మూడో విడత ఎన్నికల నేపథ్యంలో 163 బీఎన్ఎస్ చట్టం అమలు
జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్..
హన్మకొండ (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ మూడో విడత ఎన్నికలు జరుగు ఆయా మండలాలు, గ్రామ పంచాయతీలలో 163 బీఎన్ఎస్ చట్టం పగడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అన్నారు. 163 బీఎన్ఎస్ చట్టం అమలుపై కలెక్టర్ మాట్లాడుతూ మూడో విడత ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి మండలాల్లో సైలెన్స్ పీరియడ్ అమలులోకి వస్తుందని తెలిపారు. ఎన్నికల జరుగు మండలాల్లో పోలింగ్ ముగిసే వరకు ఎలాంటి బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, ఏ విధమైన ప్రచారాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ఈ కాలంలో బయట నుండి వచ్చిన వ్యక్తులు సంబంధిత గ్రామ పంచాయతీ పరిధిలో ఉండకూడదని తెలిపారు.
సైలెన్స్ పీరియడ్‌లో ప్రజలు గుంపులుగా చేరరాదని స్పష్టం చేశారు. పోలింగ్‌కు ముందు, పోలింగ్ సమయంలో యంత్రాంగం పటిష్ఠ పర్యవేక్షణ చేపట్టాలని, ఎలాంటి ఎన్నికల ఉల్లంఘనలు జరుగకుండా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని, ఏదేని ఉల్లంఘన జరిగినట్లు గమనిస్తే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తగు చర్యలు తీసుకోవాలని అన్ని విభాగాల నోడల్ అధికారులను ఆదేశించారు. 163 బీఎన్ఎస్ చట్టం 18వ తారీకు ఉదయం 10 గంటల వరకు ఉంటుందని తెలిపారు. జిల్లాలో ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రతి ఒక్కరూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలు పాటించాలని ఆయన ప్రజలకు సూచించారు.






