషయంలో ఏదైనా గందరగోల పరిస్థితి ఏర్పడితే అవాంఛనీయ సంఘటనలు జరిగిన వెంటనే పై అధికారులకు తెలపాలని సూచించారు. గ్రామాలలో ఎన్నికల నిర్వహించి సిబ్బందికి సంబంధిత గ్రామపంచాయతీ కార్యదర్శి, సిబ్బంది సహకరించాలన్నారు.
ప్రతి ఒక్కరూ ఓటు వేయటం బాధ్యతగా భావించి ఓటింగ్లో పాల్గొని పోలింగ్ శాతాన్ని పెంచాలని కోరారు. పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల ఫలితాలు వెల్లడించిన అనంతరం ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, బాణాసంచాలు కాల్చడం లాంటివి చేయరాదని, ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసే విధంగా అభ్యర్థులు, అధికారులు, ప్రజలు సహకరించాలని కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో అన్ని మండలాల ఎంపీడీవోలు, తహసిల్దార్లు ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






