‘అమ్మ తలపులో’ తలమునకలై..
నేను ఇటీవల కవి డాక్టర్ భూసురపల్లి వెంకటేశ్వర్లు కవితల సంపుటి ‘అమ్మ తలపులో’ చదివాను. కవి తన తల్లిపై ఉన్న ప్రేమతో రాసుకున్న కవితలవి. ఆయన ఎంతో ఇష్టంగా నాకు తన పుస్తకాన్ని పంపించారు. ఈ కవి విశ్రాంత కవితలు చదివితే మా అమ్మ యాదికొస్తది. అట్లనీ చదువకుండా వుండలేను. మొత్తానికి చదువు చదువుతూ దుఃఖంలో తడిసి పచ్చిముద్దయ్యాను. మా అమ్మ నాకు దూరమై 24 ఏండ్లు. ఆ వెలితి నన్ను దుఃఖసాగరంలో ముంచేసింది.
ఈ కావ్యంలో ప్రతి అక్షరంలో మా అమ్మే కనిపించింది. నాకే కాదు ఈ పుస్తకంచదివే ప్రతి పాఠకుడి తల్లి పాదముద్రలూ కవిత్వంలో కనిపిస్తవి. శీర్షికలన్నీ కన్నీళ్లు పెట్టిస్తవి. చల్ల కవ్వం గుత్తిమీద/బొటనవేలుతో గీరి/ అరచేతిలో వెన్నతో పెట్టిన/చిన్ననాటి శ్రీ చుక్క/ ఇప్పటికీ నా కళ్లల్లో మెరుస్తూనే ఉంది/ముందు లేచినందుకు బహుమతిగా/ నాలుక మీద రాసిన/ ముత్యమంత వెన్నపూస/ నన్నింకా ఊరిస్తూనే ఉంది’ అంటూ కవి అమ్మ చల్లని కవ్వంపై చిలికిన వెన్నను బొటనవేలుతో గీరి చుక్కగా పెట్టిన జ్ఞాపకం, గోరుముద్దల తీపిని అమ్మ చేతి మాధుర్యాన్ని అమృత క్షణాలు మళ్లెప్పుడొస్తాయో నని దుఃఖాన్ని వలపోస్తూ,
ముత్యమంత వెన్నపూస నన్ను ఇంకా ఊరిస్తూనే ఉందని అమ్మ ప్రేమను అక్షరీకరించిన మొదటి కవితలోని మొదటి చరణాలు అమ్మ మనసును ఆవిష్కరించాయి. రక్తస్పర్శలో రాఖీ ఎరగని వాణ్ని /ఆటలోగాని పాటలో గాని/ తయారై స్కూలు కెళ్లేటప్పుడు/ అమ్మ పెట్టే గోరుముద్దలు పంచుకోడానికైనా/ ఎటూ ఒక తోడు లేని వాణ్ణి/ నాతో కన్నీరు పంచుకోవడానికైనా/ ఒక చెల్లెలుంటే బాగుండేది/నా బిడ్డలకొక మేనత్త ఉండేది/ నా యిల్లు పుట్టిల్లైఉండేది/నా రక్తమే ప్రవహించే రాఖీ/ నా చేతికి మెరుస్తుంటే/ ఎంత బాగుండేది ’అంటూ కవి తోడబుట్టిన అక్కాచెల్లెళ్లులేని బాధను వ్యక్తం చేశారు.
డాక్టర్ భూసురపల్లి ఒక కవిత్వమై, నాదస్వరమై గాత్రమై, డోలు వాద్యమై, మంగళ వాద్యాలతో అమ్మవారికి పెద్ద మంగళారతిచ్చినట్లుగ ..‘అమ్మ తలపులో’ కావ్యం చరిత్రలో నిలిచేలా ఉంది. ధాన్యం గరిశె, నీళ్ల తొట్లు, గంగాళం, పొంగలి గుండిగలు, ఇత్తడి కాగులు, ఇళ్లంతా ఇత్తడి సామాన్లు.. వాటన్నింటినీ అమ్మ అందంగా సద్ది ఇంటిని మినీ మ్యూజియం చేసిందని చెప్తూ కవి మురిసి ముక్కలవుతారు. ‘ఎవరికైనా అమ్మే తొలి విద్యావంతురాలు అమ్మ.
తొలి ఉపాధ్యాయినీ అమ్మ.అమ్మ ఒక విశ్వవిద్యాలయం. నాన్న కొట్టిన దెబ్బలకు నాకన్నా ముందు అమ్మ కంట్లో కన్నీళ్లు చూశాను. ఉన్నత చదువులకు విశాఖపట్నం వెలుతుంటే అమ్మ నుదుట పెట్టిన ముద్దు. అక్కడ అందరితో జాగ్రత్త!అని చెప్పిన భధ్రమనే ప్రేమ. నాన్న డోలు వాద్యం డమరుకం పగిలిపోయినపుడు మేకచర్మంతో కుడిఎడమల డోలు మూతలకి అమ్మ చేసిన శ్రమ,అమ్మ నాన్నల అన్యోన్యత, ఆరేళ్ల కింద నాన్న చనిపోయినప్పుడు, అమ్మ కన్నీళ్లు కట్టలు తెంచుకున్న సందర్భం.
ఇప్పుడు నా కళ్లలో రాలే చినుకుల మధ్య అమ్మని సాగనంపాను’ అని కవి చెప్పిన వాక్యాలు కన్నీటి చెమ్మ కలిగిస్తాయి. కవి అమ్మ స్పర్శ కోసం అలమటించాడు. చదువు కోసం ఊరికి పంపినప్పుడు బిడ్డ దూరముంటే అమ్మ కన్నీళ్లు, ఉద్యోగం వచ్చినప్పుడు అమ్మ కళ్లలోని ఆనంద బాష్పాలను తన జ్ఞాపకాల్లో చెక్కు చెదరకుండా నిలుపుకొన్నారు. అమ్మతనపు ప్రేమానురాగాలను అక్షర పూపంలో పొందాలనుకునే ప్రతి పాఠకుడూ చదవాల్సిన పుస్తకమిది.






