అధికారం కోసం.. అనుచితాలు!
- సంక్షేమం నుంచి ఆర్థిక సంక్షోభం దిశగా..
ఎన్నికల వ్యూహంగా మారిన ఉచితాలు
* సంక్షేమం పేరిట ప్రభుత్వాలు అమలుచేస్తున్న ఉచిత పథకాలు ఒకవైపు పేదలకు ఉపయోగపడుతున్నా.. మరోవైపు ఇవే పథకాలు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థకు గుదిబండగా మారుతున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల సుప్రీంకోర్టు కూడా ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేయడంతో, దేశవ్యాప్తంగా ఉచితాలపై విస్తృత చర్చ ప్రారంభమైంది. ఏడాదికేడాది ఉచిత పథకాలను విస్తరించడం వల్ల రాష్ట్రాల అప్పులు పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వాలు ప్రజాధనాన్ని బాధ్యతాయుతంగా వినియోగించాల్సిన అవసరం ఉందని, సంక్షేమ పథకాల ఆర్థిక ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇటీవల సూచించింది.
దేశ రాజకీయాల్లో ‘ఉచిత పథకాలు’ ఇప్పుడు ప్రధాన అజెండాగా మారాయి. ఒకప్పుడు పరిమిత స్థాయిలో అమలైన సంక్షేమ కార్యక్రమాలు, ఇప్పుడు ప్రభుత్వాల పాలనలో కీలకంగా మారాయి. స్వాతంత్య్రం తర్వాత (1950--1970 వరకు) దేశంలోని పేదరికం, నిరుద్యోగం, ఆహార కొరత వంటి సమస్యలను ఎదుర్కొనేందుకు సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వాటిని ‘ఉచితాలు’ కంటే ‘సంక్షేమ కార్యక్రమాలు’గా పరిగణించారు. ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్న ఈ తరణంలో ఉచితాలపై చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.
* దేశ రాజకీయాల్లో ఉచిత పథకాలు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. సంక్షేమం పేరిట ప్రభుత్వాలు అమలుచేస్తున్న ఉచిత పథకాలు ఒకవైపు పేదలకు ఉపయోగపడుతున్నాయనే వాదనలు వినిపిస్తుండగా, మరోవైపు ఇవే పథకాలు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థకు గుదిబండగా మారుతున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల సుప్రీంకోర్టు కూడా ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేయడంతో, దేశవ్యాప్తంగా ఉచితాలపై విస్తృత చర్చ ప్రారంభమైంది.
హైదరాబాద్, మార్చి 2౮ (విజయక్రాంతి): దేశ రాజకీయాల్లో ‘ఉచిత పథకాలు’ ఇప్పుడు ప్రధాన అజెండాగా మారాయి. ఒకప్పుడు పరిమిత స్థాయిలో అమలైన సంక్షేమ కార్యక్రమా లు, ఇప్పుడు ప్రభుత్వాల పాలనలో కీలకంగా మారాయి. విద్యుత్ నుంచి బస్సు ప్రయాణం వరకు, రైతు సబ్సిడీల నుంచి నగదు బదిలీల వరకు, అనేక రంగాల్లో ఉచిత పథకాలు విస్తరించాయి.
అయితే ఇవి నిజంగా పేదల అభి వృద్ధికి దోహదపడుతున్నాయా? లేక ప్రభుత్వాలపై దీర్ఘకాలిక ఆర్థిక భారంగా మారుతున్నా యా? అనే ప్రశ్న చర్చనీయాంశమైంది. సంక్షే మ పథకాల కోసం భారీగా నిధులు కేటాయించాల్సి రావడంతో అభివృద్ధి ప్రాజెక్టులకు నిధు ల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఏడాదికేడాది ఉచిత పథకాలను విస్తరించడం వల్ల రాష్ట్రాల అప్పులు పెరిగే అవకాశం ఉంది.
ప్రభుత్వాలు ప్రజాధనాన్ని బాధ్యతాయుతంగా వినియోగించాల్సిన అవసరం ఉందని, సంక్షే మ పథకాల ఆర్థిక ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇటీవల సూచించింది. సంక్షేమం పేరిట ప్రజాధనం వినియోగం పారదర్శకంగా, సమర్థవంతంగా జరిగితేనే నిజమైన అభివృద్ధి సాధ్యం. లేకపోతే, తక్షణ ప్రయోజనాల కోసం తీసుకునే నిర్ణయాలు భవిష్యత్ తరాలపై ఆర్థిక భారంగా మారే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దశల వారీగా ఉచిత పథకాలు..
భారతదేశంలో స్వాతంత్య్రం తర్వాత (19 50- వరకు) దేశం పేదరికం, నిరుద్యో గం, ఆహార కొరత వంటి సమస్యలను ఎదుర్కొనేందుకు సంక్షేమ కార్యక్రమాలు ప్రారం భించింది. అందులో ప్రధానంగా రేషన్‌వ్యవస్థ, రైతులకు ఎరువుల సబ్సిడీ, విద్య, ఆరోగ్య రంగాల్లో ప్రభుత్వ సేవల వంటివి ‘ఉచితాలు’ కంటే ‘సంక్షేమ కార్యక్రమాలు’గా పరిగణించారు. 1970 నుంచి 1980 వరకు పేదరిక ని ర్మూలన ప్రధాన లక్ష్యంగా మారింది.
ఇందిరా గాంధీ ప్రవేశపెట్టిన ‘గరీబీ హటావో’ కార్యక్రమం రైతులకు విద్యుత్, నీటి సబ్సిడీలు, గ్రామీణ అభివృద్ధి పథకాలు ప్రజలకు నేరుగా ఆర్థిక సహాయం అందించే విధానం బలపడిం ది. 1980 నుంచి --2000 మధ్య కాలంలో ఉచి త పథకాలు ఎన్నికల హామీలుగా మారాయి. అప్పటి తమిళనాడు సీఎం ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) 1980లో ఉచిత మధ్యా హ్న భోజన పథకం ప్రారంభించారు.
ఈ పథకం వల్ల పేద విద్యార్థుల చదువు పెరిగింది. తరువాత ఇది దేశవ్యాప్తంగా అమలైంది. 2,000 తర్వాత ఉచిత పథకాలు ఎన్నికల ప్రధాన అజెండాగా మారాయి. తమిళనాడు లో ఉచిత టీవీలు, పంజాబ్, ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత విద్యుత్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లో ఉచిత ల్యాప్‌టాప్‌లు, కొన్ని రాష్ట్రాల్లో రైతులకు నగదు సాయం వంటివి భారీగా పెరిగాయి. 2010 తర్వాత వచ్చిన సాంకేతికతతో ఉచిత పథకాల రూపం మారింది. నేరుగా బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ, ఆధార్ ఆధారిత సంక్షే మం, రైతులు, మహిళలు, విద్యార్థులకు ప్రత్య క్ష నగదు సహాయం ప్రారంభమయ్యాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే ఉచిత పథకాల రాజకీయాలకు పునాది 1980లలో పడింది. ఆనాటి సీఎం ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన రూ. 2 కిలో బియ్యం పథకం రాష్ట్ర రాజకీయా ల్లో సంచలనం సృష్టించింది. దీని ద్వారా పేదలకు ఆహార భద్రత పెరిగింది, సంక్షేమం ఎన్ని కల విజయానికి కీలకంగా మారింది. ఈ పథ కం తరువాత సంక్షేమ రాజకీయాలు రాష్ర్టం లో ప్రధాన అజెండాగా మారాయి.
2004 తర్వాత ఉమ్మడి రాష్ర్టంలో ఉచిత పథకాలు మరింత విస్తరించాయి. రైతులు, విద్యార్థులు, మహిళలు, పేదలను లక్ష్యంగా చేసుకుని అనేక పథకాలు ప్రారంభమయ్యాయి. రైతులకు ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితవైద్యం, రూ.1 కిలో బియ్యం పథకం వంటివి అమలయ్యాయి. వీటి ద్వారా పేదల జీవన ప్రమాణాలు మెరుగుడటంతోపాటు విద్య, ఆరోగ్య రంగాల్లో ప్రగతి కనిపించింది.
తెలంగాణ రాష్ట్రంలో..
2014లో తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత సంక్షేమ పథకాలు మరింత విస్తరించా యి. ప్రభుత్వం నేరుగా ప్రజల బ్యాంక్ ఖాతా ల్లో నగదు జమచేసే విధానాన్ని అమలుచేసింది. రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు బంధు, రైతు బీమా, వృద్ధులు, వికలాంగులకు ఆర్థిక సాయం కింద ఆసరా పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతులకు ఉచిత విద్యు త్ వంటివి మొదలయ్యాయి.
తద్వారా రైతుల ఆర్థిక స్థితి మెరుగుపడటంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం లభించింది. సంక్షేమం రాష్ట్ర పాలనలో ప్రధాన భాగమైంది. ఉచిత పథకాల వల్ల ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం లభించింది. పేదరికం కొంతవరకు తగ్గింది. విద్యార్థుల చదువు కొనసాగించే అవకాశాలు పెరిగాయి. రైతులపై పెట్టుబడి భారం తగ్గింది. వృద్ధులు, వికలాంగులకు ఆర్థిక భద్రత లభించింది. అయితే, ఉచిత పథకాల వల్ల రాష్ట్ర ఖజానాపై పెద్దఎత్తున భారం పడినట్లు ఆర్థిక నివేదికలు సూచిస్తున్నాయి.
రాజకీయ వ్యూహంగా మారి..
ప్రజల అవసరాలకంటే ఓటర్లను ఆకర్షించ డం ప్రధాన లక్ష్యంగా ఉచిత పథకాలు మారాయన్న విమర్శలు ప్రస్తుతం పెరుగుతున్నాయి. ఒక పార్టీ ప్రకటించిన పథకాన్ని మరో పార్టీ మరింత ఆకర్షణీయంగా ప్రకటించడం సాధారణమైంది. దీంతో సంక్షేమం రాజకీయ పోటీ గా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన అనేక పథకాలు పూర్తిస్థాయిలో అమలు కాలేదన్న విమ ర్శలు తరచూ వినిపిస్తున్నాయి. కొన్ని పథకాలు ఆర్థిక భారం మరికొన్ని పథకాలు పరిమి త స్థాయిలో మాత్రమే అమలవుతున్నాయి. దీంతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది.
ఎన్నికల హామీలుగానే..
తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికలు సంక్షేమ హామీల చుట్టూనే తిరిగాయి. ప్రధాన రాజకీయ పార్టీలు ప్రజలకు భారీ స్థాయిలో ఉచిత పథకాలు, నగదు బదిలీలు, సబ్సిడీలు ప్రకటించాయి. కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిన ‘ఆరు గ్యారంటీలు’ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పూర్తిస్థాయిలో అమలవుతున్నది.
మహాలక్ష్మి పథకం -కింద మహిళలకు నెలకు రూ. 2,500 ఆర్థిక సాయం పూర్తిస్థాయిలో అమలుకాలేదు. రైతు భరోసా పేరిట రైతులకు ఎకరాకు వార్షిక పెట్టుబడి సాయం రూ. 15,000 పూర్తిస్థాయిలో అమలుకావడం లేదు. గృహిణులకు రూ. 500కే గ్యాస్ సిలిండర్ అమలవుతున్నది. పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలులో ఉంది. యువ వికాసం కింద నిరుద్యోగ యువతకు నెలకు రూ. 4,000 పథకం ప్రారంభమే కాలేదు.
అమలు చేయలేని హామీలు..
తెలంగాణలో ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటించిన అనేక ఉచిత పథకాల్లో కొన్ని పూర్తిగా అమలు కాలేదన్న విమర్శలు, రాజకీయ ఆరోపణ లు ఉన్నాయి. కొన్ని పథకాలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి, మరికొన్ని పరిమిత స్థాయిలో మాత్రమే అమలయ్యాయి. ప్రతి నిరుద్యోగ యువకుడికి నెలకు రూ. 3,000 నగదు ఇవ్వాలని హామీ ఇచ్చినప్పటికీ ఆ పథకం అమలు కాలేదు.
ఉచితంగా లక్షల సంఖ్యలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించినప్పటికీ అవి అన్నీ పూర్తికాలేదు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు అందించే పథకం అమలు కాలేదు. పేద విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య హామీ పరిమితంగానే అమలైంది. కొన్ని గురుకుల పాఠశాలలు ప్రారంభమైనప్పటికీ ఆ పథకం పూర్తికాలేదు.
రైతు రుణమాఫీ -పూర్తిస్థాయిలో అమలుకాలేదన్న విమర్శలు ఉన్నాయి. భారీగా ఆర్థిక భారం, రాష్ట్ర ఆదాయం పరిమితంగా ఉండటం, అర్హుల గుర్తింపు సమస్యలు, పరిపాలనా, సాంకేతిక అడ్డంకుల కారణంగా ఇవి పూర్తిస్థాయిలో అమలు కాలేదు.
సంవత్సరం ఉచిత పథకం
1950 రేషన్, ఉచిత విద్య, వైద్యం ప్రారంభం
1971 గరీబీ హటావో కార్యక్రమం
1982 ఉచిత మధ్యాహ్న భోజన పథకం
1983 రూ. 2 కిలో బియ్యం పథకం
2006 ఉచిత టీవీలు, ల్యాప్‌టాప్‌లు
2004 ఎస్సీ,ఎస్టీలకు (100 యూనిట్లు) ఉచిత విద్యుత్
2004 వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకం
2014 నగదు బదిలీ ప్రారంభం
2018 రైతులకు నగదు సాయం పథకాలు
2023 మహిళలకు ఉచిత ప్రయాణం, ఉచిత విద్యుత్ విస్తరణ
2024 గృహజ్యోతి (పేదలకు 200 యూనిట్ల) ఉచిత విద్యుత్ పథకం




