29-12-2025 12:00:00 AM
తెలంగాణ మట్టి అస్తిత్వాన్ని, పల్లె పదాల సౌందర్యాన్ని తన కలంతో ప్రపంచానికి చాటిన అరుదైన సాహిత్యకారుడు అన్నవరం దేవేందర్. అచ్చమైన గ్రామీణ భాషకు పట్టంకట్టి రెండున్నర దశాబ్దాలుగా సాహిత్య సేవ చేస్తున్నారు. ఒక జర్నలిస్టుగా ప్రజా సమస్యలను లోతుగా దర్శించి, ప్రభుత్వ ఉద్యోగిగా గ్రామీణ ప్రజల జీవనశైలిని పరిశీలించిన ఆయన తన అనుభవాలను రంగరించి అద్భుతమైన రచనలు చేశారు.
‘తొవ్వ’, ‘నడక’, ‘మంకమ్మ తోట లేబర్ అడ్డా’, ‘వరి గొలుసులు’ వంటి మొత్తం 13 కవితా సంపుటాలు, అనేక వ్యాస సంకలనాలు వెలువరించారు. అనేక పత్రికల్లో కాలమ్స్ రాస్తున్నారు. ఆయన కవిత్వం ఆంగ్లంలో కూడా వెలువడటం విశేషం. ఆయన సేవలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం 2025 సంవత్సరానికిగాను దాశరథి సాహితీ పురస్కారం ప్రదానం చేసింది. అలాంటి కవి, రచయితతో ‘విజయక్రాంతి’ ప్రత్యేక ఇంటర్వ్యూ.
విజయక్రాంతి: మీ నేపథ్యం చెప్పండి?
కవి: మా స్వస్థలం ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ప్రస్తుత సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ మండలం పోతారం. కరీంనగర్‌లోని భగత్ నగర్‌లో మా నివాసం. సతీమణి రాజేశ్వరి. మాకు ఇద్దరు పిల్లలు. స్వాతి, గౌతమ్.
మీరు కవితా రచనలో పల్లె పదాలను ఎంచుకోవడంలో ప్రధాన కారణం?
కవి: అచ్చమైన తెలుగు భాష ఇంకా పల్లెల్లోనే ఉంది. అది తెలంగాణ తెలుగు భాష. మా ఇంట్లో, ఊరిలో మాట్లాడే భాష. ఆ భాషలో సొగసు ఉంది. మన భాష దశాబ్దాలుగా విస్మృతికి గురైంది. అందుకే నా రచనల్లో అచ్చమైన తెలంగాణ పల్లె పదాలు ఉండాలని నిర్ణయించుకున్నాను. పల్లె పదాలన్నింటినీ ఏరుకొని, వాటిని వాక్యాలు నిర్మించి కవిత్వం అల్లుతున్నాను.
జర్నలిస్టు గా పనిచేసిన సమయంలో, ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వర్తించిన సమయంలో ఎదురైనా అనుభవాలేమైనా రచనకు దోహద పడ్డాయా?
కవి: ఆ రెండు వృత్తుల ప్రభావం నా సాహిత్యంలో ఉంటుంది. జర్నలిజం అంటే ప్రజా సమస్యలను లోతుగా పరిశీలించడం. సమాజాన్ని అధ్యయనం చేయడం. ఆ రెండూ సాహిత్య ప్రక్రియకు ఉపయోగపడతాయి.అవి నన్ను నిరంతరం జాగరుకత ఏర్పరుస్తాయి. అలాగే పంచాయతీరాజ్‌శాఖలో నా ఉద్యోగ జీవితం కూడా సాహిత్య ప్రక్రియకు ఉపయోగపడుతుంది.
నా ఉద్యోగ జీవితమంతా ప్రజల మధ్యనే సాగిఇంది. ప్రజలతో ప్రత్యక్షంగా సంబంధాలు ఉండటం నాకు మంచి అనుభవం. నేను పల్లె పల్లె తిరిగాను. ప్రజలు మాట్లాడే భాషను, వారి భావ వ్యక్తీకరణను గమనించాను. వారి నుంచి ఎన్నో సామెతలు విన్నాను. అలవోకగా, అందమైన సొగసుతో ప్రజలు మాట్లాడే భాషను ఒడిసిపట్టాను. తర్వాత అదే భాషను నా కవిత్వంలో వ్యక్తీకరించాను. రెండు వృత్తులూ నా సాహిత్య జీవితానికి ఒక ఉద్దీపన.
మీకెవరు ఆదర్శం?
ప్రజల కోసం నిరంతరం పనిచేసే వారంతా నాకు ఆదర్శం. సమాజం పట్ల తాత్విక అవగాహన చైతన్యం కలిగిన వారందరూ ఆదర్శమే. సామాజిక దృక్పథంతో రచనలు చేసే వారు కూడా ఆదర్శం.
కరీంనగర్‌లో ఏటా జరిగే ‘ఎన్నిల ముచ్చట్లు’ గురించి చెప్పండి. ఇకముందు కూడా ఆ కవుల గోష్ఠిని కొనసాగిస్తారా?
కరీంనగర్‌లో ప్రతి పౌర్ణమికి ఒక కవి ఇంటి డాబాపై కూర్చుని కవిత్వం చెప్పడమే ‘ఎన్నిల ముచ్చట్లు’ కార్యక్రమం. తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో 13 సంవత్సరాలుగా ఈ కవుల గోష్ఠి అప్రతిహతంగా కొనసాగుతున్నది. గోష్ఠిలో పాల్గొనే కవుల కవిత్వాన్ని ‘సాహితీ సోపతి’ అనే ప్రచురణ సంస్థ ముద్రిస్తున్నది.ఈ పరంపరలో సుమారు డజన్ మంది కొత్త కవులు కవితల సంకలనాలు వెలుగులోకి వచ్చాయి.
తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర?
మలిదశ తెలంగాణ ఉద్యమంలో నేనొక కవిగా, రచయితగా భాగస్వామిని. రెండున్నర దశాబ్దాల నుంచి నేను తెలంగాణ రచయితల వేదికలో సభ్యుడిని. ఆ సంస్థ వ్యవస్థాపక ఉపాధ్యక్షుడిగా చాలా సంవత్సరాలు పనిచేశాను. 2001 వరకు వెలువడిన నా కవిత్వాన్ని ఒక్కసారి పరిశోధిస్తే ఎవరికైనా తెలంగాణ ఉద్యమ్యంలో నా పాత్ర తెలుస్తుంది. కేవలం కవిగానే కాకుండా నేను ప్రత్యక్షంగా అనేక ధర్నాలకు ప్రాతినిధ్యం వహించాను. సకల జనుల సమ్మెలో ఇష్టంగా పాల్గొన్నాను.