కలెక్టర్ ఆదేశాలు బే ఖాతర్
ఇసుక అక్రమ తవ్వకాలు..
జోరుగా సాగుతున్న అక్రమ రవాణా.
తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా(Vikarabad District) తాండూరు మండలం చంద్రవంచ వాగులో(CHANDRA VANCHA VAGU) అనుమతులు ఏవి లేకుండా ఇసుక తవ్వకాలు(Illegal Sand Mining) జరుగుతున్నాయి. యదేచ్ఛగా అక్రమార్కులు అక్రమ రవాణా కూడా చేస్తున్నారు. ఇంత జరుగుతున్న సంబంధిత మైన్స్, రెవెన్యూ పోలీస్ ధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తుండడంతో అక్రమార్కులు మరింత రెచ్చిపోతున్నారు. కోట్పల్లి ప్రాజెక్టు పునర్నిర్మాణం కోసం సంబంధిత కాంట్రాక్టర్ అనుమతి తీసుకున్నాడు. అయితే ఇదే అదనుగా అనుమతులు ఓ చోటికి తీసుకొని మరోచోటికి ఇసుక రవాణా చేస్తూ అక్రమ దందాకు తెరలేపుతున్నారు. అక్రమ రవాణా, తవ్వకాలకు అడ్డుకోవాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు వినవస్తున్నాయి.
ఇటీవల కలెక్టర్ దీపక్ తివారి(Collector Deepak Tiwari) ప్రత్యేక సమావేశం నిర్వహించి ఇసుక అక్రమ తవ్వకాలకు, రవాణాకు పాల్పడుతున్న వారిని ఎంతటి వారినైనా ఉపేక్షించకూడదని. .వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు చేయాలని సూచించారు. అయినా కూడా అక్రమార్కులు ఇవేమీ పట్టించుకోకుండా అధికార పార్టీకి చెందిన కొందరు నాయకుల అండతో హిటాచి లాంటి భారీ యంత్రాలతో తవ్వకాలు జరుపుతూ భారీ టిప్పర్లతో ఇసుక రవాణా చేస్తూ యదేచ్ఛగా తమ దందాను కొనసాగిస్తున్నారు. ఈ విషయమై తాండూర్ తాసిల్దార్ తారా సింగ్ ను వివరణ కోరగా చంద్రవంచలో చెక్ డాం నిర్మాణం, కోట్పల్లి ప్రాజెక్టు పునర్నిర్మాణం కోసం ఏప్రిల్ ఫస్ట్ వరకు మాత్రమే అనుమతులు ఉన్నాయని అనుమతులు లేకుండా తవ్వకాలుగాని రవాణా గాని చేస్తే కలెక్టర్ ఆదేశాల మేరకు వాహనాలు జప్తు చేసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అన్నారు.




