జోరుగా ఎర్రమట్టి అక్రమ తవ్వకాలు
ఓవర్ లోడ్‌తో యదేచ్ఛగా రవాణా
పట్టించుకోని అధికారులు
ప్రభుత్వ ఆదానికి భారీ నష్టం
తాండూరు, మార్చి 3 (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం తట్టెపల్లి లో అనుమతులు ఏమి లేకుండా ఎర్ర మట్టి అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. అంతేకాదు ఓవర్ లోడ్ తో ఎర్ర మట్టిని అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
దీంతో ప్రభుత్వానికి రావలసిన ఆదాయం భారీ ఎత్తున గండిపడుతోంది. గ్రామ శివారులోని సర్వే నంబర్ 206 లో ఎలాంటి అనుమతులు లేకుండా పట్టపగలు తవ్వకాలు జరుపుతూ ఒక్కో టిప్పర్ 10000 రూపాయలకు విక్రయాలు చేసుకుంటూ అక్రమ దందాకు తెగ పడుతున్నారు. ఇలా నిత్యం వందల సంఖ్యలో ఎర్ర మట్టి అక్రమ రవాణా అవుతుంది.
గ్రామం నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సమీపం నుండి ఓవర్ లోడ్ వాహనాలు వెళ్తుండడంతో పాఠశాలకు వెళ్లే చిన్నారులు రోడ్డు దాటాలంటేనే భయపడుతున్నారు. అక్రమ తవ్వకాలను అడ్డుకోవాల్సిన రెవిన్యూ , గనులు భూగర్భ శాఖ అధికారులు, ఓవర్ లోడ్ మట్టి రవాణా ను అడ్డుకోవాల్సిన పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అక్రమ ఎర్రమట్టి తవ్వకాలను నిబంధనల మేరకు జరిగేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.




