29 June, 2026 | 1:13 AM

మెరుగుపడిన ద్రవ్యలోటు

01-06-2024 12:05 AM

2023 24లో 5.6 శాతానికి

న్యూఢిల్లీ, మే 31: కేంద్ర ప్రభుత్వం ద్రవ్యలోటు ముగిసిన 2023 ఆర్థిక సంవత్స రంలో మెరుగుపడింది. రెవిన్యూ వసూళ్లు పెరగడం, వ్యయాలు తగ్గడంతో ద్రవ్యలోటు జీడీపీలో 5.6 శాతానికి తగ్గినట్టు శుక్రవారం విడుదలైన అధికారిక డేటాలో వెల్లడయ్యింది. ప్రభుత్వ వ్యయం, ఆదాయం మధ్య వ్యత్యాసమైన ఈ ద్రవ్యలోటు 2023 రూ. 16.53 లక్షల కోట్లుగా నమోదయ్యింది. 2023  జీడీపీలో ఇది 5.63 శాతం. ఇది 5.8 శాతంగా ఉంటుందని బడ్జెట్లో అంచనా వేశా రు. అంతకంటే తక్కువగా నమోదుకావడం గమనార్హం. ఈ ఏడాది ఫిబ్రవరి 1న పార్లమెంటుకు సమర్పించిన మధ్యంతర బడ్జెట్లో 2023 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు రూ.17.34 లక్షల కోట్లు (జీడీపీలో 5.8 శాతం) ఉంటుందని అంచనా వేసింది.

కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (సీజీఏ) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం బడ్జెట్ అంచనాలతో పోలిస్తే 101.2 శాతం రెవిన్యూ వసూళ్లు జరిగాయి. 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నికరంగా రూ. 23.26 లక్షల కోట్ల పన్నులు వసూలయ్యాయి. రూ.44.42 లక్షల కోట్ల వ్యయం (బడ్జెట్ అంచనాల్లో 98.9 శాతం) నమోదయ్యింది. దీనితో రూ.16.53 లక్షల కోట్లకు ద్రవ్యలోటు పరిమితమయ్యింది. ప్రస్తుత 2024 ఆర్థిక సంవత్సరానికి రూ.16,85,494 కోట్లు (జీడీపీలో 5.1 శాతం) ఉంటుందని ప్రభుత్వం బడ్జెట్ అంచనాల్లో పేర్కొంది. ఫిస్కల్ రెస్పాన్స్‌బిలిటీ బడ్జెట్ మేనేజ్‌మెంట్ (ఎఫ్‌ఆర్‌బీఎం) యాక్ట్ మేరకు 2025 ద్రవ్యలోటును 4.5 శాతానికి అదుపుచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకున్నది. 

రాష్ట్రాలకు రూ.11.29 లక్షల కోట్ల బదిలీ

ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ. 23,26,524 కోట్ల నికర పన్ను ఆదాయాన్ని, రూ.4,01,888 కోట్ల పన్నుయేతర ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వం సంపాదించింది. సీజీఏ డేటా ప్రకారం కేంద్రం రూ.11,29,494 కోట్లను రాష్ట్రాలకు బదిలీ చేసింది. మొత్తం ప్రభుత్వ వ్యయంలో రూ.34.94 లక్షల కోట్లు రెవిన్యూ వ్యయంకాగా, రూ.9.48 లక్షల కోట్లు మూలధన వ్యయం. రెవిన్యూ వ్యయంలో రూ.10,63,871 కోట్లు వడ్డీ చెల్లింపులకు పోగా, రూ.4,13.542 కోట్లు సబ్సిడీల కోసం ఖర్చు చేశారు.