వాట్సాప్, మెయిల్ ద్వారా వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి
మంత్రి జూపల్లి
వనపర్తి, ఆగస్టు 28 (విజయక్రాంతి): ప్రజలు తమ సమస్యలను రాతపూర్వకంగా వాట్సాప్ లేదా మెయిల్ ద్వారా పంపినా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, వాటిని ప్రింట్ తీసుకుని నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని రాష్ట్ర అబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు.
శుక్రవారం పానగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన గ్రామసభలో పానగల్ మండల పరిధిలోని గ్రామపంచాయతీల ప్రజలు గత రెండున్నర సంవత్సరాలుగా వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు సమర్పించిన ఫిర్యాదులు, పరిష్కారమైన సమస్యలు, ఇంకా పెండింగ్లో ఉన్న అంశాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. సాంకేతికత పెరిగిన ప్రస్తుత తరుణంలో ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ నెలల తరబడి తిరగాల్సిన అవసరం ఉండకూడదన్నారు.
సాధారణ ఫిర్యాదులను గరిష్టంగా వారం రోజుల్లో, విద్యార్థులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను రెండు మూడు రోజుల్లో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్లో ఉన్న రెవెన్యూ, ఇందిరమ్మ ఇళ్లు, విద్యుత్ తదితర శాఖలకు సంబంధించిన సమస్యలను ఒక్కొక్కటిగా సమీక్షించి, పరిష్కార మార్గాలను సూచించారు. ఆర్థిక స్థోమత లేక ఇళ్ల నిర్మాణం ప్రారంభించని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసి, వారికి బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
గ్రామ, మండల స్థాయి సమస్యలను మండల స్థాయిలోనే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి గ్రామ, మండల స్థాయి సమస్యలను సాధ్యమైనంత వరకు మండల స్థాయిలోనే వెంటనే పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖీమ్యా నాయక్, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, డీఆర్‌ఓ తిరుపతయ్య, తహసీల్దార్ కార్తిక్, ఎంపీడీవో గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.






